AP Constable Recruitment : ఏపీలో 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, నియామక ప్రక్రియ మొదలైందని హోంమంత్రి ప్రకటన
AP Constable Recruitment : ఏపీలో 6100 పోలీస్ కానిస్టేబుల్ నియామకాల భర్తీ ప్రక్రియ ప్రారంభించినట్లు హోంమంత్రి అనిత ప్రకటించారు. 5 నెలల్లో శారీరక సామర్థ్య పరీక్షలు పూర్తి చేయనున్నట్టు చెప్పారు. పూర్తి వివరాలు పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్ సైట్ slprb.ap.gov.in లో పొందుపరుస్తామన్నారు.
AP Constable Recruitment : ఏపీలో 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైందని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. ఐదు నెలల్లో పీఎంటీ, పీఈటీ పరీక్షలను పూర్తి చేస్తామన్నారు. వివిధ కారణాలతో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ వాయిదా పడిందన్నారు. రెండో దశ అప్లికేషన్ నమోదుకు పూర్తి వివరాలు పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్ సైట్ slprb.ap.gov.in లో పొందుపరుస్తామన్నారు. అలాగే రెండో దశలో ఉత్తీర్ణులైన వారికి మూడో దశలో ప్రధాన పరీక్ష నిర్వహిస్తామని హోంమంత్రి అనిత ప్రకటించారు. ఏడాదిన్నరగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తుంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా నియామక ప్రక్రియ వాయిదా పడింది.
కానిస్టేబుల్ నియామక ప్రక్రియను పూర్తి చేసేందుకు కూటమి సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ మేరకు హోంమంత్రి అనిత కీలక ప్రకటన చేశారు. పలు కారణాలతో నిలిచిపోయిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య పరీక్షలను రానున్న ఐదు నెలల్లోగా పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వ హాయంలో 6100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. సివిల్ కానిస్టేబుల్ 3580 పోస్టులు, ఏపీఎస్పీ కానిస్టేబుల్ 2520 పోస్టుల భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. 2022లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. 4,59,182 మంది హాజరయ్యారు. అందులో 95,209 మంది తదుపరి దశకు సెలెక్ట్ అయ్యారు.
హోంగార్డుల రిట్ పిటిషన్
కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కు మొత్తం 3,622 మంది హోంగార్డులు హాజరయ్యారు. వీరిలో 382 మంది హోంగార్డులు మాత్రమే అర్హత సాధించారని హోంమంత్రి అనిత తెలిపారు. అయితే ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించని 100 మంది హోంగార్డులు హైకోర్టులో 14 రిట్ పిటిషన్లు వేశారన్నారు. హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించి, మెరిట్ జాబితాను ప్రకటించాలని కోర్టును కోరారు. అయితే ఆ వంద మంది హోంగార్డులను తదుపరి దశకు అనుమతించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం దీనిపై ఏ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల నియామక ప్రక్రియ నిలిచిపోయిందన్నారు.
కానిస్టేబుల్ నియామక ప్రక్రియపై న్యాయసలహా తీసుకుని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని హోంమంత్రి తెలిపారు. ఈ మేరకు రెండో దశలో నిర్వహించే శారీర సామర్థ్య పరీక్షలు కొనసాగించాలని నిర్ణయించామన్నారు. రెండో దశ అప్లికేషన్ ఫారం పూర్తి చేయడానికి, నియామక ప్రక్రియ వివరాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్ సైట్ లో పొందుపరుస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. రెండో దశలో అర్హత సాధించిన వారికి మూడో దశలో ఫైనల్ ఎగ్జామ్ నిర్వహిస్తామన్నారు.
సంబంధిత కథనం