Sadaram Slots: ఏపీలో సదరం సర్టిఫికేట్ కోసం స్లాట్ బుకింగ్ ప్రారంభం అయింది. అక్టోబర్ 14 నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రంలో ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు జరుగుతాయి. మీసేవ, గ్రామ, వార్డు సచివాలయాల్లో సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌కు సంబంధించి సదరం (వికలాంగుల ధ్రువీకరణ పత్రం) అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ (సోమవారం) ప్రారంభం అయింది. గతంలో సదరం స్లాట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పుడు స్లాట్ అలాట్మెంట్ అయ్యే అవకాశం ఉంది.
స్లాట్ తేదీ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలలో సమాచారం వస్తుంది. లేకపోతే స్లాట్ బుకింగ్ రసీదులో ఉన్న సదరం ఐడీను వెబ్‌సైట్‌లో ఎంటర్ చేస్తే ప్రస్తుతం సదరం స్టేటస్ తెలుసుకోవచ్చు. సదరం స్లాట్ ఎక్కువ కాలం అందుబాటులో ఉండవు కనుక అందుబాటులో ఉన్న సమయంలోనే బుకింగ్ చేసుకోవాలి.
రాష్ట్రంలో ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఈనెల 14 నుంచి వైద్య పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ వైద్య పరీక్షలు డిసెంబర్ వరకు కొనసాగుతాయి. మీసేవ, గ్రామ, వార్డు సచివాలయాల్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. శారీరక వైకల్యం, మానసిక లోపాలు, కంటిచూపు లోపం వంటి ఇతర లోపాలతో బాధపడే వారికి వైకల్యాన్ని నిర్ధారిస్తూ అందించేదే సదరం సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్‌ను ఆధారంగా తీసుకునే ప్రభుత్వం పెన్షన్, ఇతర దివ్యాంగు కోటా సంక్షేమ పథకాలను అందిస్తోంది.
ఈ సదరం సర్టిఫికేట్‌ను ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేటు వైద్యులు కాకుండా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ రకాల కొలమానాల ప్రకారం అందిస్తారు. ఏదైనా ప్రమాదం జరిగి అవయవాలు కోల్పోయిన వారికి ఆర్థో, అంధత్వం, వినికిడి, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం సదరం సర్టిఫికేట్ జారీ చేస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్, రాష్ట్ర, కేంద్ర రవాణా సంస్థలైన ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ప్రయాణ చార్జీల్లో రాయితీలు, చిన్న పరిశ్రమ స్థాపనకు రుణాలు, సబ్సిడీకి సందరం సర్టిఫికేట్ ఎంతో ఉపయోగపడుతోంది.
స్లాట్ పొందేందుకు మీ-సేవ, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్, పాస్‌పోర్టు సైజ్ ఫొటో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, వయస్సు, లింగం, వైవాహిక స్థితి, కులం, మతం సహా విద్యార్హత, అలాగే రేషన్ కార్డు నంబర్ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆసుపత్రి, తేదీ, సమయం కేటాయిస్తు ఫోన్‌కు మెసేజ్ వస్తుంది.
కేటాయించిన తేదీ, సమయానికి ఆ ఆసుపత్రికి వెళ్లాలి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించే శిబిరాల్లో వైద్యులు పరీక్షించి వైకల్యం నిర్ధారించి ధ్రువపత్రం అందజేస్తారు. సర్టిఫికేట్ ఉన్నవారు పునరుద్ధరించుకునేందుకు (రెన్యువల్) కూడా స్లాట్ అవసరం ఉంటుంది.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)