AP Old Liquor Brands : మందుబాబులకు కూల్ న్యూస్, పాత బ్రాండ్లు వచ్చేస్తున్నాయ్!
AP Old Liquor Brands : మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం వరుస తీపికబుర్లు చెబుతోంది. అక్టోబర్ మొదటి వారం నుంచి కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా పాత బ్రాండ్ల మద్యం అందుబాటులో ఉంచనున్నారు. మద్యం ధరలు సైతం తగ్గనున్నాయి.
AP old Liquor Brands : ఏపీలో నూతన మద్యం పాలసీకి కేబినెట్ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ మొదటి వారంలో కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి రానుంది. ఈ నెలాఖరులోపు దరఖాస్తుల ప్రక్రియ, దుకాణాల అలాట్మెంట్ పూర్తి చేయనున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడుపుతుంది. అయితే కొత్త పాలసీ ప్రకారం మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించనున్నారు. లాటరీ విధానంలో షాపులు కేటాయిస్తాయి.
కొత్త బ్రాండ్లు వచ్చేస్తున్నాయ్
మద్యం ప్రియులు ఎన్నాళ్ల గానో పాత బ్రాండ్ల లిక్కర్ అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ హయాంలో కొత్త బ్రాండ్లను అందుబాటులోకి తేవడంతో పాటు పాత బ్రాండ్లను నిలిపివేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం పాత బ్రాండ్లు తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీంతో పాటు నాణ్యమైన మద్యాన్ని సగటున రూ.99 నుంచే విక్రయించాలని నిర్ణయించింది. ఎంఎన్సీ కంపెనీల మద్యం బ్రాండ్లను తిరిగి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మెక్ డోవెల్స్, ఇంపీరియల్ బ్లూ బ్రాండ్ల మద్యం నిన్న రాష్ట్రానికి చేరుకున్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్ మద్యం బ్రాండ్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. వాట్ 69, జానీవాకర్, యాంటిక్విటీ, రాయల్ ఛాలెంజ్, వోడ్కా, బ్లాక్ డాగ్ బ్లాండ్ల మద్యం త్వరలోనే రాష్ట్రానికి చేరుకుంటుంది. దీంతో పాటు ప్రముఖ కంపెనీల బీర్లు కూడా మద్యం షాపుల్లో అందుబాటులో ఉంచనున్నారు.
ఏపీలో మల్టి నేషనల్ కంపెనీల లిక్కర్ బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ క్రమంలో మద్యం కొనుగోలుదారుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండడంతో మెక్ డోనాల్ట్స్, ఇంపీరియలర్ బ్లూ బ్రాండ్లు ఏపీలో అందుబాటులోకి వచ్చాయి. ఇంపీరియల్ బ్లూ బ్రాండ్ మద్యం 60,000 కేసులు ఇప్పటికే మద్యం షాపులకు చేరుకున్నాయి. ఇక మెక్ డోనాల్ట్స్ 1 బ్రాండు 10,000 కేసుల క్వార్టర్ సీసాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. మెక్ డోనాల్డ్స్ రానున్న పదిరోజుల్లో లక్ష కేసులు ఏపీకి చేరనున్నాయని అధికారులు తెలిపారు.
దరఖాస్తులతోనే భారీ ఆదాయం
ఏపీలో నూతన మద్యం పాలసీలో ప్రైవేట్ లిక్కర్ షాపులకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 3736 మద్యం దుకాణాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. దరఖాస్తుదారులు ముందుగా రూ.2 లక్షల నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దాదాపుగా 15 నుంచి 20 వేల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే 12 ప్రధాన పట్టణాల్లో ప్రీమియర్ స్టోర్లకు భారీగా ఫీజు నిర్ణయించనున్నారు. దీంతో మద్యం దుకాణాల దరఖాస్తులతో రూ.300-రూ.400 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రీమియర్ షాపులకు రూ. కోటి ఫీజు కాగా నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ కింద రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. లక్కీ డ్రా విధానంలో మద్యం షాపులు కేటాయించనున్నారు. అలాగే మద్యం షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు తెరిచి ఉంచనున్నారు.
సంబంధిత కథనం