AP Archakas Salaries Hike : అర్చకులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, కనీస వేతనం రూ.15 వేలకు పెంపు
AP Archakas Salaries Hike : ఏపీ ప్రభుత్వం దేవాలయాల్లో అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పింది. అర్చకుల కనీస వేతనం రూ.15 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 3203 మంది అర్చకులకు లబ్దిచేరుకూరుతుందని మంత్రి ఆనం తెలిపారు.
ఏపీ ప్రభుత్వం అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేవాలయాల్లో పనిచేసే అర్చకుల కనీస వేతనాలను పెంచుతున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. రూ.50 వేలకు మంచి ఆదాయం వచ్చే దేవాలయాల్లోని అర్చకులకు కనీసం వేతనం రూ.15 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో 3203 మంది అర్చకులకు లబ్దిచేరుకూరుతుందన్నారు. ఎన్నికల హామీ మేరకు అర్చకుల వేతనాలను పెంచుతున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం తాజా నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.10 కోట్ల మేర అదనపు భారం పడనుందని మంత్రి ఆనం చెప్పారు. వేతనాల్లో కొంత మొత్తం సీజీఎఫ్ నిధుల నుంచి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. దేవదాయశాఖ 1987 (30 సెక్షన్) లోని 70వ సెక్షన్ ప్రకారం అర్చకులకు చెల్లించే కనీస వేతనానికి అయ్యే ఖర్చును దేవదాయశాఖ భరిస్తుంది.
ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వేద పండితులు, వేద విద్యార్థులు, అర్చకులు, బ్రాహ్మణులకు నిరుద్యోగ భృతి ద్వారా ప్రభుత్వం మేలు చేస్తుందన్నారు.
ఇప్పటికే ఆలయాల్లో ధూప దీప నైవేద్యం ఇచ్చే నగదును నెలకు రూ.5,000 నుంచి రూ.10,000కి పెంచింది. ఆలయ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేవాలయాల ఆస్తుల సంరక్షణకు ఎండోమెంట్స్ యాక్ట్ సవరించాలని నిర్ణయించింది. దీంతో పాటు నిరుద్యోగ వేద పండితులకు భృతిగా నెలకు కనీసం రూ.3,000, దేవాలయాలలో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం రూ. 25,000 అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
శివాలయాల్లో మన గుడి కార్యక్రమాలు
పవిత్రమైన కార్తీక మాసంలో.. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో.. నవంబరు 11 నుంచి 17వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన శివాలయాల్లో మనగుడి కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా ఏపీలోని 26 జిల్లాలు, తెలంగాణలోని 33 జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో 7 రోజుల పాటు కార్తీకమాస విశిష్టతపై ధార్మికోపన్యాసాలు నిర్వహిస్తారు. ఒక్కో జిల్లాలో రెండు చొప్పున ఆలయాలను ఎంపిక చేసి నవంబరు 13న కైశిక ద్వాదశి పర్వదినాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో.. నవంబరు 15న కార్తీక దీపోత్సవం కార్యక్రమం చేపడతారు.
సంబంధిత కథనం