Ashada masam 2024: చంద్రుడు పూర్వాషాఢ, లేదా ఉత్తరాషాఢ నక్షత్రానికి పౌర్ణమి రోజు దగ్గరగా ఉండటం చేత ఈ మాసానికి ఆషాఢమాసమని పేరు. గురు పూజలకు, మహా విష్ణువును పూజించడానికి , మరియు శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు (వారాహి అమ్మవారు) ఆరాధనలకు ప్రాధాన్యత ఉన్న మాసం ఆషాఢమాసం. శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి ఏకాదశి రోజు జారుకోవడం చేత ఈ మాసంలో వచ్చే దేవశయన ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఈ మాసంలో పౌర్ణమి రోజు గురుపూజలకు గురు ఆరాధనలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వ్యాస పౌర్ణమిని గురు పూర్ణిమ లేదా ఆషాఢ పూర్ణిమగా జరుపుకుంటారు. అంతటి విశేషం ఉన్నది కాబట్టే ఈ మాసానికి అత్యంత ప్రాముఖ్యత లభించిందని చిలకమర్తి తెలిపారు. ఆషాడ పూర్ణిమ రోజు వేద వ్యాసుల వారిని పూజించి, వ్యాసుల వారు అందించినటువంటి మహాభారతం, భగవద్గీత, అష్టాదశ పురాణాలు వంటివి ఏదో ఒకటి చదువుకుని వ్యాసుల వారికి తర్పనాలు వదలడం చేత విశేష పుణ్యఫలం లభిస్తుందని చిలకమర్తి తెలిపారు.
గురు పూర్ణిమ రోజు సంప్రదాయం ప్రకారం గురువులను పూజించాలి. గురు పూర్ణిమ రోజు ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలను అనుసరించి, వారి పరంపరలను బట్టి, అవి అందించిన గురువులైనటువంటి శంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి వారిని పూజించాలని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఆషాఢమాసంలో మొదటి తొమ్మిది రోజులు వారాహీ అమ్మవారిని పూజించడం మంచిది. వారాహీ దేవిని ఈ మాసంలో పూజించిన వారికి బాధలు నశించి శత్రువులపై విజయం కలుగుతుంది. శక్తిస్వరూపిణి అయినటువంటి వారాహీ అమ్మవారిని పూజించడం చేత విఘ్నాలు, ఆపదలు తొలగి శత్రువులపై విజయం కలుగుతుందని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఆషాఢ మాసంలో చాతుర్మాస దీక్షలు, చాతుర్మాస వత్రాలు చాలా విశేషమైనవని చిలకమర్తి తెలిపారు. అందువల్ల ఎవరైతే సన్యాస ఆశ్రమంలో ఉన్నారో వాళ్లు ఆషాడ మాస శుక్ల పక్ష ఏకాదశి (శయన ఏకాదశి) నుంచి కార్తిక మాస శుక్ష పక్ష ఏకాదశి (తొలి ఏకాదశి) వరకు ఈ నాలుగు నెలలు చాతుర్మాస దీక్షలు చేస్తారని చిలకమర్తి తెలిపారు.