AP Cabinet Meeting : అర్చకులు, అధ్యాపకులకు గుడ్ న్యూస్, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
AP Cabinet Meeting : సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
AP Cabinet Meeting : సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం మంత్రివర్గం భేటీ అయింది. రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకులో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడున్నర గంటలపాటు జరిగిన సమావేశంలో 55 అంశాలపై చర్చించినట్లు సమాచారం. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశంలో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. CRDA పరిధిలోని ఆర్5 జోన్‌లో 47 వేల ఇళ్ల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లా భావనపాడు-మూలపేట పోర్టు నిర్మాణం కోసం రూ.3,880 కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో భూమిలేని పేదలకు వ్యవసాయ భూమి, లంక భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు, భూ కేటాయింపులు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసైన్‌మెంట్ ల్యాండ్ నిరుపేదలకు భూ కేటాయింపులపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జగనన్న సురక్ష అమలుపైనా మంత్రివర్గ భేటీలో చర్చించారు. ఈ కార్యక్రమానికి అద్భుతమైన ఫలితాలు వచ్చాయని మంత్రులు చెప్పడంతో సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు అక్కడికక్కడే సచివాలయాలు ద్వారా అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు.
కేబినెట్ కీలక నిర్ణయాలివే
అసైన్డ్ ల్యాండ్ పొందిన లబ్ధిదారులు భూమి పొందిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇతర రైతుల మాదిరిగానే భూమి క్రయవిక్రయాలపై పూర్తి హక్కులు దక్కుతాయని పేర్కొంది. మొత్తం 63,191,84 ఎకరాల అసైన్‌మెంట్ భూములు, లంక భూములలో.. 66,111 మందికి పూర్తి హక్కులు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. 1966 రెవెన్యూ గ్రామాల్లో ఎస్సీలకు ప్రత్యేక శ్మశాన వాటికలు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ నిర్ణయిం తీసుకుంది. రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కింద దళితులకు కేటాయించిన 16,213 ఎకరాలకు చెల్లించాల్సిన రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. వైఎస్సార్ సున్నా వడ్డీపథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి సీఆర్‌డీఏలో 47 వేల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. యూనివర్సీటీలో శాశ్వత అధ్యాపకుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్చకులకు పదవీవిరమణ లేకుండా చట్టసవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేవాదాయశాఖ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జులైలో చేపట్టే పలు సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- 18న జగనన్న తోడు నిధుల జమ
- 20న సీఆర్‌డీఏ, ఆర్5 జోన్‌లలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం
- 21న నేతన్న నేస్తం నిధుల జమ
- 26న సున్నావడ్డీ కింద డ్వాక్రా మహిళలకు డబ్బు జమ
- 28న జగన్న విదేశీ విద్యా పథకం