Skill Scam Case : స్కిల్ స్కామ్ కేసులో మరో ట్విస్ట్ - టీడీపీ ఖాతాలోకి రూ. 27 కోట్లు, కోర్టుకు సీఐడీ ఆధారాలు!
skill development case updates: స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ వేసిన చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై గురువారం విజయవాడలో ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించగా… నిధులు దారుల మళ్లింపు అంశంలో కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించారని తెలిసింది.
Skill Development Case :స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు మరోసారి చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరుతుండగా… బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గురువారం చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే వాదనలు వినిపించగా… ఏపీ సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వినిపించారు.
టీడీపీ ఖాతాలోకి 27 కోట్లు - కోర్టుకు సీఐడీ ఆధారాలు…!
స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏసీబీ కోర్టుకు పలు కీలక ఆధారాలను సమర్పించారని తెలిసింది. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో రూ. 370 కోట్ల నిధులను కొట్టేశారని.. షెల్ కంపెనీల ద్వారా నిధులను దారి మళ్లించారని వాదించారు. అయితే ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి కూడా రూ. 27 కోట్లను మళ్లించారని ప్రస్తావించారు. ఇందుకు సంబంధించిన పలు ఆధారాలను న్యాయస్థానం ముందు ఉంచారు. తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన కొన్నికీలక డాక్యుమెంట్లను కోర్టు సమర్పించారు. రూ.27 కోట్లు జమ కావటంపై ఆడిటర్‌ను విచారణ చేయాల్సి ఉందన్నారు. అక్టోబరు 10వ తేదీన ఆడిటర్ ను విచారిస్తామని పొన్నవోలు కోర్టుకు వివరించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో… చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని, మరింత విచారించేందుకు వీలుగా సీఐడీ కస్టడీకి అప్పగించాలని ఆయన కోర్టును కోరారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం… విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మరోవైపు చంద్రబాబు రిమాండ్ ను మరో 14 రోజులు పొడిగించింది ఏసీబీ కోర్టు.
ఇప్పటివరకు స్కిల్ స్కామ్ కేసులో షెల్ కంపెనీల ద్వారా మాత్రమే డబ్బులు కొట్టేశారనే వాదనలు ఉండగా… తాజాగా తెలుగుదేశం పార్టీలోకి నేరుగా డబ్బులు జమ అయ్యాయనే అంశం రావటం కీలకంగా మారింది. ఇందుకు సంబంధించిన సీఐడీ పలు ప్రాథమిక ఆధారాలను కూడా కోర్టుకు ఇవ్వటంతో ఈ కేసులో మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
రూ. 27 కోట్లపై టీడీపీ కీలక ప్రకటన…
ఇక సీఐడీ ప్రస్తావించిన 27 కోట్ల అంశంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు అరెస్టుకు కారణాలు చూపలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 2018లో రూ.27 కోట్లు తెలుగుదేశం పార్టీకి అందాయని ఏసీబీ కోర్టులో సీఐడీ చెప్పిందని తెలిపారు. అయితే వీటిపై ఆరా తీస్తే ఆ రూ.27 కోట్లు పార్టీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్‌గా నిర్ధారణ అయ్యిందని అన్నారు. ఆధారాలు చూపలేక పార్టీలకు వచ్చే విరాళాలే అక్రమాలు అని సీఐడీ అధికారులు కట్టుకథలు చెబుతున్నారని విమర్శించారు. ఇక అచ్చెన్నాయుడు ప్రస్తావించిన పలు అంశాలు ఇవే…
• 2018-19లో టీడీపీ ఖాతాకు రూ.27 కోట్లు ఎలక్షన్ బాండ్ల రూపంలో వచ్చాయంటున్నారు. అదే సంవత్సరంలో అవే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వైసీపీ ఖాతాకు రూ.99.84 కోట్లు, 2019-20లో రూ.74.35 కోట్లు, 2020-21లో రూ.96.25 కోట్లు, 2021-22లో రూ.60 కోట్లు వచ్చాయి. ఈ విరాళాలిచ్చిన వ్యక్తులు, సంస్థల పేర్లు సాక్షి పేపర్లో ప్రచురించే దమ్ము ధైర్యం జగన్ రెడ్డికి ఉందా…?
• ఆరు నెలల క్రితం ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ నుండి సేకరించినట్లు సీఐడీ పంచనామా నివేదిక చెబుతోంది. ఆరు నెలల పరిశోధన తర్వాత ఎలాంటి ఆధారాలు దొరక్క ఇప్పుడు కోర్టు ముందు పెద్ద మొత్తంలో నగదు వచ్చిందని అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారు.
• ఆరు నెలల్లో ఏం ఆధారాలు కనిపెట్టారో కోర్టుకు ఎందుకు సమర్పించలేకపోతున్నారు? చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేసేందుకు, ఆయన ప్రాథమిక హక్కుల్ని కాలరాసేందుకు దర్యాప్తు సంస్థలు ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న కుట్ర మాత్రమే. రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్స్ సేకరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ చట్టం కూడా చేసింది.
• కానీ జగన్ రెడ్డి వాటిని కూడా తప్పుబడుతూ, అదే కుంభకోణం అన్నట్లుగా మాట్లాడుతూ కేంద్ర చట్టాలను అపహాస్యం చేస్తున్నాడు. చంద్రబాబును అక్రమంగా నిర్బంధించి ఉంచడానికి కుట్ర చేస్తున్నారని ఈ వ్యాఖ్యలతోనే అర్ధమవుతోంది. న్యాయ వ్యవస్థను సైతం తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం ద్వారా ప్రజాహక్కుల్ని, రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారు" అని అచ్చెన్నాయుడు మండి పడ్డారు.