TG DSC Key 2024 : తెలంగాణ డీఎస్సీ పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదల-telangana dsc exam key 2024 response sheets released ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Dsc Key 2024 : తెలంగాణ డీఎస్సీ పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదల

TG DSC Key 2024 : తెలంగాణ డీఎస్సీ పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదల

Bandaru Satyaprasad HT Telugu
Aug 13, 2024 07:14 PM IST

TG DSC Key 2024 : తెలంగాణ డీఎస్సీ పరీక్షల కీ విడుదలైంది. డీఎస్సీ వెబ్ సైట్ లో కీ తో పాటు రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉంచారు. ఈ కీ పై అభ్యంతరాలుంటే ఈ నెల 20వ తేదీలోపు తెలియజేయవచ్చని విద్యాశాఖ తెలిపింది.

తెలంగాణ డీఎస్సీ కీ విడుదల
తెలంగాణ డీఎస్సీ కీ విడుదల

TG DSC Key 2024 : తెలంగాణలో డీఎస్సీ పరీక్ష ప్రిలిమినరీ కీ విడుదలైంది. అభ్యర్థులు డీఎస్సీ కీ తో పాటు రెస్పాన్స్ షీట్లు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. డీఎస్సీ కీ పై అభ్యంతరాలను ఈ నెల 20వ తేదీలోగా తెలియజేయాలని విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌ పండిట్‌, సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు సంబంధించి వేర్వేరుగా ప్రిలిమినరీ కీలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. డీఎస్సీ పరీక్షలకు 2,45,263 మంది హాజరయ్యారు.

త్వరలో డీఎస్సీ ఫలితాలు

డీఎస్సీ పరీక్షల ఫలితాలను త్వరగా విడుదల చేయాలనే యోచనలో విద్యాశాఖ ఉంది. సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం ఉంది. ఈ సందర్భంగానే ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలతో పాటు కొత్త టీచర్ల నియామకాలపై కూడా చర్చ జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవంలోపు రిక్రూట్ మెంట్ పూర్తి అవుతుందన్న విషయం చర్చకు వచ్చింది.

నిజానికి డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు కోరినప్పటికీ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. గ్రూప్స్ పరీక్షలపై నిర్ణయం తీసుకున్నప్పటికీ… డీఎస్సీ పరీక్షలను యథావిథిగా నిర్వహించింది. నిర్ణయించిన షెడ్యూల్ లోపే పరీక్షలను పూర్తి చేసి… కొత్త టీచర్ల రిక్రూట్ మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని భావించింది. మొత్తంగా చూస్తే ఈ నెలాఖారులోపే ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

11,062 పోస్టులు

డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 2,79,966 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరిగాయి. పోస్టుల వారీగా చూస్తే…. 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 220 స్కూల్‌ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల్లో ఈ ఎగ్జామ్స్ నిర్వహించారు.

సంబంధిత కథనం