Opinion: ఢిల్లీ చుట్టూ ఏపి రాజకీయం.. ఆంధ్రుడి ఆత్మగౌరవం ఏమైనట్టు?
‘ఆంధ్ర ప్రదేశ్‌లోని మూడు రాజకీయ పార్టీలు స్వతంత్రంగా వ్యవహరించకుండా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దల వద్ద సాగిలపడుతున్నాయి..’ - పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధి జె.జగదీశ్వరరావు రాజకీయ విశ్లేషణ.
దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్‌కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా వేళ్లూనుకున్నాయి. అధికారం, ప్రతిపక్ష పార్టీలు ప్రాంతీయ పార్టీలే. జాతీయ పార్టీలు చొరబడటానికి ఏ చిన్న సందూ లేకుండా ప్రాంతీయ పార్టీలు విస్తరించి, క్షేత్రస్థాయిలో పాతుకుపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగువాడి ఆత్మ గౌరవమంటూ కేంద్రంపై పోరు సాగించిన చరిత్ర ఈ ప్రాంతీయ పార్టీలుకు ఉంది. అంతేకాదు ఆయా పార్టీల నాయకులు కూడా అంతే బలంగా, స్పష్టమైన వైఖరితో ఉండేవారు. రాష్ట్ర ప్రయోజనాలు, ఆంధ్రుడి ఆత్మ గౌరవానికే పెద్దపీట వేసేవారు. ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ జాతీయ పార్టీ (కాంగ్రెస్) అధికారంలో ఉన్నా, ఢిల్లీ పెద్దలకు రాష్ట్ర నాయకత్వం గులాంగిరీ చేసేవారు కాదు. పార్టీ నిబంధనలు, ప్రజాస్వామ్యంలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండేవారు. అవసరమైతే కేంద్ర పెద్దలను వ్యతిరేకించేవారు. ఈ చిన్న చిన్న ఘటనలు తప్ప ఇదే పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్( విభజనకు ముందు)లో కొనసాగింది.
నాడు ఆధిపత్యాన్ని సహించేవారు కాదు
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్.చంద్రబాబు నాయుడు వంటి సీనియర్ నేతలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని పరిపాలించారు. వీరిద్దరూ ఒకప్పుడు కాంగ్రెస్‌కు చెందిన వారే. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి సమకాలీకులు. ఒకే పార్టీలో ఉండి, ఒకేసారి మంత్రులు కూడా అయ్యారు. అయితే 1982లో కేంద్రంలోని అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా, తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆరు నెలల్లోనే 1983లోనే ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి తెలుగువారి ఆత్మగౌరవం అజెండాగా ముందుకు వచ్చింది.
1983 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై ఓటమి చెందిన చంద్రబాబు, తరువాత జరిగిన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. చంద్రబాబు కూడా వివిధ సందర్భాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటూ, అవసరమైనప్పుడల్లా తన సొంత పార్టీ కేంద్ర నాయకత్వ వైఖరిపైనే ధిక్కార స్వరం వినిపించేవారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడేవారు. ఇలా ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్ నాయకులు మాత్రం, ఢిల్లీ పెద్దల ఆధిపత్యాన్ని సహించేవారు కాదు. తమ వైఖరి స్పష్టంగా చెప్పేవారు.
అలాగే 2009 సెప్టెంబర్‌లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరణంతో ఆయన తనయుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టారు. కాంగ్రెస్ నాయకత్వ ఆదేశాన్ని ధిక్కరిస్తూ ఆయన ఓదార్పు యాత్ర చేపట్టారు. దీంతో ఆయనకు, కాంగ్రెస్ పెద్దలకు మధ్య అంతరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే సాక్షి ఛానల్, పత్రిక నాటి ముఖ్యమంత్రి రోశయ్యపైన, కాంగ్రెస్ పెద్దలపైన విమర్శలు ఎక్కుపెట్టాయి. కాంగ్రెస్ పార్టీ 125వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని సాక్షి టీవీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై విమర్శలు చేయడంతో వైఎస్ జగన్‌కు, కాంగ్రెస్ నాయకత్వానికి మధ్య దూరం, వైరం పెరిగింది.
తన తండ్రి మరణానంతరం తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డికి రాష్ట్ర మంత్రి పదవి ఇప్పించి తన కుటుంబంలో కాంగ్రెస్ చీలిక తెచ్చిపెట్టిందని ఆరోపిస్తూ జగన్, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ పార్టీకి రాజీనామా చేశారు. నాటీ కేంద్ర కాంగ్రెస్ నాయకత్వానికి వ్యతిరేకంగానే 2011 మార్చి 12న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీని స్థాపించారు. ఇలా తండ్రి వారసత్వాన్ని, కేంద్ర నాయకత్వంపై పోరు వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పార్టీ, జాతీయ పార్టీ ఆధిపత్యంపై పోరాడి, తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం పుట్టిన టీడీపీ వారసత్వాన్ని అందుకున్న చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కేంద్రానికి దాసోహం అవ్వడం విచిత్రంగా ఉంది.
విభజన తరువాత పూర్తిగా మారిన పరిస్థితి
రాష్ట్ర విభజన తరువాత పూర్తిగా పరిస్థితి మారింది. రాష్ట్రంలో అప్పటి వరకు అధికారంలో ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ పూర్తిగా తడిచిపెట్టుకుపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నడూ అధికారాన్ని చేపట్టని బీజేపీ తెలంగాణకు పరిమితం అయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ నోటా కంటే కిందన ఉంది. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు టీడీపీ, వైసీపీ బలమైన పార్టీలుగా ఉన్నాయి. జనసేన కాపు సామాజిక వర్గంలో బలమైన పార్టీగా ఉంది. అయితే ఈ పార్టీ కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయింది. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మూడు ప్రాంతీయ పార్టీలే కావడం, సొంత ప్రయోజనాలు, ఇతర కారణాలతో కేంద్రంలోని అధికారంలో ఉన్న పార్టీకి దాసోహం అంటున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఢిల్లీ పెద్దలపై పోరాడిన నేతలు, పార్టీలు రాష్ట్ర విభజన తరువాత బలం, బలగం (ఓట్లు, సీట్లు) తగ్గిపోవడం, అలాగే కేంద్రంలో మోడీ, షా ద్వయం అధికారం చేపట్టడంతో పార్టీలు, నేతలకు ప్రతికూల వాతావరణం ఏర్పాడింది.
బీజేపీ గద్దెనెక్కిన తరువాత బెదిరింపులు
2014లో కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ గద్దెనెక్కింది. అప్పటి వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. ప్రభుత్వ వ్యవస్థల్లో తన వారిని పెట్టుకున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలను చూసీ చూడనట్లుగా వదిలేసేది. కానీ మోడీ పరివారం అధికారంలోకి వచ్చిన తరువాత, ప్రతిదాన్ని తన రాజకీయ, వ్యక్తిగత ఇమేజ్ కోసమే ఉపయోగించుకుంటుంది. తనకిష్టం లేనివారిపై దాడులు, అరెస్టులు చేయిస్తుంది. జైళ్లో పెట్టిస్తుంది. గతంలో కాంగ్రెస్ కూడా కొన్ని సందర్భాల్లో ఇలానే దాడులు, అరెస్టులు చేయించేది. కానీ ఇప్పుడది మితిమీరింది. నిన్నటి వరకు అవినీతి కేసులు, ఇతర ఉగ్రవాద కేసుల పేరుతో సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను, ఎన్ఐఏ వంటి దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొన్నవారు ఈరోజు బీజేపీలో చేరితే గంగానది స్నానం చేసి పాపాలు, తప్పులు కడిగేకున్నట్లు దర్జాగా తిరుగుతున్నారు. ఇది ఈ ప్రభుత్వంలో కొత్త ట్రెండ్‌గా వచ్చింది.
కాంగ్రెస్ హయంలోనే సీబీఐని పంజరంలో చిలుక, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ అంటూ ఎద్దేవా చేశారు. అప్రజాస్వామ్యమని గగ్గోలు పెట్టేవారు. కానీ నాటి కంటే నేడు అత్యంత దారుణంగా సీబీఐతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలను కూడా దుర్వినియోగం చేస్తూ, ప్రతీకార, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడిన వారిని వేళ్లపై లెక్కించొచ్చు. ప్రతిపక్ష పార్టీలు, బాధితులు తప్ప మరెవ్వరూ, చివరి మీడియా కూడా మాట్లాడటం లేదు.
కాంగ్రెస్, ఎస్‌పీ, ఎన్‌సీపీ, డీఎంకె, టీఎంసీ, ఆప్, బీఆర్ఎస్, సీపీఎం, జేఎంఎం, ఆర్‌జేడీ, జేడీయు, శివసేన (ఠాక్రే) తదితర పార్టీలపై మోడీ వచ్చిన తరువాత కక్షసాధింపు చర్యలు పెరిగిపోయాయి. సీబీఐ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థలతో ఆయా పార్టీలపై దాడులకు పూనుకున్నారు. అయితే ఇందులో ఏ ఒక్క పార్టీ కూడా మోడీ, షా దాడులకు భయపడటం లేదు. అన్ని పార్టీలు పోరాటం చేస్తున్నాయి. మోడీ, షా ద్వయాన్ని ఎదురిస్తున్నాయి. కానీ ఏపీలో ఉండే పార్టీలు మాత్రం అందుకు భిన్నంగా భయపడుతూ మోడీ, షాకు దాసోహం అంటున్నాయి.
బెదిరింపుల వల్లే ఢిల్లీ చుట్టూ ఏపీ రాజకీయాలు
కేసుల పేరుతో మోడీ సర్కార్ చేసే బెదిరింపులే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ఒక కారణం. రాష్ట్రంలో ఉన్న అధికార, ప్రతిపక్ష మూడు ప్రధాన పార్టీలు ప్రాంతీయ పార్టీలే. వీరెవ్వరూ కేంద్రానికి సంజాయిషీ ఇచ్చుకోనవసరం లేదు. ఈ మూడు పార్టీల నాయకులు తమ పార్టీ వ్యవహారాల నిర్వహణకు ఢిల్లీ పెద్దలపై ఆధారపడనవసరం లేదు. స్వంతంగా నచ్చినట్లు పార్టీని నడిపించుకోవచ్చు. కానీ ఈ మూడు పార్టీలు స్వతంత్రంగా వ్యవహరించకుండా, కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ పెద్దల వద్ద సాగిలపడుతున్నాయి. రాష్ట్రంలోని ఈ మూడు పార్టీలు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటాయి. కానీ అన్నింటికీ మూల కారణమైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని మాత్రం ఇసుమంతైన విమర్శించవు. ఇది కదా బీజేపీ పట్ల వారి భయాన్ని స్పష్టం చేస్తుంది.
ఢిల్లీ పెద్ద అపాయింట్‌మెంటే వైసీపీ, టీడీపీలకు మహా ప్రసాదం
అధికార వైసీపీ కావచ్చు, ప్రతిపక్ష టీడీపీ, జనసేన కావచ్చు కేంద్రంలోని నేతల అపాయింట్‌మెంట్ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తారు. అపాయింట్‌మెంట్ వస్తే, అదో మహాప్రసాదంలా చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలు భావిస్తున్నారు. ఇదే ఢిల్లీ వద్ద ఆంధ్రప్రదేశ్‌ను చులకన చేసింది. ఇదే అలుసుగా బీజేపీ నేతలు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గద్దెకింద పెట్టుకుంటున్నారు. కేంద్రంలోని మోడీ, అమిత్ షాలు ఏపి రాజకీయ నేతలను కూరలో కరివేపాకులా చూస్తున్నారు. ఇది ఆంధ్రుడి ఆత్మగౌరవానికే అవమానం. కానీ రాష్ట్ర ప్రజలు చేసేదేమీ లేదు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యవహార శైలి అలా ఉంది. చంద్రబాబు లాంటి సీనియర్ నేత కూడా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలవగానే రాత్రికి రాత్రి ఢిల్లీ పరిగెత్తారు. ఇలా కబురు రాగానే, అలా వాలిపోయారు. అధికార పార్టీకి కేంద్రంతో కాస్త సఖ్యత మంచిదే. కేంద్రంతో స్నేహ పూర్వకంగా ఉంటే నిధులు, ఇతర కేంద్ర, రాష్ట్ర వ్యవహారాల విషయంలో కాస్త సానుకూలంగా ఉంటుంది.
అలాగని కేంద్రంలోని పెద్దలకు దాసోహం అనడం దారుణం. ఎందుకంటే, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, బీహార్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అవసరమైనప్పుడు కేంద్రంతో సఖ్యతగా ఉంటారు. రాష్ట్రాల హక్కుల విషయంలో వారు రాజీ పడరు. పడకూడదు కూడా. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనేక సార్లు కేంద్రాన్ని వ్యతిరేకించారు. అనేక సార్లు తమకు హక్కుగా రావల్సిన నిధులు, ఇతర కేటాయింపులు, ప్రాజెక్టుల విషయంలో విజ్ఞప్తి చేసేవారు. అంతేకాగాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల తరహాలో వారు వ్యవహరించలేదు. కేంద్ర హోం మంత్రి పిలిస్తే, రాష్ట్రంలోని ఏ ముఖ్యమైన పని ఉన్నా, దాన్ని వాయిదా వేసుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో వాలిపోతారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అంతే, తన పార్టీ ఏం చేయాలో బీజేపీ నేతలను అడుగుతారు. ఆయన కూడా ఢిల్లీ నాయకులు ఇలా పిలిస్తే, అలా వాలిపోతారు.
బీజేపీకి ప్రతిపక్షంలేని ఏకైక రాష్ట్రం ఏపీ
దేశంలో కేంద్రంలోని బీజేపీకి ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రంలోనే ప్రతిపక్షం లేదు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే లేరు. అలాగని గణనీయమైన ఓట్లు లేవు. కాకపోతే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన మూడు పార్టీలు బీజేపీకే మద్దతు. ఈ ఒరవడి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కనబడదు. దేశంలో జరిగి రాష్ట్రపతి ఎన్నికల్లో గుజరాత్ లాంటి బీజేపీ కంచుకోటలో కూడా బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఓట్లు పడ్డాయి. ఒక్క గుజరాత్‌లోనే కాకుండా దేశంలోని బీజేపీ, ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాలతో సహా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతిపక్షాల అభ్యర్థికి ఓట్లు పడ్డాయి. కానీ ఏపీలో మాత్రం ఒక్క ఓటు కూడా ప్రతిపక్ష అభ్యర్థికి పడలేదు. మొత్తం ఓట్లన్నీ బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే పడ్డాయి. వైసీపీ, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలందరూ గుంపగుత్తగా బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. ఇక్కడ మరో మర్మం లేదు. కేవలం మోడీ, షాలకు భయపడే ఓట్లు వేశారు. ఎందుకంటే గిరిజన మహిళ అభ్యర్థి కనుకనే మద్దతు ఇచ్చి, ఓట్లు వేశామని ఆయా పార్టీలు బయటకు చెప్పాయి. కానీ వాస్తవంలో భయమే మద్దతు ఇచ్చినట్లు చేసింది.
ఎందుకంటే 2012లో అగ్రవర్గానికి చెందిన ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు, ఆయనపై ఎన్‌పీపీ తరపున, బీజేపీ మద్దతు ఇచ్చిన, గిరిజనుడైన పిఎ సంగ్మా పోటీ చేశారు. కానీ వైసీపీ గిరిజనుడైన పిఎ సంగ్మాకు మద్దతు ఇవ్వలేదు. టీడీపీ ఏకంగా ఎన్నికలను బహిష్కరించింది. బహిష్కరించడమంటే, పరోక్షంగా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వడమే. 2017లో జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తరపున ఇద్దరు అభ్యర్థులు దళితులే. అయితే కాంగ్రెస్ అభ్యర్థి మీరా కుమారి దళిత మహిళ. ఆమె దేశ నాలుగో ఉప ప్రధాని, దళిత నేత బాబు జగ్జీవన్ రామ్ కుమార్తె. కానీ వైసీపీ, టీడీపీలు బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కే ఓట్లు వేశారు. అప్పుడు కూడా వంద శాతం ఓట్లు బీజేపీ అభ్యర్థికే పడ్డాయి.
ఇలా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఏం బలం లేకపోయినా, ఇక్కడి ఓట్లన్ని బీజేపీకే పడ్డాయి. కేంద్రం విధానాలను బీజేపీ పాలిత, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు కంటే, ముందుగానే అమలు చేసే ప్రయత్నం ఏపీలోనే జరుగుతుంది. కేంద్ర బీజేపీకి రాష్ట్రంలోని వైసీపీ జూనియర్ పార్టనర్‌గా ఉంది. పార్లమెంట్‌లో వైసీపీ, టీడీపీ అన్ని బిల్లులు విషయంలోనూ కేంద్రానికి మద్దతు ఇస్తున్నాయి. చివరికీ ఇటీవలి ప్రతిపక్ష పార్టీలు మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడితే, అప్పుడు కూడా బీజేపీకే అండగా నిలిచాయి.
బీజేపీ చేతులో వైసీపీ, టీడీపీ పిలకలు
ఎక్కడైనా అధికార పక్షం తప్పు చేస్తే, ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. ప్రతిపక్ష ప్రశ్నలను అధికార పక్షం తిప్పికొడుతుంది. ఇది రాజకీయాల్లో సర్వసాధారణంగా జరిగేది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం, అందుకు భిన్నంగా ఏం జరిగినా, అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్ర బీజేపీ నాయకుల వద్దకు వెళ్తారు. ఇటీవలి రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టు తరువాత సిఎం జగన్, చంద్రబాబు తరపున ఆయన తనయుడు నారా లోకేష్ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం వెంపర్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి అపాయింట్‌మెంట్ వచ్చిన వెంటనే, ఏపిలోని కాకినాడ జిల్లా సామర్లకోట పర్యటనను కూడా వాయిదా వేసుకొని ఢిల్లీ వెళ్లారు. అమిత్ షాను కలిసి చెప్పాల్సిందంతా చెప్పారు. ఢిల్లీలో దాదాపు 30 రోజులుగా మకాం వేసి, చివరికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్‌ను లోకేష్ కూడా సంపాదించారు. ఈయన కూడా అమిత్ షాకు చెప్పాల్సిందంతా చెప్పారు. వీరిద్దరూ పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో, వీరిద్దరికీ పెద్దన్న అమిత్ షా అయ్యారు.
అయితే చంద్రబాబు అరెస్టు అక్రమమా? లేక సక్రమమా? అనేది పక్కన పెడితే, చంద్రబాబు అరెస్టుతో అన్యాయం జరిగిందని భావిస్తున్న నారా లోకేష్, టీడీపీ రాష్ట్రంలో ఉండి ప్రజా క్షేత్రంలో, న్యాయస్థానాల్లో పోరాటం చేయాలి. అప్పుడే టీడీపీ కార్యకర్తలకు మనోధైర్యం కల్పించినట్లు ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు అరెస్టు, కేసుల అంశం న్యాయస్థానాల్లో ఉంది. కనుక చంద్రబాబు అరెస్టు, కేసులు సక్రమమేనని ఆధారాలతో న్యాయస్థానాల ముందు రుజువు చేయాలి. అంతేతప్ప బీజేపీకి తమ పిలకను అందజేయడం వల్ల ఆయా పార్టీలకు నష్టమే. లోకేష్, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలవడం వల్ల ఆయా పార్టీలకు, ఏపీ ప్రజలకు జరిగిన ప్రయోజనమేమీ లేదు.
ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు
ఈ రెండు పార్టీలు బీజేపీతో తామంటే, తామున్నామని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నంలో రాష్ట్ర అంశాలను, ఆయా పార్టీలు వ్యవహారాలను కేంద్రం చేతుల్లో పెడుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని కేంద్రం తమకు నచ్చినట్లు వ్యవహరిస్తుంది. వైసీపీకీ, టీడీపీకీ చేతనైతే, రాష్ట్రంలోని ఒకరిపై ఒకరు పోరాటం చేసుకోవాలి. అంతేతప్ప బీజేపీపై ఆధారపకూడదు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రంలో ఉండాల్సిన నారా లోకేష్ ఢిల్లీలో మకాం వేసి, బీజేపీ నేతల అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తుంటే తెలుగువాడి ఆత్మగౌరవం ఏం కావాలి? ఇది టీడీపీ సిద్ధాంతానికే పూర్తిగా విరుద్ధమైది కాదా? అలాగే చేతనైతే చంద్రబాబు అవినీతిని న్యాయస్థానాల్లో నిరూపించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేయాలి. అంతేతప్ప ఢిల్లీ ప్రదక్షిణల చేయడం దేనికోసం? కేంద్రంతో చర్చలు ఎందుకు? ఇలా వైసీపీ, టీడీపీ ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్ర బీజేపీకి తాకట్టు పెడుతున్నారు.
ఈ రెండు పార్టీలు తెలుసుకోవాల్సిందేమిటంటే, రాష్ట్రంలో ఆయా పార్టీలను బీజేపీ గెలుపించదు. ఇక్కడి ప్రజలు ఓట్లు వేస్తేనే, ఆయా పార్టీలు గెలుస్తాయి. అంతేతప్ప ఢిల్లీ బీజేపీ నేతలు గెలుపించలేరు. బీజేపీ నేతలకే అంత సత్తా ఉంటే, బీజేపీనే గెలుపించుకుంటారు కదా! వైసీపీని, టీడీపీని గెలుపించాల్సిన అవసరం వారికేముంటుంది. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల వైఖరితో రాష్ట్రంలోని నోటా ఓట్లతో పోటీపడుతున్న బీజేపీకి అవకాశం కల్పిస్తున్నాయి. చీటికీ మాటికీ బీజేపీపై ఆధారపడటంతో ఆ పార్టీ నేతల చేతుల్లో ఏపీ నాయకులు కీలుబొమ్మలుగా మారుతున్నారు.
టీడీపీ సిద్ధాంతం మసకబారుతుందా?
సాధ్యమైనంత వరకు రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రాన్ని దూరం పెట్టాలి. అప్పుడే రాష్ట్రంపై కేంద్రం ఆధిపత్యం తగ్గుతుంది. లేకపోతే కేంద్ర ఆదిపత్యానికి రాష్ట్రాలు లబోదిబో మనడం తప్పదు. ఇప్పటికే బీజేపీ సమాఖ్యవాదానికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాల హక్కులను హరిస్తూ పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నది. అందుకోసం పార్లమెంట్‌లో చట్టాలను చేస్తుననది. ఈ చట్టాలకు సంబంధించిన బిల్లులకు యథేచ్ఛగా వైసీపీ, టీడీపీ మద్దతు ఇస్తున్నాయి. వారి రాష్ట్ర హక్కులు కాలరాయడానికే వారే లైసెన్స్ ఇచ్చినట్లు వైసీపీ, టీడీపీ వ్యవహరిస్తున్నాయి.
ఇది ఇప్పటికీ, ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ హక్కులకు భంగమే. రాష్ట్రాల హక్కులకు, ప్రయోజనాలకు కట్టుబడి ఉండటమంటే, కేంద్రానికి సాగిలపడటం కాదు. అవసరమైనప్పుడల్లా కేంద్రాన్ని ప్రశ్నించాలి. కానీ ఏపి నాయకులు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు. వైసీపీని పక్కన పెడితే, కేంద్రం ఆదిపత్యంపై ఎదురించడం కోసమే పుట్టిన టీడీపీ కూడా కేంద్రాన్ని ప్రశ్నించకపోవటం చూస్తూ జనం ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు లాంటి సీనియర్ నేత కూడా కేంద్రానికి భయపపడటం చూస్తే, పార్టీ సిద్ధాంతం మసకబారుతుందా? అనిపిస్తోంది. ఇది రాజకీయాల్లో వచ్చిన ఒక మార్పును స్పష్టం చేస్తుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నట్లు వైసీపీ, టీడీపీ, జనసేన వ్యవహరిస్తున్నాయా?
పరిష్కారం కానీ విభజన హామీలు
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తుంది. విభజన చట్టం ప్రకారం పదేళ్లలో సమస్యలు పరిష్కారం కావాలి. కానీ ఈ నాటికి కీలకమైన సమస్యలు అలానే ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు మాత్రమే పరిష్కారం అయ్యాయి. విద్యా సంస్థల ఏర్పాటు జరిగినప్పటికీ, పూర్తిస్థాయిలో నిధులు లేక, నిర్మాణాలు నత్తనడకగా సాగుతున్నాయి. కొన్ని అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం కూడా పూర్తి కాలేదు. ఏపి, తెలంగాణ మధ్య నీటీ వివాదం కొనసాగుతునే ఉంది. ఈ అంశాలు న్యాయస్థానాల్లో కూడా ఉన్నాయి. రైల్వే జోన్ కేవలం ప్రకటనలు మాత్రమే పరిమితం అయింది. జాతీయ ప్రాజెక్టు పోలవరం అంచనాలకు కేంద్రం ఆమోదం తెలపలేదు. పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. పోర్టు, స్టీల్‌ప్లాంట్ వంటి ఏర్పాటు కాలేదు. ప్రత్యేక హోదాను పక్కన పెట్టారు. ఇలా విభజన చట్టంలోని అంశాలు అమలు కాలేదని కేంద్రాన్నిఅధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన నిలదీయటం లేదు. ప్రత్యేక హోదా సహా అనేక విషయాలను విస్మరించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే, విభజన హామీలు అమలు చేయాలి. కానీ కేంద్రంలోని బీజేపీ అమలు చేయటం లేదు. కానీ వైసీపీ, టీడీపీలు మాత్రం నోరు మెదపటం లేదు. ఏదో మొక్కుబడిగా మాట్లాడుతారు. అదీ కూడా తాము విభజన సమస్యల పరిష్కారం కోసం అడుగుతున్నామని మీడియాలో చెప్పుకోవడానికీ మాత్రమే. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ, టీడీపీ, జనసేన నిజంగా పనిచేస్తే, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రతి విషయంలో కేంద్రానికి మద్దతు ఉండే తమ విజ్ఞప్తులకు కేంద్రం ఎందుకు స్పందించటం లేదు? అనేది వైసీపీ, టీడీపీ, జనసేనలు ఆత్మ విమర్శ చేసుకోవాలి.
- జె.జగదీశ్వరరావు, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ
(డిస్‌క్లెయిమర్: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు వ్యాసకర్త వ్యక్తిగతం, లేదా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థవి మాత్రమే. హిందుస్తాన్ టైమ్స్ తెలుగుకు సంబంధం లేదు..)