Andhra Cab Drivers: ఆంధ్రా క్యాబ్ డ్రైవర్లపై తెలంగాణలో వేధింపులపై ఆందోళన..ఏపీ సిఎం జోక్యం చేసుకోవాలని వినతి
Andhra Cab Drivers: ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో తెలంగాణలో ఆంధ్రా క్యాబ్ డ్రైవర్లపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పలువురు డ్రైవర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి తరలి వచ్చారు.
Andhra Cab Drivers: జూన్2తో ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రా క్యాబ్ డ్రైవర్లతో పాటు వారి వాహనాలపై దాడులకు దిగుతున్నారని ఏపీ స్థానికత కలిగిన డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని కోరుతూ పలువురు క్యాబ్ డ్రైవర్లు మంగళవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి తరలి వచ్చారు. హైదరాబాద్‌లో దాదాపు 400మందికిపైగా ఏపీ క్యాబ్ డ్రైవర్లు ఉన్నారని, జూన్ 2 తర్వాత రవాణా శాఖ అధికారులతో పాటు తెలంగాణ డ్రైవర్లు తమపై దాడులు చేస్తున్నారని వాపోయారు.
ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో తమ వాహనాలను హైదరాబాద్‌లో తిరగనివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లో ఏపీ రిజిస్ట్రేషన్ నంబరుతో ఉన్న వాహనాలను అడ్డుకుంటున్నారని, ప్రయాణికులు ఉన్నా వారిని బలవంతంగా దించేస్తున్నారని చెబుతున్నారు. వాహనాలను అడ్డుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెబుతున్నారు.
దాదాపు నెల రోజులుగా రవాణా శాఖ అధికారులు, తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు ఏపీ వాహనాలను నిలిపి వేస్తున్నారని దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఏపీలో వాహనాలను కొనుగోలు చేసి వాటిని హైదరాబాద్‌లో క్యాబ్ సర్వీస్ కోసం వినియోగిస్తున్న వారితో పాటు రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కొనుగోలు చేసిన వాహనాలను కూడా హైదరాబాద్‌లో తిరగనివ్వడం లేదని చెబుతున్నారు.
ఏపీ స్థానికత ఉండటంతో వాహనాలను స్థానిక చిరునామాలతో ఏపీలో కొనుగోలు చేసి హైదరాబాద్‌లో ఉపాధి పొందుతున్నామని, జూన్ 2 గడువు ముగియడంతో మళ్లీ లైఫ్ టాక్స్ కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని, ఏపీలో రవాణా పన్నులు చెల్లించిన వాహనాలను తెలంగాణలో తిరగనిచ్చేది లేదని చెబుతుండటంతో తమపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికిప్పుడు తెలంగాణలో లైఫ్ టాక్స్ కట్టాలంటే తమకు ఈఎంఐలతో పాటు అదనపు భారం పడుతుందని చెబుతున్నారు. ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం జరుగనుండటంతో క్యాబ్ డ్రైవర్ల సమస్యలను కూడా ప్రస్తావించాలని కోరుతున్నారు. కనీసం ఏడాది పాటు లైఫ్ టాక్స్ మినహాయింపు ఇవ్వడంతో పాటు ఏపీ రిజిస్ట్రేషన్ వాహనాలను అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ల విజ్ఞప్తి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి దృష్టికి సమస్య తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు.