AP Inter Colleges : ఇంటర్ కాలేజీల టైమింగ్స్‌లో మార్పు - ఎప్పట్నుంచంటే..!
రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కాలేజీల టైమింగ్స్‌లో మార్పు చేశారు. ఇక నుంచి మార్పు చేసిన టైమింగ్స్‌లోనే కాలేజీలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఇంటర్మీడియేట్ బోర్డు డైరెక్టర్ కృతిక శుక్లా ఉత్తర్వులు ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్, ఎయిడెడ్ కాలేజీల సమయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం ఇంటర్మీడియేట్ కాలేజీలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఆ టైమింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సవరించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు టైమింగ్స్‌ను పొడించారు. ఈనెల 16 నుంచి మారిన టైమింగ్స్ అమలులోకి వస్తాయని డైరెక్టర్ కృతిక శుక్లా తెలిపారు.
గతేడాది ఫలితాల్లో ఆశించిన స్థాయిలో విద్యార్థులు రాణించకపోవడంతోనే గంట సేపు టైమింగ్స్ పెంచామని, ఆ గంటసేపు విద్యార్థులు కాలేజీల్లోనే చదువుకుంటారని తెలిపారు. ఇక నుంచి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు కాలేజీల్లో స్టడీ అవర్స్ నిర్వహించాలని డైరెక్ట్ కృతిక శుక్లా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు టైమ్ టేబుల్స్‌ను సిద్ధం చేయాలని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ ఇంటర్మీడియేట్ కాలేజీ ప్రిన్సిపల్స్‌కు ఆమె ఆదేశించారు.
విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు…
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో ఇచ్చినట్లే ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలని ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. ఆ కార్డు నమూనాను కళాశాలకు పంపించారు. వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు తెల్లరంగు, జనరల్ విద్యార్థులకు మొదటి సంవత్సరం వారికి లేత పసుపు రంగు, రెండో సంవత్సరం విద్యార్థులకు నీలం రంగు కార్డులను ముద్రించి ఇవ్వాలని కృతిక శుక్లా ఆదేశించారు.
అలాగే వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్‌లో ఎన్‌సీఆర్టీ సిలబస్ అముల చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాల్లో మార్పులు తీసుకొస్తామన్నారు. మరోవైపు ఇంటర్మీడియట్ విద్యార్థులకు జేఈఈ, నీట్, ఈఏపీ సెట్ వంటీ పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
అక్టోబర్ 15 నుంచి 21 వరకు త్రైమాసిక పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు అక్టోబర్ 15 నుంచి 21 వరకు త్రైమాసిక పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుండి 10.30 గంటల వరకు, రెండో సంవత్సరం విద్యార్థులకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు వరకు పరీక్షలను నిర్వహిస్తారు.
ప్రతిరోజూ ఒక సబ్జిక్ట్‌కు పరీక్ష నిర్వహిస్తారు. దసరా సెలవులు అనంతరం పరీక్షలు ప్రారంభం అవుతాయి. దసరా సెలవులు అక్టోబర్ 13తో ముగియనున్నాయి. అక్టోబర్ 14 ఒక్క రోజే గ్యాప్ ఉంటుంది. అక్టోబర్ 15 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి.