Statue Politics: విజయవాడలో విగ్రహ రాజకీయం, రద్దీ ప్రాంతంలో అడ్డగోలుగా నిర్మాణం
Statue Politics: విజయవాడలో అత్యంత రద్దీగా ఉండే కూడళ్లలో ఒకటైన చిట్టినగర్ టన్నెల్ కూడలిలో అధికార పార్టీ నేతలు ఓ విగ్రహ నిర్మాణానికి చేస్తున్న ఏర్పాట్లు చర్చనీయాంశంగా మారాయి. ట్రాఫిక్ సమస్యల్ని దృష్టిలో పెట్టుకోకుండా ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా నిర్మాణాలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
Statue Politics: అధికారం చేతిలో ఉంటే అడ్డగోలుగా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చని ప్రజాప్రతినిధులు భావిస్తుంటారు. రద్దీ ప్రదేశాల్లో విగ్రహాల నిర్మాణంపై ఉన్నత న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పులు వెలువరించినా అవి తమకు వర్తించవని భావిస్తున్నారు. విజయవాడ నగరం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఉన్న బైపాస్ మార్గం కూడలిలో రాత్రికి రాత్రి విగ్రహ ఏర్పాటు చేస్తున్నారు.
కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో విగ్రహ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నా ఎవరి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారనే బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు.విగ్రహం ఏర్పాటు చేయడానికి ముందు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఔట్ పోస్ట్ ఉండేది. విధులు నిర్వహించే సిబ్బందికి నీడనిచ్చే ఏర్పాట్లు ఉండేవి. వాటిని తొలగించి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. ఇకపై పోలీసులు ఎండా వానల్లోనే ట్రాఫిక్ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
విజయవాడ నగరం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను మళ్లించేందుకు 70వ దశకంలో కె.ఎల్‌రావు హయంలో నిర్మించిన బైపాస్ ఇప్పుడు నగరంలో కీలక మార్గంగా మారిపోయింది. నిత్యం వేలాది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి. పెరిగిన జనాభా అవసరాలకు ఏ మాత్రం సరిపోని విధంగా ఇది తయారైంది. కొన్నేళ్ల క్రితం రోడ్డు విస్తరణ చేపట్టినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
ట్రాఫిక్ పోలీసులు కాసేపు ఏమరపాటుగా ఉంటే చిట్టినగర్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలిలో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోతుంటాయి. ఈ ప్రాంతంలో వాహనాల రద్దీని నియంత్రించడానికి… నేరుగా రోడ్డు క్రాస్ చేయకుండా యూ టర్న్ నిబంధనల్ని కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు. అలాంటి ప్రాంతంలో కొన్ని రోజులుగా ఓ నాయకుడి విగ్రహ నిర్మాణానికి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
నగరంలోని కూడళ్లలో ఎక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నా నగర పాలక సంస్థ కౌన్సిల్ అమోదం తప్పనిసరి. అధికారులు, ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ అధ్యయనం చేసి సిఫార్సు చేసిన తర్వాతే విగ్రహాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇవేమి పట్టకుండా కార్పొరేషన్ కౌన్సిల్‌లో అధికారం ఉండటంతో విగ్రహ ఏర్పాటుకు సిద్ధమయ్యారు.
ఇంతకీ ఎవరి విగ్రహం....
చిట్టినగర్ కూడలిలో ఎవరి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారనే దానిపై కూడా ఎవరికి స్పష్టత లేదు. స్థానికంగా అధికంగా నివసించే సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు.
విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో అధికంగా నివసించే సామాజిక వర్గం నాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కార్పొరేషన్‌లో అధికారంలో ఉన్న కీలక వ్యక్తి కూడా అదే సామాజిక వర్గానికి చెందడంతో, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ వర్గం ఓటర్లను మెప్పించేందుకు ఇలా జనాన్ని ఇబ్బంది పెట్టేలా విగ్రహ నిర్మాణం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
విగ్రహ ఏర్పాటుకు స్థానిక ప్రజా ప్రతినిధి మద్దతు ఉందని, వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి ఓట్లు దక్కకుండా ఇలా విగ్రహ రాజకీయాలకు తెర తీసినట్లు చెబుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో టీడీపీ-జనసేన కూటమికి ఓట్లు దక్కకుండా చేయడంలో భాగంగా ఓ సామాజిక వర్గం నాయకుడి విగ్రహాన్ని కూడలిలో ఏర్పాటు చేస్తున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
ట్రాఫిక్ సమస్య జటిలం...
విజయవాడ బైపాస్ మార్గంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం పుష్కర కాలం క్రితం ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ చేపట్టారు. అయినా అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. ఆక్రమణలతో రోడ్డు కుంచించుకుపోయింది. ఓటర్లను ఆకట్టుకోడానికి, మెజార్టీ ఓటు బ్యాంకులుగా ఉన్న సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకోడానికి అడ్డగోలుగా విగ్రహాలు ఏర్పాటు చేయడంపై స్థానికంగా అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
ఇప్పటికే విగ్రహ ఏర్పాటు కోసం భారీ పిల్లర్‌పై స్లాబ్ ఏర్పాటు చేశారు. ఇకపై బస్సులు, భారీ వాహనాలు మలుపు తీసుకోవాలంటే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.ఓట్ల కోసమే స్థానిక ప్రజా ప్రతినిధి హడావుడిగా విగ్రహ నిర్మాణాన్ని చేపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ప్రజా ప్రతినిధుల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోవడంతో అడ్డగోలుగా విగ్రహాలు పుట్టుకొస్తున్నాయి.