APSRTC : సీనియర్ సిటిజన్లకు ఏపీఎస్ఆర్టీసీ 25 శాతం రాయితీ- ఫోన్ లో ఫ్రూప్ చూపిస్తే చాలు!
APSRTC : ఏపీఎస్ఆర్టీసీ 60 ఏళ్లు పైబడిన ప్రయాణికులకు రాయితీ అమలుచేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డు చూపించి ఈ రాయితీ పొందవచ్చని తెలిపింది.
APSRTC : ఏపీఎస్ఆర్టీసీ 60 ఏళ్ల పైబడిన ప్రయాణికులకు బస్సుల్లో రాయితీ అమలు చేస్తుంది. సీనియర్ సిటిజన్లకు 25 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ రాయితీని పొందాలనుకునే 60 ఏళ్లు పైబడిన వాళ్లు ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటరు ఐడెంటిటీ కార్డు, పాస్ పోర్టు, రేషన్ కార్డులలో ఒకదానికి ప్రయాణ సమయాల్లో తీసుకెళ్లాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. సెల్ ఫోన్ లో ఆధార్ కార్డును చూపించిన దానిని రుజువుగా భావిస్తామన్నారు. ఈ కార్డుల్లో ఏ ఒక్కదాన్ని చూపించినా వృద్ధులకు టికెట్లలో 25 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. ఈ విషయంపై అన్ని జిల్లాల డిపో మేనెజర్లు... సూపర్ వైజర్లు, కండెక్టర్లకు శిక్షణ ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
డిజిటల్ కార్డులైనా పర్లేదు
వృద్ధులకు ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీని 2022 నుంచీ అమలుచేస్తున్నారు. అయితే ప్రస్తుతం వయసును రుజువు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన పలు గుర్తుంపు కార్డులను అంగీకరిస్తామని ఆర్టీసీ ప్రకటించింది. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్ పోర్టు, రేషన్ కార్డును టికెట్ కొనుగోలు సమయంలో, ప్రయాణించేటప్పుడు రుజువుగా చూపించి 25 శాతం రాయితీ పొందవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే ఫిజికల్ కార్డు లేదా ఫోన్ లో డిజిటల్ కార్డులను చూపించి టికెట్ పొందవచ్చని పేర్కొన్నారు. ఈ విషయంపై డీఎంలు సిబ్బందికి, ప్రయాణికులకు అవగాహన కల్పించాలని అధికారులు తెలిపారు.
టీఎస్ఆర్టీసీ రాయితీ
దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుక్ చేసుకుంటే, తిరుగు ప్రయాణంపై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆయా తేదీల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేదీ వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్నీ సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది. బతుక్మమ్మ, దసరా తెలంగాణలో చాలా పెద్ద పండుగలు. ఈ పర్వదినాలకు హైదరాబాద్ నుంచి ఎక్కువగా సొంతూళ్లకు ప్రయాణికులు వెళ్తారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అనేక మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ఇవ్వాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. దసరా పండుగ సెలవుల సమయంలో 15 రోజులు మాత్రమే ఈ రాయితీ అమల్లో చేస్తున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.