Tirumala Updates : తిరుమలలో పెరిగిన రద్దీ.. బారులు తీరిన భక్తులు..! ఈనెల 5న శ్రీవారికి పెద్దశేష వాహన సేవ
Tirumala Tirupati Devasthanams Updates : తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శానికి 18 గంటలకుపైగా సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. దీపావళి పండగతో పాటు వీకెండ్ సెలవులు రావటంతో శ్రీవారి దర్శనానికి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో రద్దీ మరింత పెరిగింది. సామాన్య భక్తులకు శ్రీవారిని దర్శించుకునేందుకు 18 గంటలకుపైగా సమయం పడుతుంది. శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.
శనివారం(నవంబర్ 2) తిరుమల శ్రీవారిని 88,076 భక్తులు దర్శించుకున్నారు. 36,829 మంది తలనీలాలు సమర్పించారు. రూ. 3.52 కోట్లు హుండు కానుకలు వచ్చాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
నవంబరు 5న పెద్ద శేష వాహన సేవ!
తిరుమలలో నవంబరు 5వ తేదీన నాగుల చవితి పర్వదినం సందర్భంగా పెద్దశేష వాహనం సేవ జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటలవరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దర్శనమివ్వనున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నారు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ వైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు.
ఈ విధంగా స్వామివారు, దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి తిరువీధులలో విహరిస్తూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తాడు. అందుకే బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఆ భగవంతుడు ప్రసాదించాడు అంటూ టీటీడీ తెలిపింది.
శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానం :
నవంబరు 13వ తేదీన కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు.
చారిత్రక వివరాల్లోకి వెళ్తే… కైశిక ద్వాదశిని ప్రబోధనోత్సవం అని, ఉత్తానద్వాదశి అని కూడా వ్యవహరిస్తారు. వివిధ గ్రంధాల్లో పేర్కొన్న విధంగా స్థితికారుడైన శ్రీమహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా వ్యవహరిస్తారు. శ్రీమహావిష్ణువు ఆషాఢశుక్ల ఏకాదశినాడు గాఢ నిద్రలోకి వెళ్ళారు. కైశికద్వాదశినాడు ఆయనను మేల్కొల్పు చేయడం రివాజు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైవున్న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవాన్ని ప్రతిఏటా టిటిడి ఘనంగా నిర్వహిస్తుంది.