Aquaculture In AP : 70 ఎకరాల్లో కోస్టల్ ఆక్వాకల్చర్ అభివృద్ధి.. ఏ జిల్లాలో అంటే?
ఆక్వాకల్చర్ ను అభివృద్ధి చేసందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా 70 ఎకరాల్లో కోస్టల్ ఆక్వాకల్చర్ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది.
ఫుడ్ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించడంలో భాగంగా AP ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్, నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (NFDB) వెబ్ నార్ నిర్వహించింది. శ్రీకాకుళం జిల్లా మూలపొలం తీరప్రాంతంలో ఆక్వాకల్చర్ సౌకర్యాల అభివృద్ధిపై అధికారులు చర్చించారు.
ఆంధ్రప్రదేశ్‌లో బోర్డుకు కార్యాలయం లేని కారణంగా విజయవాడ లేదా విశాఖపట్నంలో ఎన్‌ఎఫ్‌డీబీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు చర్చించారు. ఆక్వాకల్చర్ ఉత్పత్తుల్లో ఏపీ అగ్రగామిగా ఉందని ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు అన్నారు. ఎగుమతులను పెంచేందుకు రాష్ట్రంలో ఎన్‌ఎఫ్‌డీబీ కార్యాలయాన్ని ప్రారంభించడం సరైందని అభిప్రాయపడ్డారు.
తమ మాస్టర్ ప్లాన్ ప్రకారం శ్రీకాకుళం జిల్లా మూలపొలం వద్ద రెండు దశల్లో పీపీపీ పద్ధతిలో 70 ఎకరాల్లో ఆక్వాకల్చర్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ఎన్‌ఎఫ్‌డీబీ ప్రతినిధులు వివరించారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.120 కోట్లు అని తెలిపారు. దీని కింద చేపల పెంపకందారులకు సరఫరా చేసేందుకు, చేపల పెంపకం, నర్సరీ, హేచరీ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయనున్నటుగా వెల్లడించారు.
ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ (ఏపీఎఫ్‌పీఐఎఫ్), సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్, డెల్టా ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ వెబ్‌నార్‌లో పాల్గొన్నారు. ఎన్‌ఎఫ్‌డిబి చీఫ్ ఎగ్జిక్యూటివ్ సి.సువర్ణ, సీనియర్ ఎన్‌ఎఫ్‌డీబీ, హైదరాబాద్, అధికారులు ఎన్.వెంకటేష్, ఎల్.నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.