Pinipe Srikanth: వివాహేతర సంబంధమే హత్యకు కారణం! వాలంటీర్ హత్య కేసులో మాజీ మంత్రి కుమారుడికి రిమాండ్-an extra marital affair is the reason for the murder ex ministers son remanded in volunteer murder case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pinipe Srikanth: వివాహేతర సంబంధమే హత్యకు కారణం! వాలంటీర్ హత్య కేసులో మాజీ మంత్రి కుమారుడికి రిమాండ్

Pinipe Srikanth: వివాహేతర సంబంధమే హత్యకు కారణం! వాలంటీర్ హత్య కేసులో మాజీ మంత్రి కుమారుడికి రిమాండ్

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 23, 2024 08:06 AM IST

Pinipe Srikanth: కోనసీమ జిల్లాలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త, వాలంటీర్ జనుపల్లి దుర్గా ప్రసాద్ హత్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడికి 14రోజుల రిమాండ్ విధించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే మిగిలిన నిందితుల్ని అరెస్ట్ చేశారు.

హత్య కేసులో మాజీ మంత్రి తనయుడికి రిమాండ్
హత్య కేసులో మాజీ మంత్రి తనయుడికి రిమాండ్

Pinipe Srikanth: హత్య కేసులో మాజీ మంత్రి విశ్వరూప్‌ కుమారుడికి 14రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లికి చెందిన వాలంటీరు, వైసీపీలో క్రియాశీలకంగా తిరిగే జనుపల్లి దుర్గాప్రసాద్‌ 2022 జూన్‌6న హత్యకు గురయ్యాడు. దుర్గా ప్రసాద్‌ను మాజీ మంత్రి విశ్వరూప్‌ తనయుడు పినిపె శ్రీకాంత్‌ పథకం ప్రకారమే హత్య చేయించారని కొత్తపేట డీఎస్పీ గోవిందరావు మంగళవారం వెల్లడించారు.

శ్రీకాంత్‌ను సోమవారం రాత్రి తమిళనాడులోని మధురైలో అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం రాత్రి 9.40 గంటల సమయంలో కొత్తపేట డీఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అనంతరం రాత్రి 10.30కు అమలాపురానికి తీసుకెళ్లారు. రాత్రి 11 గంటలకు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ గౌరీశంకర్‌రావు ఎదుట హాజరుపరిచారు.

2022 జూన్‌ 6న జరిగిన హత్యకు సంబంధించి ప్రాథమిక ఆధారాలతో పాటు సాంకేతిక ఆధారాల సాయంగా దర్యాప్తు కొనసాగించినట్టు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 18న ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వడ్డే ధర్మేశ్‌ను విచారించడంతో అసలు కుట్ర బయట పడిందని వివరించారు. నిందితుడు ఇచ్చిన వాంగ్మూలంతో పాటు ఇతర ఆధారాల మేరకు సమగ్ర దర్యాప్తు చేసి కేసులో ప్రధాన నిందితుడు పినిపే శ్రీకాంత్‌‌గా నిర్ధారించుకున్నట్టు వివరించారు.

ధర్మేశ్‌ అక్టోబర్ 18న అరెస్టైన తర్వాత శ్రీకాంత్‌ పరారయ్యాడని, సెల్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి హైదరాబాద్, తమిళనాడులోని మధురై ప్రాంతాలకు పరారవ్వడంతో ప్రత్యేక బృందాలు గాలించి సోమవారం రాత్రి అరెస్టు చేసినట్టు తెలిపారు. అక్కడ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై జిల్లాకు తీసుకొచ్చినట్టు డిఎస్పీ తెలిపారు.

హత్యకు కారణం అదే…

జనుపల్లి దుర్గాప్రసాద్‌ను వ్యక్తిగత కారణాలతోనే శ్రీకాంత్‌ హత్య చేయించారని డీఎస్పీ వెల్లడించారు. మహిళకు సంబంధించిన వ్యవహారంలో హత్య జరిగినట్టు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన దుర్గాప్రసాద్‌తో పాటు మరి కొందరు మాజీ మంత్రి తనయుడి అనుచరులుగా వైసీపీలో తిరిగే వారు. మరో నిందితుడు ధర్మేశ్‌ ఆ పార్టీ సోషల్‌ మీడియా కన్వీనర్‌గా వ్యవహరించేవాడు. దుర్గాప్రసాద్‌తో తలెత్తిన వివాదాల రునథంమవలొ శ్రీకాంత్‌ 2022 జూన్‌ 5న ప్రణాళిక రచించినట్టు గుర్తించారు.

ఫథకం ప్రకారం దుర్గాప్రసాద్‌ను ధర్మేశ్‌.. కోటిపల్లి రేవు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ మరో నలుగురు అతని మెడకు తాడు బిగించి హత్య చేసినట్లు గుర్తించారు. హత్య జరిగిన నాలుగు రోజుల తరువాత గుర్తు తెలియని మృతదేహం లభించగా, విచారణలో మృతుడు దుర్గాప్రసాద్‌గా గుర్తించామరు. పోస్టుమార్టంలో మృతదేహం మెడ ఎముకలు రెండువైపులా విరిగిపోవడంతో మిస్సింగ్‌ కేసును హత్య కేసుగా మార్చారు.

ఈ కేసులో మరికొందరు నిందితుల్ని విచారించనున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని డిఎస్పీ వెల్లడించారు. నిందితుడికి 14రోజల రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. దాదాపు గంటన్నరపాటు వాదనలు జరిగిన తరువాత నవంబరు 4 వరకు రిమాండ్‌ విధిస్తూ తీర్పునిచ్చారని కొత్తపేట డీఎస్పీ గోవిందరావు తెలిపారు.

మొన్న రాజీవ్, నేడు శ్రీకాంత్..

వైసీపీ ప్రభుత్వంలో తండ్రుల అధికారాన్ని అడ్డుపెట్టుకుని వారి తనయులు చెలరేగిపోయారు. అగ్రిగోల్డ్ భూముల్ని అక్రమ కొనుగోలు వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ తనయుడు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రస్తుతం పినిపె తనయుడు హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు. మరికొంతమంది వైసీపీ నేతల తనయులకు ఇదే పరిస్థితి తప్పకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.

Whats_app_banner