Gudivada Amarnath : టీడీపీ హయాంలోనే విచ్చలవిడిగా అప్పులు… గుడివాడ అమర్‌నాథ్
Gudivada Amarnath రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి గుడివాడ అమర్ నాథ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అప్పులన్నింటిని సద్వినియోగం చేసిందని, పేదల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసమే ఖర్చు చేశామని, టీడీపీ తెచ్చిన అప్పులు ఏమయ్యాయో లెక్కలు కూడా లేవని ఆరోపించారు.
Gudivada Amarnath ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అప్పులన్నీ సద్వినియోగం చేశామని, పేదల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసమే ఖర్చు చేశామని, వాటిపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి అమర్ నాథ్ ఆరోపించారు. టీడీపీ హయంలో తీసుకున్న అప్పులు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఏపీలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మాణం కూడా వద్దంటున్నారని, రాష్ట్ర భవిష్యత్, ప్రజల అభివృద్ధిపై యనమలకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.
మండలిలో ప్రతిపక్ష నేత, టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడి ప్రభుత్వంపైనా, ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక రంగంపైనా ఏదేదో మాట్లాడారని, తనకు తాను మేధావిగా యనమల ఊహించుకుంటారని అమర్‌నాథ్ ఆరోపించారు. ఎన్టీ రామారావును పదవి నుంచి దింపడంలో చంద్రబాబుకు మించిన పాత్ర యనమల రామకృష్ణుడిదని, చివరకు ఆయనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.
యనమల రామకృష్ణుడు దాదాపు 10 ఏళ్లు ఆర్థిక మంత్రిగా పని చేశారని, గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రిగా యనమల చేసిన ఆర్థికపరమైన అన్యాయాలు, రాష్ట్రానికి చేసిన అన్యాయాలు మర్చిపోయి, వాటన్నింటినీ మాపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
2014లో విభజన తర్వాత మన రాష్ట్రానికి వచ్చిన అప్పులు రూ.1.20 లక్షల కోట్లుగా ఉంటే, 2019లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర అప్పులు ఏకంగా రూ.2.80 లక్షల కోట్లకు చేరాయని, ఆ స్థాయిలో అప్పు చేసినా, దేని కోసం ఖర్చు చేశారన్న దానికి లెక్కలు లేవని విమర్శించారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తున్నట్లు విమర్శిస్తున్నారని, వారికి మమ్మల్ని నిందించే నైతిక అర్హత లేదన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడున్నర ఏళ్లలో చేసిన అప్పు రూ.1.10 లక్షల కోట్లు మాత్రమేనని, అయితే గత మూడేళ్ల పరిస్థితి. మీ హయాంలో 5 ఏళ్ల పరిస్థితిని బేరీజు వేయరా అని నిలదీశారు. అప్పట్లొ కరోనా వంటి మహమ్మారి లేదని, అప్పుడు ఆర్థిక ఇబ్బందులు కూడా లేవన్నారు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పులు చేయాల్సి వచ్చిందని, అవన్నీ చెప్పగలమని, టీడీపీ చేసిన రూ.1.60 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారో చెప్పగలరా? అని సవాలు చేశారు. మీరు చేసిన అప్పులు ఎవరికీ ఉపయోగపడలేదని, దోచుకోవడం కోసమే ఆ అప్పులు చేశారని ఆరోపించారు.
గడచిన మూడు సంవత్సరాల మూడు నెలల్లో పేదలకు సంక్షేమం కింద అందించిన మొత్తం రూ.1.75 లక్షల కోట్లు. అది నేరుగా ప్రభుత్వం నుంచి పేదల ఖాతాల్లో పలు పథకాల కింద జమ అయింది. రాష్ట్రంలో నెలకు దాదాపు 60 లక్షల పెన్షన్లు ఇస్తున్నామని, అందుకోసం రూ.1500 కోట్లు ఖర్చు చేస్తున్నాన్నారు. ఆ స్థాయిలో మరే రాష్ట్రంలో అంత ఖర్చు చేయడం లేదన్నారు.
స్వయం ప్రకటిత మేధావి, యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు విచ్చలవిడిగా అప్పులు చేశారని, ప్రజలకు అనేక హామీలు ఇచ్చి, ఏవీ నెరవేర్చలేదని గుడివాడ విమర్శించారు. ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని, యనమల ఉండేది హైదరాబాద్‌లో అని, ఇక్కడి పరిస్థితులు మీకు తెలియదన్నారు.
రాష్ట్రంలో పరిశ్రమల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, ఇక్కడ మంజూరైన కేంద్ర ప్రభుత్వ రూ.1000 కోట్ల ప్రాజెక్టు బల్క్ డ్రగ్ పార్క్ కోసం అన్ని రాష్ట్రాలు పోటీ పడితే, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్‌తో పాటు, మన రాష్ట్రాన్ని ఎంపిక చేశారని చెప్పారు. ఆ పార్కు వల్ల దాదాపు 40 వేల ఉద్యోగాలు వస్తాయనుకుంటే, ఆ పార్కు వద్దని కేంద్రానికి లేఖ రాస్తారా? అని నిలదీశారు.
టాపిక్