Budameru Flood Relief: బుడమేరు వరదలతో కట్టుబట్టలతో మిగిలినా, కన్నీళ్లు తుడిచేలా.. లక్షలాది కుటుంబాలకు ఏపీ ప్రభుత్వ సాయం
Budameru Flood Relief: వరద ముంచెత్తడంతో ఊరు ఏరయ్యింది. బెజవాడలో రెండు, మూడు తరాలు కనీవిని ఎరుగని విలయాన్ని విజయవాడ నగరం చవి చూసింది. విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తి పదిరోజులు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలో వరద బాధితుల్ని ఆదుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు అందరి మన్ననలు పొందుతున్నాయి.
Budameru Flood Relief: విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తి పది రోజులు దాటిపోయాయి. ఆగస్టు 31 రాత్రి నుంచి సెప్టెంబర్1వ తేదీ ఉదయం మధ్య నగరాన్ని ఒక్కసారిగా ముంచెత్తిన వరద నీటిలోనే సగం నగరం 8రోజుల పాటు నాని పోవాల్సి వచ్చింది. ఇంతటి విపత్తులో కూడా ప్రభుత్వం వీలైనంత సాయాన్ని బాధితులకు అందించగలిగింది. విజయవాడ నగరం పరిధిలో లక్షలాది మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోవడంతో పరిస్థితి తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
వరద ముంచెత్తడంతో ఊరు ఏరయ్యింది. రెండు, మూడు తరాలు కనీవిని ఎరుగని విలయాన్ని విజయవాడ నగరం చవి చూసింది. విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తి పదిరోజులు గడిచిపోయాయి.విజయవాడలో 75- 80ఏళ్ల వయసున్న వారు సైతం ఇంతటి విపత్తును చూసి ఎరుగమని చెబుతున్నారు. ఉప్పెనలు, వరదలు విజయవాడ నగరానికి కొత్త కాకపోయినా రోజుల తరబడి వరద నీటిలో నగరం మునిగిపోయిన దాఖలాలు మునుపెన్నడూ లేవు.
వేగంగా ప్రారంభమైన సహాయక చర్యలు…
ఒకటి రెండు రోజుల్లో వరద తగ్గిపోతుందనుకున్న అంచనాలు తలకిందులు అయ్యాయి. గతంలో వచ్చిన వరదల అంచనాలను మించిపోవడంతో విజయవాడ నగరంలో సగభాగం పూర్తిగా నీటి ముంపులో ఉండిపోవాల్సి వచ్చింది. సెప్టెంబర్ 1-2 తేదీలకు పరిస్థితి తీవ్రతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యల్ని ముమ్మరం చేసింది.
వరద బాధితుల్ని ఆదుకోడానికి నడుం బిగించింది. సెప్టెంబర్ 2వ తేదీ నాటికి బుడమేరు పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అప్పటికి నగరంలోని సింగ్‌నగర్ ప్రాంతంతో సంబంధాలు తెగిపోయాయి. లక్షలాది నివాసాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి.
సెప్టెంబర్ 1,2,3 తేదీల్లో వరదల్లో మునిగిపోయిన ప్రాంతాలకు తాగునీరు, ఆహారం చెరవేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఓ దశలో వరద తీవ్రతను అధికార యంత్రాంగం గుర్తించలేకపోయింది. వరద ముంపు మొత్తం సింగ్‌నగర్ ప్రాంతంలోనే ఉందని భావించారు. అయితే పాతబస్తీలో కూడా సగ భాగం వరద ముంపుకు గురైంది.
భవానీపురం, జోజినగర్, చిట్టినగర్, మిల్క్‌ప్రాజెక్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. వరదలు ముంచెత్తిన 48 గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం 80శాతం బాధితులకు ఆహారాన్ని అందించగలిగింది. ఆహారం పెద్ద ఎత్తున వృధా అయినా బాధితులకు వీలైనంత సాయం అందించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అక్షయపాత్ర సహకారంతో ఆహారాన్ని తయారు చేయించింది.
మూడుపూట్ల వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు, వండిన ఆహార పదార్ధాలను పంపిణీ చేసింది. చిన్న పిల్లల్ని దృష్టిలో ఉంచుకుని పాలప్యాకెట్లను పంచిపెట్టారు. విజయవాడలోని విజయ డైరీ మిల్క్ ప్రాజెక్టు పూర్తిగా నీట మునగడంతో వీరవల్లి నుంచి పాల ప్యాకింగ్ పూర్తి చేశారు. దీంతో పాటు ప్రైవేట్ డైరీల నుంచి అన్ని ప్రాంతాలకు భారీగా పాలను సరఫరా చేశారు. సెప్టెంబర్ 2,3 తేదీల నుంచి వరద నీటిలోనే ఇంటింటికి పాల పంపిణీ చేపట్టారు.
వరద సాయాన్ని మొదట్లో కాజేశారు..
ఓవైపు సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధితుల్ని ఆదుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆహార పదార్ధాలను ముంపు ప్రాంతాలకు తరలిస్తే పలు డివిజన్లలో చోటా నాయకులు మొదట్లో చేతివాటం చూపించారు. వాటర్ బాటిళ్లు, ఎక్కువ కాలం నిల్వ ఉండే పాలు, బిస్కెట్లు వంటి వాటిని తరలించుకుపోయారు. పలు ప్రాంతాల్లో దిగువ స్థాయి నేతలు వరద సాయం అందించే క్రమంలో జోక్యం చేసుకుని సహాయ సామాగ్రిని తమ గుప్పెట్లో పెట్టుకుని పంపిణీ చేశారు.
తమ అనుచరులు, కార్యకర్తలకు మాత్రమే మొదట్లో వరద సాయాన్ని పంపిణీ చేశారు. మాజీ కార్పొరేటర్లు కింది స్థాయి నాయకుల వ్యవహారం దుమారం రేపడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. వరదలు ముంచెత్తిన మూడో రోజు నుంచి స్థానిక నాయకులతో సంబంధం లేకుండా పంపిణీ చేపట్టారు.ప్రతి ఏరియాలో మునిసిపల్ కమిషనర్ స్థాయి అధికారి స్వయంగా పంపిణీ పర్యవేక్షించారు.
వరద సాయం పక్కదారి పడుతున్న వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో వరద సాయం పంపిణీలో ప్రతి డివిజన్‌లో జాగ్రత్తలు తీసుకున్నారు. డివిజన్‌కు ఓ ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, అధికారులు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోలీసు బలగాల పహారాలో వరద సాయాన్ని పంపిణీ చేశారు. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి వరద నీటిలోనే ట్రాక్టర్లపై మూడు పూటల ఇంటింటికి సాయాన్ని అందించారు. వాహనాలు వెళ్లలేని ప్రదేశాల్లో స్థానిక యువకుల సహకారం తీసుకున్నారు. వరద సాయంలో రాజకీయాలకు బ్రేకులు వేయడంతో సాయం అందని వారంటూ లేకుండా పోయారు.
వరద తగ్గినట్టే తగ్గి మళ్లీ ముంచెత్తి...
విజయవాడ నగరాన్ని వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు బుడమేరు వరద ముంచెత్తింది. సెప్టెంబర్ 3-4 తేదీల్లో వరద ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టింది. 3వ తేదీ నాటికి పలు ప్రాంతాల్లో వరద నీరు తగ్గు ముఖం పట్టింది. తిరిగి నాలుగో తేదీన రెండోసారి వరదలు ముంచెత్తడంతో జనావాసాలు పూర్తిగా నీటిలో చిక్కుకుపోయాయి. దీంతో ప్రజలు కోలుకోడానికి వీల్లేకుండా పోయింది. గత గురువారం నుంచి వరద బాధితులకు సహాయ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించింది. వరద నీరు తగ్గడంతో బాధితులకు నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేశారు. ముంపు తగ్గుతుందని భావించిన వారికి రెండోసారి వచ్చిన వరదతో మళ్లీ రోడ్లపైకి చేరుకోవాల్సి వచ్చింది.
విపత్తు సాయంలో ప్రభుత్వ చర్యలు భేష్...
వరద బాధితులకు సాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు బాధితుల మన్ననలు పొందాయి. సాధారణంగా వరద సాయమంటే గతంలో నష్టాన్ని అంచనా వేసి వరదల తీవ్రత తగ్గిన తర్వాత పక్షం రోజులకు అందేది. విజయవాడలో ఓ వైపు వరద ముంపు కొనసాగుతుండగానే బాధితులకు ప్రభుత్వం సాయం ప్రారంభించింది. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని అందించారు.
ఇంటింటికి 25కేజీల బియ్యం, వంట నూనె, టెట్రా మిల్క్ ప్యాకెట్లు,కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు సరఫరా చేశారు. 1200 మొబైల్ డెలివరీ యూనిట్లతో ఇళ్ల వద్దకే రేషన్ పంపిణీ చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి అప్పటికప్పుడు మిల్లర్ల నుంచి బియ్యాన్ని సేకరించి విజయవాడకు తరలించారు. దాదాపు రెండున్నర లక్షల కుటుంబాలకు 25కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ప్రతి డివిజన్‌లో ఏకకాలంలో నాలుగైదు ఎండియూలతో సరుకులు పంపిణీ చేశారు. ప్రతివాహనానికి పోలీసులను ఎస్కార్ట్‌గా పంపడంతో అక్రమాలకు, చేతివాటం ప్రదర్శించడానికి వీల్లేకుండా పోయింది.
బుడమేరు వరదలతో పేద, గొప్ప తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. లోతట్టు ప్రాంతాల్లో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతో ప్రాణాలు కాపాడుకున్న వారు లక్షల్లో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. బాధితులకు తక్షణ సాయం అందించింది. ఇళ్లలో సామాగ్రి మొత్తం పాడైపోవడంతో బాధితులకు తాత్కలికంగానైనా స్వాంతన చేకూరేలా ఆహార పదార్ధాలను అందించింది.
ట్రక్కుల కొద్దీ మంచినీళ్ల బాటిళ్లు…
సెప్టెంబర్ 10వ తేదీ నాటికి వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో 80శాతం మందికి పైగా వరద సాయంగా రేషన్ పంపిణీ పూర్తి చేశారు. గతంలో వరద బాధితులకు సాయమంటే మంచినీటి ప్యాకెట్లు పంచేవారు. బుడమేరు వరదల్లో చుట్టూ నీరున్నా తాగేందుకు గుక్కెడు నీళ్లు లేని పరిస్థితుల్లో ట్రక్కుల కొద్ది ప్యాకెజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాధితులకు పంపిణీ చేశారు. ప్రతి ఇంట్లో ఒక్కో వరద ముంపు బాధితుడికి ప్రతి పూట నాలుగైదు లీటర్ల బాటిళ్లను ఏడెనిమిది రోజులుగా పంపిణీ చేస్తున్నారు. వరద ముంపు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్ల కొద్ది ప్లాస్టిక్ బాటిళ్లను బాధితులకు పంపిణీ చేశారు.