AP Land Resurvey : భూ రికార్డుల ట్యాంపరింగ్ కు చెక్- ఆధార్ తరహాలో భూధార్, కమతాలకు కొత్త నెంబర్లు
AP Land Resurvey : ఏపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియ కొనసాగుతోంది. రీసర్వే పూర్తిన గ్రామాల్లో భూముల రికార్డుల స్వరూపారాన్ని మార్చేందుకు... సర్వే నంబర్ల స్థానంలో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నెంబర్లను అమలుచేస్తుంది.
AP Land Resurvey : ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వేను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. డ్రోన్, ఏరియల్, డీజీపీఎస్ ద్వారా భూములను సర్వే చేస్తున్నారు. బ్రిటీష్ కాలంలో భూములను సర్వే చేసి ఇచ్చిన నంబర్లు ఇప్పటికీ రికార్డుల్లో కొనసాగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. దీంతో భూముల రికార్డుల స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టింది. ప్రస్తుత సర్వే నంబర్లు స్థానంలో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (LPA) నెంబర్లు అమలు చేయబోతుంది. ఇప్పటికే సర్వే పూర్తైన 2 వేలకు పైగా గ్రామాల్లో నూతన నంబర్లతోనే రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయని తెలిపింది.
భూధార్ పేరుతో గుర్తుంపు కార్డులు
శతాబ్దాల కాలం నాటి సర్వే నంబర్లే ఇంకా భూముల రికార్డుల్లో కొనసాగుతున్నాయని, ఒక సర్వే నంబరులో 2 నుంచి 10 కన్నా ఎక్కువ మంది భూయజమానులు ఉన్నారని అధికారులు గుర్తించారు. దీంతో భూయజమానుల మధ్య సమస్యలు, వివాదాలు తలెత్తుతున్నాయని తెలిపారు. భూముల రీసర్వేతో ఈ వివాదాలకు ప్రభుత్వం పరిష్కారం చూపిందని అంటున్నారు. ప్రతి భూకమతానికి ప్రత్యేకంగా ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నెంబర్, భూయజమానికి ఆధార్ తరహాలో ఐడీ నెంబర్ ఇస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 17,460 రెవెన్యూ గ్రామాలుడంగా, వాటి పరిధిలో 90 లక్షల మంది భూయజమానులు ఉన్నారు. భూయజమానుల పేరిట 2.26 కోట్ల ఎకరాల భూమి 1.96 కోట్ల సర్వే నెంబర్లు రికార్డుల్లో ఉన్నాయి. భూసర్వే చేపట్టిన గ్రామాల్లో ప్రతి భూకమతానికి ఎల్‌పీఎమ్ నెంబర్, భూధార్ పేరుతో ప్రత్యేక గుర్తింపు సంఖ్య, జియో కోఆర్డినేట్స్‌ను ప్రభుత్వం కేటాయిస్తుంది.
రికార్డుల ట్యాంపరింగ్ కు చెక్
గ్రామాల్లో సర్వే పూర్తైన అనంతరం భూ యజమానులకు హక్కుపత్రం అందజేస్తున్నారు. ఈ పత్రంలో ఎల్పీఎం నెంబర్, యజమాని ఫొటో, క్యూఆర్ కోడ్ పొందుపరుస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే భూయజమానికి సంబంధించిన కమతా వివరాలు తెలుస్తాయి. ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నెంబర్లతోనే రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల్లో మార్పుచేర్పులు జరుగుతాయని అధికారులు తెలిపారు. దీంతో రిజిస్ట్రేషన్లలో మోసాలు, రికార్డుల ట్యాంపరింగ్‌కు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. భూముల రీసర్వేతో నూతనంగా తయారు చేస్తున్న డిజిటల్ రెవెన్యూ రికార్డుల్లో ఎల్‌పీఎమ్ నెంబర్లు ఉంటాయన్నారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రీసర్వే పూర్తైన గ్రామాల వివరాలతో ఇప్పటికే వెబ్‌ల్యాండ్–2 ఆన్‌లైన్ పోర్టల్‌ను అందబాటులోకి తెచ్చిందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నెంబర్ల ఆధారంగా క్రయవిక్రయాలు జరుగుతాయని అధికారులు తెలిపారు.