AP Budget : ఐదు నెలల కూటమి పాలనలో ఆదాయం 9 శాతం తగ్గింది : బుగ్గన
AP Budget : ఏపీ బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సెటైర్లు వేశారు. అప్పులు, లెక్కల విషయంలో కూటమి ప్రభుత్వం బాగా నటిస్తోందన్నారు. డిస్కంల నష్టాలు పెంచింది చంద్రబాబేనని స్పష్టం చేశారు. ఐదు నెలల కూటమి పాలనలో ఆదాయం 9 శాంత తగ్గిందని లెక్కలు చెప్పారు.
సూపర్ సిక్స్‌లో ఇప్పటి వరకూ పావు దీపం పథకం తప్ప.. ఒక్కటి కూడా అమలు కాలేదని.. మాజీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. సూపర్ సిక్స్‌లో 3 పథకాలు గ్రౌండ్ అయ్యాయని అసెంబ్లీలో అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు నెలల కూటమి పాలనలో ఆదాయం 9 శాతం తగ్గిందన్నారు. అబద్ధాలు చెప్పీ చెప్పీ కూటమి పరిస్థితి నాన్నా పులి కథలా అవుతుందని ఎద్దేవా చేశారు.
'బ్యాంక్ అప్పు, ప్రభుత్వం ఇవ్వాల్సింది.. రెండు అప్పులు డబుల్ ఎంట్రీ చేసి లెక్కలు ఎక్కువ చెబుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ నుండి తీసుకున్న ఓపెన్ మార్కెట్ బారోయింగ్‌లో కూడా.. తెలుగుదేశం ప్రభుత్వం కంటే తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చాం. డిస్కంల నష్టాలు పెంచింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. టీడీపీ ఐదేళ్ల పాలనలో విద్యుత్ సరఫరా సంస్థల నష్టాలు రూ. 22,089 కోట్లు' అని బుగ్గన వివరించారు.
'వైయస్ఆర్ కాంగ్రెస్ హయాంలో రూ.395 కోట్లు మాత్రమే విద్యుత్ సరఫరాల సంస్థకు నష్టం వచ్చింది. టీడీపీ పాలనలో విద్యుత్ సంస్థలకు చేసిన అప్పు రూ.56,664 కోట్లు. జగన్ హయాంలో రూ.36,603 కోట్లు. ఈ ఐదు నెలల్లో 18,000 కోట్లు విద్యుత్ భారాన్ని కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపుతోంది' అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
'ఉద్యోగుల సొమ్ము ఇతర అవసరాలకు వినియోగించారని తెలుగుదేశం తప్పుడు ఆరోపణలు చేస్తోంది. టీడీపీ హయాంలో పబ్లిక్ అకౌంట్‌లోని రూ.57,378 కోట్లు ఇతర పర్పస్‌లకు వాడారు. వైయస్ఆర్ సీపీ హయాంలో ప్రభుత్వ అవసరాలకు వినియోగించిన పబ్లిక్ అకౌంట్ నిధులు రూ.655 కోట్లు మాత్రమే. గ్యారెంటీలు, కార్పొరేషన్ అప్పుల విషయంలోనూ టీడీపీ దుష్ప్రచారమే చేస్తోంది' అని బుగ్గన విమర్శించారు.
'వైయస్ జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ డీబీటీ ద్వారానే ఇచ్చాం. ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో అకౌంట్లో ఉంది. ఎవరికి ఇచ్చామో బ్యాంక్ రికార్డ్స్‌లో ఉంది. ఇక ఇందులో స్కామ్‌కు అవకాశమే లేదు. అప్పుల లెక్కల విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బాగా నటిస్తోంది' అని బుగ్గన ఎద్దేవా చేశారు.
'పథకాలకు కేటాయింపులు లేకుండానే రూ.41 వేల కోట్లు ఎక్కువ చూపిస్తున్నారు. అమరావతికి రూ.15వేల కోట్లు చూపించారు. అది గ్రాంటా? అప్పో? చెప్పలేదు. 24 వేల కోట్ల పన్ను ఏ విధంగా పెంచుతారో ప్రభుత్వం చెప్పాలి. 2.బడ్జెట్లో రూ.5 వేల కోట్లు ఎక్కడెక్కడో కేటాయించారు. వాస్తవానికి తల్లికి వందనం పథకానికి రూ.12,450 కోట్లు అవసరం. తల్లికి వందనం పథకం ఇంటింటికీ ఎంత ఇవ్వబోతున్నారో చెప్పాలి' అని బుగ్గన డిమాండ్ చేశారు.