AP Shakatam : రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం
AP Shakatam : రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం లభించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆన్లైన్ ఓటింగ్ లో ఏపీ శకటానికి మూడో స్థానం దక్కింది.
AP Shakatam : రిపబ్లిక్ డే వేడుకల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం లభించింది. డిజిటల్ విద్యా బోధన, నాడు నేడు, ఆంగ్ల మాధ్యమంలో బోధన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ శకటాన్ని రూపొందించారు. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వికసిత భారత్ భాగంగా రూపొందించిన ఏపీ శకటానికి మూడో స్థానం దక్కింది. జనవరి 26, 27 తేదీల్లో దేశ వ్యాప్తంగా విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఓటింగ్ నిర్వహించారు. ఆన్లైన్ ఓటింగ్ లో ఏపీ శకటానికి మూడో స్థానం దక్కగా.. తొలి స్థానంలో గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన శకటం నిలిచింది. మంగళవారం దిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ జేడీ కిరణ్ కుమార్ అవార్డు అందుకోనున్నారు.
విద్యారంగ సంస్కరణలకు అద్దం పట్టేలా
దేశ రాజధానిలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ ప్రభుత్వ శకటం పాల్గొంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలకు అద్దం పట్టేలా విద్యా రంగం సంస్కరణల నేపథ్యంలో రూపొందించిన శకటాన్ని కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే పరేడ్ కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఏపీలో 62వేల డిజిటల్ క్లాస్ రూమ్‌లతో బోధన అందిచడం ద్వారా ఏపీ కొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ స్థాయి విద్యా బోధన అందించేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ శకటానికి సమాచార శాఖ అధికారులు రూపకల్పన చేశారు. డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో రూపొందించిన శకటం జనవరి 26న ఏపీ తరఫున గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించారు. వివిధ విడతలుగా స్క్రీనింగ్ నిర్వహించి ఏపీ సర్కార్ ఈ శకటాన్ని రూపొందించింది. జనవరి 26న కర్తవ్య పథ్ లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా ఏపీ శకటాన్ని ప్రదర్శించారు.
కార్పొరేట్ విద్యకు పోటీగా
"విద్య అనేది పిల్లలకు ఇవ్వగల ఆస్తి, విద్య రంగంలో వెచ్చించే ఖర్చు అంతా రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి పెట్టుబడి అవుతుంది" అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, వినూత్న పథకాలను తీసుకురావడంతో పాటు కార్పొరేట్ పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా మన విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోందని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి వివరించింది.
ఒడిశా, గుజరాత్ కు మొదటి స్థానం
రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న ఒడిశా శకటానికి మొదటిస్థానం దక్కింది. అన్ని రాష్ట్రాలు, యూటీల శకటాల్లో ఒడిశా ఉత్తమమైనదిగా ఎంపికైంది. ఈ ఏడాది ఒడిశా శకటంలో మహిళా సాధికారతపై సందేశాలతో రఘురాజ్‌పూర్ వారసత్వ హస్తకళల గ్రామం నమూనాను ప్రదర్శించారు. రఘురాజ్‌పూర్ చిత్రం, హస్తకళల ద్వారా అద్భుతమైన హస్తకళల కళాత్మకతను ఈ శకటంలో ప్రదర్శించారు. అంతేకాకుండా కుటీర పరిశ్రమల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారతను ఇందులో హైలైట్ చేసింది. పీపుల్స్ చాయిస్ కేటగిరీలో ఒడిశాతో పాటు గుజరాత్‌కు చెందిన శకటం మొదటి బహుమతిని గెలుచుకుంది.
సంబంధిత కథనం