AP Budget Session: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, బడ్జెట్‌కు క్యాబినెట్ అమోదం
AP Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఏపీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు నవంబర్ నెలాఖరుతో ముగియనుండటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రవేశపెట్టనున్నారు. ఏపీ బడ్జెట్ ప్రతిపాదనలకు క్యాబినెట్ అమోద ముద్ర వేసింది.
AP Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంకట పాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. వెలగపూడిలో అసెంబ్లీ నిర్మించినప్పటి నుంచి వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడం ఆనవాయితీని చంద్రబాబు కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు ఏపీ క్యాబినెట్ అమోదముద్ర వేసింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెను ప్రవేశపెట్టనున్నారు. సుమారు రూ. 2.9 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సాధారణ బడ్జెట్ తర్వాత వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనల తర్వాత అసెంబ్లీ వాయిదా పడనుంది. అనంతరం బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. పది నుంచి 11రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. మండలిలో బడ్జెట్‌ను కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్ మంత్రి నారాయణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్సీపీ దూరంగా ఉంది. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వరనే ఉద్దేశంతో సమావేశాలకు జగన్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. శాసనమండలి సమావేశాలకు మాత్రం వైసీపీ సభ్యులు హాజరవుతారు. మండలిలో బొత్స సత్యనారాయణ ప్రమాణం చేస్తారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా సమావేశాలు నిర్వహించలని వైసీపీ నిర్ణయించింది.
సభలో కీలక బిల్లులు
దేవాలయాల్లోని పాలకమండళ్లలో అదనంగా మరో ఇద్దరు సభ్యుల నియామకంపై బిల్లును బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జ్యూడీషియల్ ప్రివ్యూ కమిషన్‌ను రద్దు చేస్తూ బిల్లు పెడుతున్నారు. జ్యూడీషియల్ అధికారుల వయసును 60 నుంచి 61 ఏళ్లకు పెంచుతూ చట్ట సవరణ చేస్తున్నారు. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలంటూ వైసీపీ ప్రభుత్వం గతంలో తెచ్చిన చట్టాన్ని రద్దు చేస్తూ గతంలో ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చింది. దీనికి బదులు మద్యం దుకాణాల నిర్వహణను ప్రైవేటుకు అప్పగిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతారు. ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు 2024ను సభలో ప్రవేశపెడతారు.
బడ్జెట్‌లో సూపర్ సిక్స్ కేటాయింపులు
నవంబర్ 22వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్లనిర్మాణం లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ఈ ఏడు ఇప్పటివరకు రెండు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఈ రెండు బడ్జెట్లకు కలిపి రూ.2.39 లక్షల కోట్లకు ఆమోదం తీసుకున్నారు.
2024-25 పూర్తిస్థాయి బడ్జెట్ రూ.3లక్షల కోట్ల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. క్యాబినెట్ అమోదం పొందిన తర్వాత బడ్జెట్‌కు ఆన్‌లైన్‌లో గవర్నర్ అమోదం తీసుకోనున్నారు. గత మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నాలుగు నెలలకు గాను ఓటాన్ అకౌంట్‌ను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం మరో నాలుగు నెలలకు గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. సోమవారం అసెంబ్లీలో ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 4 నెలలకు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.