Attack On YCP Office: గుంటూరులో మంత్రి విడదల రజిని కార్యాలయంపై దాడి
Attack On YCP Office: గుంటూరులో న్యూఇయర్ వేడుకల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రారంభోత్సవానికి సిద్ధమైన మంత్రి విడదల రజిని పార్టీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. రోడ్డుపై ఉన్న వైసీపీ ఫ్లెక్సీలను చించేశారు.
Attack On YCP Office: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గుంటూరులో మందుబాబులు వీరంగం సృష్టించారు. విద్యా నగర్ రింగు రోడ్డుకు సమీపంలో ఉన్న మంత్రి విడదల రజిని ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దీంతో కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైకాపా ఇంఛార్జిగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని ని నియమించారు. జనవరి 1న పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
అయితే అర్ధరాత్రి కొంత మంది దుండగులు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీఛార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో ఉన్న టీడీపీ-జనసేన అభిమానులు, కార్యకర్తల్ని అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. దాదాపు గంటన్నర పాటు రోడ్డుపై యువకులు వీరంగం సృష్టించారు.
విద్యానగర్‌లో మంత్రి విడదల రజిని కార్యాలయంపై ఆదివారం రాత్రి దాడి జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం ఉదయం పదిన్నరకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు రజిని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ సందర్భంగా టీడీపీ-జనసేన కార్యకర్తలు ఆదివారం రాత్రి భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి రజిని కార్యాలయం మీదుగా వాహనాలు వెళుతున్న క్రమంలో వైసీపీ కార్యకర్తలతో ఘర్షణ జరిగిందని చెబుతున్నారు.
ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వెళుతుండగా వైసీపీ కార్యకర్తలు కవ్వించినట్టు టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ-జనసేన కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో పార్టీ కార్యాలయం అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతోనే ఉద్రిక్తత తలెత్తిందని టీడీపీ-జనసేన కార్యకర్తలు చెబుతున్నారు.
మరోవైపు టీడీపీ కార్యకర్తలు పథకం ప్రకారమే తమ పార్టీ కార్యాలయంపై దాడి చేశారని మంత్రి విడదల రజిని ఆరోపించారు. ముందే రాళ్లను తమ వెంట తెచ్చుకుని భవనంపై దాడి చేశారని ఆరోపించారు. దాడి వెనుక ఎవరున్నా తాము విడిచి పెట్టమని చెప్పారు.
2019 ఎన్నికల్లో చిలకలూరి పేట నుంచి గెలిచిన విడదల రజినిని ఇటీవల గుంటూరు పశ్చిమ నియోజక వర్గానికి అభ్యర్థిగా ఖరారు చేశారు. తాజాగా జరిగిన ఘర్షణతో విద్యానగర్‌లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు.