AP Cabinet Meeting : ఈనెల 18న ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..!
ఈనెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో… వరదల నియంత్రణ, అమరావతి సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ నెల 18న ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ప్రకటన జారీ అయింది. సచివాలయంలోని ఒకటో నెంబర్ బ్లాక్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.
ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఇటీవలే కురిసిన వర్షాలు, వరద నష్టం, బుడమేరు పటిష్టతపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక సీఆర్డీఏ పరిధిలో నిర్మాణాలు, కొత్త మద్యం పాలసీ వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. వరద బాధితులను ఏ విధంగా ఆదుకోవాలి అన్నదానిపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.
ఇటీవల భారీ వర్షాలు కృష్ణా, గుంటూరు జిల్లాలను కొలుకోలేని దెబ్బతిశాయి. బుడమేరు గండ్లు విజయవాడ ప్రజలను నిండా ముంచాయి. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారాయి. ఇళ్లు, వాహనాలు, సర్టిఫికెట్లు, ఇంట్లో సామాగ్రి, పంటలు... ఇలా సర్వస్వం కోల్పోయారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది.
ఏపీలో భారీ వర్షాలు, వరదలతో రూ.6,882 కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. ఈ ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. నీటివనరుల శాఖకు రూ.1568.5 కోట్లు, ఆర్‌అండ్‌బీకి రూ.2,164.5 కోట్లు, పురపాలకశాఖకు రూ.1,160 కోట్లు, రెవెన్యూశాఖకు రూ.750 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.481 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.301 కోట్లు, మత్స్యశాఖకు రూ.157.86 కోట్లు, పంచాయతీ రోడ్లకు రూ.167.5 కోట్లు, గ్రామీణ నీటిసరఫరాకు రూ.75.5 కోట్లు, ఉద్యానశాఖకు 39.9 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ.11.5 కోట్లు, అగ్నిమాపక శాఖకు రూ.2 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఏపీలో వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇటీవల రాష్ట్రంలో పర్యటించి వరద నష్టాన్ని పరిశీలించారు. కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి వరదల నష్టంపై అంచనా వేసింది.
వరదల తర్వాత జరుగుతున్న ఈ కేబినెట్ లో ప్రధానంగా ఈ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. బుడమేరు సమస్యకు చెక్ పెట్టేలా నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. అమరావతిలో నూతన నిర్మాణాల విషయంలోనూ కేబినెట్ భేటీ తర్వాత కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
సీఎం చంద్రబాబు సమీక్ష:
భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియపై శుక్రవారం సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు.
సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి.....ప్రతి బాధితుడికి ప్రభుత్వం సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్యుమరేషన్ పక్కాగా జరగాలని...నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం చేరాలని అన్నారు.