Arunachalam Giri Pradakshina : జులై 20న అరుణాచలం గిరి ప్రదక్షిణ- ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు, ప్యాకేజీలు ఇవే
Arunachalam Giri Pradakshina : జులై 20న అరుణాచలం గిరి ప్రదక్షిణకు ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది.
Arunachalam Giri Pradakshina : ఈనెల 20న పుణ్యక్షేత్రం అరుణాచలం (తిరువణ్ణామలై) గిరి ప్రదక్షిణ కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్వీసులు ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి తమిళనాడులోని అరుణాచలానికి నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. భక్తులందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
పశ్చిమ గోదావరి జిల్లా తుని నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు అరుణాచలం గిరి ప్రదక్షిణతో పాటు వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా సర్వీస్ నడుపుతున్నారు. ఈ నెల 19న మధ్యాహ్నం 12 గంటలకు తుని బస్ కాంప్లెక్స్ నుంచి బయలుదేరి విజయవాడ, శ్రీకాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం పుణ్యక్షేత్రాల్లో దర్శనం చేసుకున్న తరువాత అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్తుంది. గిరి ప్రదక్షిణ అనంతరం కంచి దర్శనం చేసుకుంటారు. పుణ్యక్షేత్రాల దర్శనాలు ముగించుకుని జులై 22 న తిరిగి వస్తాయి. ఈ బస్సులో ప్రయాణం చేసేందుకు పెద్దలకు ఒక్కొక్కరికి టిక్కెట్లు ఛార్జ్ రూ.3,500, పిల్లలకు రూ.2,625 నిర్ణయించారు.
టికెట్ రిజర్వ్ చేసుకునేవారు డిపో కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. వివరాలకు 7382913216, 8555058080, 7330651904, 7382913016 ఫోన్ నంబర్లను సంప్రదించాలని తుని ఆర్టీసీ డిపో మేనేజర్ ఎన్.కిరణ్ కుమార్ తెలిపారు. అలాగే ఆషాఢ మాసంలో పెద్దాపురం మరిడమ్మ దర్శనానికి కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి శనివారం ఉదయం 5.15 గంటలకు, 6.15 గంటలకు తుని డిపో నుంచి వాడపల్లికి పల్లెవెలుగు బస్సులు అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. టికెట్టు ధర రెండు వైపు రూ.500 ఉంటుంది. అలాగే శ్రీశైలం వెళ్లటానికి ప్రతి రోజు తుని డిపో నుంచి ఉదయం 5.30 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు సూపర్ లగ్జరీ అందుబాటులోకి తెచ్చామని అన్నారు.
కడప జిల్లా నుంచి అరుణాచలానికి పది బస్సు సర్వీస్‌లు
కడప జిల్లా నుంచి పుణ్యక్షేత్రం అరుణాచలం (తిరువణ్ణామలై) గిరి ప్రదక్షిణకు పది బస్సు సర్వీసులు అందుబాటులోకి ఏపీఎస్ఆర్టీసీ తెచ్చింది. అందులో భాగంగా ఏ బస్సు ఎక్కడ నుంచి ఎప్పుడు బయలు దేరుతుందో అనే వివరాలు కడప జిల్లా ఆర్టీసీ అధికారి పొలిమేర గోపాల్ రెడ్డి తెలిపారు. కడప డిపో నుంచి ఈనెల 20న రాత్రి 9 గంటలకు అరుణాచలానికి సూపర్ లగ్జరీ బస్సు బయలు దేరుతుంది. ఈ సర్వీస్ రాయచోటి, చిత్తూరు, వేలూరు మీదుగా అరుణాచలం చేరుకుంటుంది. రానుపోను టిక్కెట్టు ధర రూ.1,072గా నిర్ణయించామని తెలిపారు.
బద్వేలు డిపో నుంచి ఈనెల 20న ఉదయం 7 గంటలకు అల్ట్రా డీలక్స్ బస్సు అరుణాచలానికి బయలుదేరుతుంది. ఈ సర్వీసు పెంచలకోన, శ్రీకాళహస్తి, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుకుంటుంది. అలాగే సూపర్ లగ్జరీ సర్వీస్ రాత్రి 7 గంటలకు ఇదే మార్గం వెళ్తుంది. టిక్కెట్టు ధర రూ.1,688గా నిర్ణయించామన్నారు. మైదుకూరు డిపో నుంచి ఈనెల 20న ఉదయం 6 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు అరుణాచలానికి బయలుదేరుతుంది. ఈ సర్వీసు పోరుమామిళ్లలో బయలుదేరి కడప, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుకుంటుంది. అలాగే మరో బస్సు సర్వీస్ మైదుకూరులో సాయంత్రం 6 గంటలకు ఇదే మార్గం వెళ్తుంది. టిక్కెట్టు ధర రూ.1,024గా నిర్ణయించామన్నారు.
ప్రొద్దుటూరు డిపో నుంచి ఈనెల 20న సాయంత్రం 5 గంటలకు, 6 గంటలకు రెండు బస్సు సర్వీసులు మైదుకూరు, కడప మీదుగా అరుణాచలం చేరుకుంటాయి. టిక్కెట్టు ధర రూ.1,273గా నిర్ణయించామన్నారు. జమ్మలమడుగు డిపో నుంచి ఈనెల 20న ఉదయం 5.30 గంటలకు బయలుదేరే బస్సు ఛార్జీ 1,352గా నిర్ణయించామని, మరో బస్సు సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుందని, దాని ఛార్జీ రూ.1,568గా నుందని అన్నారు. ఈ రెండు సర్వీసులు ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప మీదుగా అరుణాచలం చేరుకుంటుంది. పులివెందుల డిపో నుంచి ఈనెల 20న సాయంత్రం 7 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు అరుణాచలానికి బయలుదేరుతుంది. ఈ బస్సు సర్వీసు పీలేరు, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుకుంటాయి. టిక్కెట్టు ధర రూ.1,242గా నిర్ణయించామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముందుగానే టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం