APPSC Latest Notifications: నెలాఖరులోగా ఏపీపీఎస్సీ కొత్త నోటిఫికేషన్లు విడుదల-arrangements to release appsc group 1 and group 2 notifications by the end of the month ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Latest Notifications: నెలాఖరులోగా ఏపీపీఎస్సీ కొత్త నోటిఫికేషన్లు విడుదల

APPSC Latest Notifications: నెలాఖరులోగా ఏపీపీఎస్సీ కొత్త నోటిఫికేషన్లు విడుదల

Sarath chandra.B HT Telugu
Nov 02, 2023 06:42 AM IST

APPSC Latest Notifications: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ తీపి కబురు అందించింది. నెలాఖరులోగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

ఏపీపీఎస్సీ జాబ్స్
ఏపీపీఎస్సీ జాబ్స్

APPSC Latest Notifications: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నెలాఖరులోపు గ్రూప్ 1, గ్రూప్ -2 నోటిఫికేషన్‌లు విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్‌ ప్రకటించారు. గ్రూప్-1లో 100, గ్రూప్-2 లో దాదాపు 900 పోస్టులు భర్తీ చేస్తామని గౌతమ్ సవాంగ్ తెలిపారు.

గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షల్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2022 గ్రూప్ వన్ నియామక ప్రక్రియ తొమ్మిది నెలల్లో పూర్తి చేశామని సవాంగ్‌ గుర్తు చేశారు.

గ్రూప్ వన్ రిక్రూట్‌మెంట్‌ కూడా తొమ్మిది నెలల్లోనే పూర్తి చేస్తామన్నారు. ఇకపై గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో రెండు పేపర్ల స్ధానంలో ఒకే పేపర్ ఉంటుందన్నారు. గ్రూప్ వన్ మెయిన్స్ లో అయిదు పేపర్లకు బదులు ఇకపై నాలుగే ఉంటాయన్నారు. రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ తరహాలో, రెండు పేపర్లు డిస్క్రిప్షన్ తరహాలో ఉంటాయని చెప్పారు.

లాంగ్వేజ్ లో రెండు పేపర్లకి బదులు ఒక పేపర్ మాత్రమే జరుగుతుందని సవాంగ్ చెప్పారు. పరీక్షల సిలబస్ లో ఎటువంటి మార్పులు ఉండవన్నారు. నిరుద్యోగులపై ఒత్తిడి తగ్గించి అభ్యర్ధులకు మేలు చేయడానికే మార్పులు చేసినట్లు చెప్పారు. యూపీఎస్సీ, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లలో పరీక్షలను పరిశీలించిన తర్వాతే మార్పులు చేశామని వివరించారు.

ఐఐటీ, హెచ్‌సీయూ, రిక్రూటింగ్‌ ఏజెన్సీలు, మేధావులు, రాష్ట్రంలోని ఆంధ్రా, నాగార్జున, శ్రీవేంకటేశ్వర, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాల సీనియర్‌ ప్రొఫెసర్లు, ఇతర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల నిపుణులు, నిరుద్యోగులతో చర్చించి... వారి సలహాలతో సిలబస్‌, పరీక్షల్లో సమూల మార్పులు తీసుకు వచ్చినట్టు సవాంగ్ తెలిపారు.

గ్రూపు-1, గ్రూపు-2 తోపాటు డిగ్రీ, జూనియర్‌ కళాశాలల లెక్చరర్ల భర్తీ తదితర నోటిఫికేషన్లను ఈ నెలలోనే విడుదల చేస్తామన్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని పలు విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలకు సంబంధించిన పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్ లో 2200 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలోనే పరీక్షలు జరిపి 2024 జనవరిలో ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

1603 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల…

వివిధ ప్రభుత్వ శాఖల్లోని 1,603 ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లను ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్ తెలిపారు. భర్తీ చేసే ఉద్యోగాల్లో గ్రూపు-1 కింద 88, గ్రూపు-2 కింద 989 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. గ్రూపు-1లో మరికొన్ని క్యారీ ఫార్వర్డ్‌ కేటగిరీలో పోస్టులు కలుస్తాయని పేర్కొంది.

ఏ విభాగంలో ఎన్ని పోస్టులంటే…

ఏపీపీఎస్సీ భర్తీ చేసే ఉద్యోగాల్లో డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టులు-267, పాలిటెక్నిక్‌ కళాశాలల అధ్యాపకులు-99, టీటీడీ డీఎల్‌, జేఎల్‌-78, జూనియర్‌ కళాశాలల అధ్యాపకులు-47, డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌-38, ఇంగ్లిష్‌ రిపోర్టర్స్‌ (ఏపీ లెజిస్లేచర్‌ సర్వీస్‌)-10, లైబ్రేరియన్లు (కళాశాల విద్య)-23, ఏపీఆర్‌ఈఐ సొసైటీ కింద 10 జేఎల్‌, 05 డీఎల్‌ పోస్టులు, ఫిషరీస్‌ డిపార్ట్‌మెంట్‌లో 4 డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో 4 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.

వీటితో పాటు భూగర్భ నీటిపారుదల శాఖ, జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ సర్వీసెస్‌, ఏపీ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టరేట్‌ సర్వీస్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ సర్వీసెస్‌, ఏపీ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌, ఏపీ మున్సిపల్‌ ఎకౌంట్స్‌ సబ్‌ సర్వీసెస్‌లో జూనియర్‌ ఎకౌంట్‌ ఆఫీసర్‌ కేటగిరీ-2, సీనియర్‌ ఎకౌంటెంట్‌ కేటగిరీ-3, జూనియర్‌ ఎకౌంటెంట్‌ కేటగిరీ-4 కింద మరికొన్ని పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్లను ఈ నెలలోనే ఏపీపీఎస్సీ జారీ చేయనుంది.

గ్రూప్‌-2 ఉద్యోగాల నోటిఫికేషన్‌ జారీ విషయంలో ప్రభుత్వ శాఖలతో ఖాళీలపై సంప్రదింపులు జరుగుతున్నాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. 900 పోస్టుల భర్తీకి అనుమతి ఉన్నప్పటికీ జోన్లు, కేటగిరీలు, హారిజంటల్‌ రిజర్వేషన్‌ అమలుకుసంబంధించిన సమాచారం అందాల్సి ఉందన్నారు. నెల రోజుల్లోగా గ్రూప్‌-2, 1 పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేస్తామని తెలిపారు. గ్రూప్‌-1 పరీక్షలు, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక హేతుబద్ధంగా ఉండేందుకు యూనివర్సిటీ నిపుణుల సలహాలు తీసుకుంటామన్నారు.

Whats_app_banner