EVM Hacking Issue : ఈవీఎంలపై మాజీ సీఎం జగన్ ఆరోపణలు, జగన్ పాత వీడియోతో లోకేశ్ కౌంటర్
EVM Hacking Issue : దేశవ్యాప్తంగా ఈవీఎం హ్యాకింగ్, ట్యాంపరింగ్ పై విమర్శలు వస్తున్నాయి. ఏపీ మాజీ సీఎం జగన్ సైతం ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నారు. అయితే జగన్ కామెంట్లతోనే వైసీపీకి టీడీపీ గట్టి కౌంటర్ ఇస్తోంది.
EVM Hacking Issue : ఏపీ మాజీ సీఎం జగన్ నుంచి ఎలాన్ మస్క్ వరకు ఇప్పుడు ఈవీఎం హ్యాకింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ... ఫలితాలు విడుదలైన రోజు నుంచి ఈవీఎంల హ్యాకింగ్ పై ఆరోపణలు చేస్తుంది. ఆ పార్టీ అధినేత జగన్ అయితే ట్విట్టర్ వేదికగా వరుసగా పోస్టులు చేస్తున్నారు. ఈవీఎంలపై జగన్ ఆరోపణకు టీడీపీ గట్టి కౌంటర్లు ఇస్తుంది. గతంలో జగన్ మాట్లాడిన వీడియోలనే వైరల్ చేస్తుంది. ప్రజల తీర్పు తనకు అనుకూలంగా వస్తే ఒకలా ఈవీఎంలు ఓకే, వ్యతిరేకంగా వస్తే ఈవీఎం వద్దు బ్యాలెట్లు కావాలని జగన్ అంటున్నారని టీడీపీ ఎద్దేవా చేస్తుంది.
వైఎస్ జగన్ ఏమన్నారంటే?
"న్యాయం జరగడం మాత్రమే కాదు, న్యాయం జరిగిన విధానం కూడా కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం గెలవడంతో పాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి. దాదాపు అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల పద్ధతుల్లో పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారు. ఈవీఎంలు కాదు. మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి." అని ట్వీట్ చేశారు.
ఈవీఎంల హ్యాకింగ్, ట్యాంపరింగ్ పై ఇటీవల కాలంలో విమర్శలు వస్తున్నాయి. ఇది సాధ్యం కాదని ఎన్నికల సంఘం వారిస్తుంది. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రమే ఈవీఎంలను హ్యాక్ చేస్తు్న్నారన్న ఆరోపణలు చేస్తున్నాయి. అయితే గెలిచినప్పుడు లేని అభ్యంతరాలు ఓటమి పాలైనప్పుడు ఎందుకు చేస్తు్న్నారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
లోకేశ్ కౌంటర్
ఈవీఎంలపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ఆరోపణలపై టీడీపీ నేతలు, మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ మాట్లాడిన వీడియోలను ఇందుకు బదులుగా పోస్టులు చేస్తున్నారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని టీడీపీ ఆరోపించింది. దీనిపై అప్పట్లో జగన్ స్పందిస్తూ...ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదని, వీవీప్యాట్ స్పిప్పుల్లో ఎవరికి ఓటు వేస్తున్నామో తెలుస్తుందన్నారు. ఈ వీడియోలను ప్రతిపక్షాలు వైసీపీ మీదకు ఎదురు సంధిస్తున్నాయి.
జగన్ విమర్శలుపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. " మీకు ప్రజాస్వామ్యం అంటే ఎలర్జీ. ప్రజల హక్కులను పరిరక్షించడానికి అంకితమైన సంస్థలు, వ్యవస్థలను మీరు క్రమపద్ధతిలో నాశనం చేశారు. ఏళ్ల తరబడి ఏపీ ప్రజలు సమిష్టిగా నిర్మించిన వాటిని మీరు ఒక్క దెబ్బతో కొట్టిపారేశారు. మీరు 2019లో గెలిచినప్పుడు, EVMలు అద్భుతంగా పనిచేశాయి. 2024లో ఓడిపోయినప్పుడు ఈవీఎంలను నిందిస్తున్నారు. బహుశా మీరు మీ పాలన గురించి ఆలోచిస్తే మంచిది. ప్రజలు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించారని అంగీకరించాలి. దీంతో పాటు ప్రభుత్వ వ్యయంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్‌ను ఎప్పుడు తిరిగి ఇస్తున్నారు? రుషికొండ ప్యాలెస్ కట్టుకోవడానికి పేదల డబ్బు రూ.560 కోట్లు ఎందుకు వెచ్చించారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం కావాలి" అని లోకేశ్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
బీజేపీ కౌంటర్
"ఈవీఎంల వల్ల ఓడిపోయారని మీరనుకుంటే 2019లో కూడా ఈవీఎంల రిగ్గింగ్ జరిగిందని మీరంటున్నారా? జగన్.. ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే దేశాన్ని వ్యతిరేకించే వారితో చేతులు కలుపుతున్నారా? గతంలో మీరు గెలిచినప్పుడు ఇదే ఈవీఎంలను మీరు సమర్థించిన విషయం మర్చిపోయారా? ఈ ఓటమితోనైనా మంచి మనిషిగా మారండి జగన్!" అని ఏపీ బీజేపీ ట్వీట్ చేసింది.
సంబంధిత కథనం