Sajjala On Sharmila : షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏంలేదు, కాంగ్రెస్ తో చంద్రబాబు తెరవెనుక రాజకీయం- సజ్జల
Sajjala On Sharmila : వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ తో చంద్రబాబు తెరవెనుక రాజకీయం నడుపుతున్నారని విమర్శించారు.
Sajjala On Sharmila : కాంగ్రెస్ తో టీడీపీ అధినేత చంద్రబాబు తెరవెనుక రాజకీయం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. శనివారం సజ్జల మీడియాతో మాట్లాడారు. బ్రదర్ అనిల్‌తో టీడీపీ నేతలు ఫొటోలు దిగుతున్నారని, దీనిని బట్టి టీడీపీ నేతల కుట్రలు అర్థం చేసుకోవచ్చన్నారు.
టీడీపీ, కాంగ్రెస్ కలిసే జగన్ పై తప్పుడు కేసులు
వైఎస్ షర్మిల రాజకీయంగా ఎక్కడ నుంచైనా ప్రాతనిధ్యం వహించవచ్చని సజ్జల అన్నారు. షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏంలేదన్నారు. సీఎం రమేష్‌కు చెందిన విమానంలో షర్మిల, బ్రదర్ అనిల్ దిల్లీ వెళ్లారన్నారు. ఎయిర్ పోర్టులో టీడీపీ నేత బీటెక్ రవిని, బ్రదర్ అనిల్ కలవడం... బెంగళూరులో కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో చంద్రబాబు కలవడం అంత తెరవెనుక రాజకీయాలు అన్నారు. వైఎస్ఆర్ మరణానికి సంబంధించి కాంగ్రెస్‌పై అనుమానాలున్నాయన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసే గతంలో జగన్ పై తప్పుడు కేసులు పెట్టారన్నారు. వైఎస్ఆర్ చనిపోయాక, పులివెందుల నుంచి విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే... ఆమెకు పోటీగా పులివెందుల నుంచి వివేకానందరెడ్డిని కాంగ్రెస్ బరిలో దించిందని విమర్శఇంచారు. కాంగ్రెస్ తో చంద్రబాబుకు ఎప్పటి నుంచో కాంటాక్ట్ ఉందన్నారు. సంక్షేమం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న చంద్రబాబుకు మైనస్ మార్కులు వస్తాయన్నారు.
కాంగ్రెస్ కు ఏపీలో భవిష్యత్ లేదు
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయ భవిష్యత్ లేదని సజ్జల విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే పరిస్థితులు ఏపీలో లేవన్నారు. ప్రజలా? కుటుంబమా? అనే ప్రశ్న వస్తే సీఎం జగన్ కు ప్రజలే ముఖ్యమన్నారు. రాజకీయాల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఉండకూడదంటూ... కుటుంబ వాదన ఎందుకు తెస్తున్నారని మండిపడ్డారు. జగన్ కుటుంబం కోసం వైసీపీ పెట్టలేదన్నారు. ఈ సారి ఎన్నికల్లో ఓటమి తప్పదనే చంద్రబాబు ప్రజల్ని డైవర్ట్ చేయడానికి కుట్రలు చేస్తున్నారని సజ్జల ధ్వజమెత్తారు.
అంగన్వాడీలపై ఎస్మా సరైందే
ఏపీలో వేతన పెంపు కోసం అంగన్వాడీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించింది. ఎస్మా ప్రయోగంపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం సరైందేనని సజ్జల అన్నారు. అంగన్వాడీల సమ్మెతో పిల్లలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారి ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అంగన్వాడీలు అత్యవసర సర్వీసుల కింద ఉన్నారన్నారు. వారిని విధుల్లో చేరాలని పలుమార్లు కోరామన్నారు. కానీ అంగన్వాడీలు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించారని, అందుకే సమ్మెపై ఎస్మా ప్రయోగించాల్సి వచ్చిందని సజ్జల తెలిపారు.