AP Assembly Session 2024 : 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు - జగన్ వస్తారా..? లేదా..?
AP Assembly Session 2024 Updates: జూన్ 21వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో…. ముందుగా ప్రొటెం స్పీకర్ ఎన్నిక ఉండనుంది. ఆయనే గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
AP Assembly Session 2024 Updates: ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. జూన్ 21వ తేదీ నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గెలిచిన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ఉండనుంది. ఇదే సమయంలో స్పీకర్ ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తి కానుంది. ఇప్పటికే స్పీకర్ ఎవరనేది ఖరారు కూడా అయింది.
2 రోజులు సమావేశాలు….
తాజా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ముందుగా ప్రొటెం స్పీకర్ ఎన్నిక ఉండనుంది. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించనున్నారు. ఆయనతో ఇవాళ సాయంత్రమే రాజ్ భవన్ లో ముందుగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత… ప్రొటెం స్పీకర్ హోదాలో అసెంబ్లీ వేదికగా గెలిచిన ఎమ్మెల్యేలతో శుక్రవారం ప్రమాణం చేయిస్తారు. ఉదయం 9.46 నిమిషాలకు సభ ప్రారంభం కానుంది.ఈ సమావేశాలు 2 రోజుల పాటు సాగనున్నాయి.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి 135 మంది, జనసేన నుంచి 21, వైసీపీ నుంచి 11 మంది, బీజేపీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరందరితోనూ ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించననున్నారు.
గత సభలో 151 సభ్యులతో ఉన్న వైసీపీ ఈసారి 11కే పరిమితం అయ్యింది. వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు. అసలు వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా జగన్ అసెంబ్లీ వస్తారా? అనేది చర్చగా మారింది. అందరు ఎమ్మెల్యేలతో కలిసి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా? లేదా స్పీకర్ ఛాంబర్ లో బాధ్యతలు తీసుకుంటారా? అనేది ఆసక్తిగా మారింది.
కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీ తన సత్తా చాటుకుంటూనే వస్తోంది. తొలిసారిగా 2014 ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ… ప్రతిపక్ష స్థానంతో సరిపెట్టుకుంది. ఆ పార్టీ అధినేతగా ఉన్న జగన్ కు ప్రతిపక్ష హోదా దక్కింది. ఇక 2019 ఎన్నికల్లో ఏకంగా 151 స్థానాల్లో గెలిచి సరికొత్త చరిత్రను సృష్టించింది.
ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. ఏపీ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన ఉంది. 21 స్థానాలను గెలిచి…. ప్రతిపక్ష హోదాకు కూడా సరిపోయే స్థానాలను సంపాదించింది. అయితే జనసేన ప్రస్తుతం ప్రభుత్వంలో ఉంది. దీంతో ప్రతిపక్ష నేత లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగున్నాయి.
స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు…!
ఏపీలో పొత్తుతో పోటీ చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కూటమి ప్రభుత్వానికి సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ పంపకాలు కూడా పూర్తయ్యాయి. జనసేనకు మూడు మంత్రి పదవులు, బీజేపీకి ఒక కేబినేట్ స్థానాన్ని కేటాయించారు చంద్రబాబు. కేబినెట్ లో సీనియర్లతో పాటు కొత్త వారికి అవకాశం కల్పించారు.
ఇప్పుడు స్పీకర్ పదవిపై ఆసక్తి నెలకొంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సీనియర్లకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఏపీ శాసనసభ స్పీకర్ రేసులో టీడీపీ సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేరు ప్రథమంగా వినిపిస్తుంది. దాదాపుగా ఆయనే స్పీకర్ కానున్నారు.
మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవిపై జనసేన ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. జనసేన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి లేదా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్లను డిప్యూటీ స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక జనసేన నుంచే గెలిచిన మండలి బుద్ధప్రసాద్ కూడా ఈ పదవి రేసులో ఉన్నారు.