Ysrcp Bus Yatra : ఎన్నికల సమరానికి సై అంటున్న వైసీపీ, ఈ నెల 26 నుంచి బస్సు యాత్రలు!
Ysrcp Bus Yatra : వైసీపీ నేతలు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. వచ్చే రెండు నెలల పాటు ప్రజల్లో ఉండేందుకు బస్సు యాత్రలు షురూ చేశారు.
Ysrcp Bus Yatra : వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. మార్చి, ఏప్రిల్ లో ఎన్నికలు ఉంటాయని ఇటీవల వైసీపీ నేతల సమావేశంలో సీఎం జగన్ ప్రకటించారు. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మంగళవారం వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. ఈ భేటీలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయ యాత్ర పేరుతో బస్సు యాత్రలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. దసరా తర్వాత ఈ నెల 26న బస్సు యాత్రలు మొదలుపెట్టాలని, ప్రతీ నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మూడు ప్రాంతాలలో ప్రతి రోజూ మూడు సమావేశాలు నిర్వహించాలన్నారు.
రెండు నెలల పాటు బస్సు యాత్రలు
రానున్న రెండు నెలల పాటు వైసీపీ శ్రేణులు ప్రజల్లో ఉంటూ బస్సు యాత్రలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. బస్సు యాత్ర సమావేశాల్లో ఎమ్మెల్యే, పార్టీ ఇన్ ఛార్జ్ తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు మాట్లాడాలన్నారు. నాలుగన్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. వచ్చే ఎన్నికలు పేదవాడికి, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అన్నారు. సామాజిక న్యాయం, మహిళా సాధికారిత అంశాలను నేతలు ప్రస్తావించాలని నేతలకు మార్గ నిర్దేశం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అవగాహన సమావేశాల నిర్వహించాలన్నారు. ఈ సమావేశాల్లో వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు హాజరవ్వాలన్నారు. స్థానిక నేతలను సమన్వయం చేస్కుండా బస్సు యాత్రలను విజయవంతం చేయాలని సీఎం జగన్ సూచించారు. వైసీపీ బస్సు యాత్రల నిర్వహణ తేదీలు, సమావేశాలపై ప్రణాళిక రూపొందించాలని సీఎం జగన్ ముఖ్యనేతలను ఆదేశించారు. బస్సు యాత్రలను సమన్వయం చేసుకునేందుకు ప్రాంతాల వారీగా బాధ్యుల్ని నియమించారు. దీంతో పాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తల సానుకూలత, వ్యతిరేకతలేంటని సీఎం జగన్ ఆరా తీశారు. ప్రధానంగా గ్రూపులు, వర్గ విభేదాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలపై వ్యతిరేకతపై ఆరా తీసినట్లు సమాచారం.
సామాజిక న్యాయ యాత్ర సమన్వయకర్తలు
- రాయలసీమ జిల్లాలకు (తిరుపతి మినహా) - మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కడప జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
- ఉత్తరాంధ్ర జిల్లాలకు- మంత్రి బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి,
- ఉభయగోదావరి జిల్లాలకు- ఎంపీ మిథున్‌రెడ్డి,
- కృష్ణా, గుంటూరు జిల్లాలకు- ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్
- పల్నాడు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు- ఎంపీ విజయసాయిరెడ్డి