Chadrababu Interim Bail: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు
Chadrababu Interim Bail: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. సెప్టెంబర్ 9వ తేదీన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబుకు 53రోజుల తర్వాత అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేసింది.
Chadrababu Bail: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కుడి కంటికి క్యాటరాక్ట్ శస్త్ర చికిత్స చేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వచ్చే నెల 28వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రభుత్వ వైద్యుడి సిఫార్సుల ఆధారంగా చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది.
మరోవైపు చంద్రబాబు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ నవంబర్ 10వ తేదీకి విచారణ వాయిదా పడింది. ఫైబర్ నెట్ కేసులో సుప్రీం కోర్టు అరెస్ట్ చేయొద్దని ఇప్పటికే ఆదేశాలు జారి చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం చంద్రబాబు విడుదలయ్యే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నారు.
ఫైబర్ గ్రిడ్ కేసులో మాత్రమే సుప్రీం కోర్టు స్టే ఉందని, 24వ తేదీ వరకు ఆరోగ్య కారణాలతో స్కిల్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు చెబుతున్నారు. చంద్రబాబు లక్ష రుపాయల ష్యూరిటీ, ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీ సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. చంద్రబాబు ఆస్పత్రికి, ఇంటికి మాత్రమే పరిమితం కావాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు పలు నిబంధనలు విధించింది. చంద్రబాబు తాను కోరుకున్న చోట వైద్య పరీక్షలతో పాటు శస్త్రచికిత్స పొందవచ్చని తెలిపింది. 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు లొంగిపోవాలని సూచించింది.
చంద్రబాబు జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగించాలనే విజ్ఞప్తి నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబుతో సిఐడి అధికారులను ఉంచాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. దీనిపై ప్రత్యేకంగా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. మరోవైపూ మద్యం కేసులో సిఐడి నమోదు చేసిన కేసుల్లో ఎలా వ్యవహరిస్తాయనేది కీలకంగా మారింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ నవంబర్ 9వ తేదీన విచారణకు రానుంది.
స్వాగతించిన బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబును అక్రమ కేసుల్లో ఇరికించడాన్ని బీజేపీ మొదటి నుంచి తప్పు పడుతోందని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకపోయిన అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తాము తప్పు పడుతున్నామని చెప్పారు. బాబుకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైనందుకు హర్షం వ్యక్తం చేశారు.