Liquor Brands | మద్యం బ్రాండ్లపై లొల్లి.. మద్యాంధ్రప్రదేశ్ మీరే చేశారంటూ టీడీపీ, వైసీపీ మాటల యుద్ధం!-ysrcp and tdp allegations on liquor brands ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Liquor Brands | మద్యం బ్రాండ్లపై లొల్లి.. మద్యాంధ్రప్రదేశ్ మీరే చేశారంటూ టీడీపీ, వైసీపీ మాటల యుద్ధం!

Liquor Brands | మద్యం బ్రాండ్లపై లొల్లి.. మద్యాంధ్రప్రదేశ్ మీరే చేశారంటూ టీడీపీ, వైసీపీ మాటల యుద్ధం!

HT Telugu Desk HT Telugu

మద్యం బ్రాండ్లపై ఏపీలో రచ్చ రచ్చ నడుస్తోంది. కల్తీ మద్యానికి చంద్రబాబే కారణమంటూ.. అధికార పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. అధికారంలోకి వచ్చాక.. జగన్ అనే మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారంటూ.. టీటీడీ ఆరోపణలు చేస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో ప్రస్తుతం రాజకీయం మెుత్తం.. కల్తీ మద్యం చుట్టూనే తిరుగుతోంది. ఓ వైపు అసెంబ్లీలోనూ.. రచ్చ రచ్చ నడుస్తుంటే.. మరోవైపు.. బయట కూడా మద్యంపై మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ, టీడీపీ.. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటేనే ఉన్నారు. చంద్రబాబై చీప్ లిక్కర్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటూ.. వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు.. మద్యంతో వినూత్న రీతిలో టీడీపీ నిరసనలు తెలుపుతోంది.

తాజాగా మద్యంపై.. మంత్రి కొడాలి నాని మాట్లాడారు. టీడీపీ విమర్శిస్తున్న మద్యం బ్రాండ్లు ఎవరి హయాంలో తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఆ బ్రాండ్లు తెచ్చిన ప్రబుద్ధుడు ఎవరు.. అనేదానిపై అసెంబ్లీ సాక్షిగా సీఎం సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారన్నారు. ఆ వాస్తవాన్ని అంగీకరించే దమ్మూ, ధైర్యం లేక టీడీపీ ఎమ్మెల్యేలు డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

చంద్రబాబు అధికారంలో ఉండగా, పెద్దఎత్తున కమీషన్లు తీసుకుని డిస్టలరీలకు అనుమతులు ఇచ్చారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనుడు చంద్రబాబే. ఈ రాష్ట్రంలో నాటు సారాను కనిపెట్టిన వ్యక్తే చంద్రబాబు నాయుడు. సారాను బాటిల్‌లో పోసి, దానికి వారుణి- వాహిని అని పేరుపెట్టింది కూడా తెలుగుదేశం పార్టీయే. తప్పుడు పనులు వారు చేసి, జే బ్రాండ్లు అని, డిస్టలరీలను రద్దు చేయాలని చెబుతున్నారు. మేం వాటిని రద్దు చేస్తే వాళ్లంతా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారనే విషయం బాబుకు తెలియదా?. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, లెజెండ్, 999 పవర్ స్టార్, బూమ్‌ బూమ్‌ బీరు... ఇలాంటి పిచ్చి బ్రాండ్లకు అనుమతి ఇచ్చింది చంద్రబాబే.

                                                   - మంత్రి కొడాలి నాని

దోపిడీ కోసం మద్యం బ్రాండ్లు: టీడీపీ

అయితే మద్యం బ్రాండ్లపై అధికార పార్టీకి ప్రతిపక్ష టీడీపీ నేతలు.. కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. తన దోపిడీ కోసం కొత్త మద్యం పాలసీ జగన్ తెచ్చారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. అవాస్తవాలు అవలీలగాచెప్పడం.. అసత్యాలు వల్లెవేయడంలో జగన్ రెడ్డిని మించినవారు భూమ్మీదేలేరన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 103 కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొచ్చారని తెలిపారు. అసెంబ్లీలో జగన్ చెప్పినవన్నీ.. కేవలం మద్యం తయారీ కంపెనీలని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అమలు చేసిన పథకాలే ఉంచని జగన్మోహన్ రెడ్డి..ఆయనతీసుకొచ్చిన మద్యంకంపెనీలు, బ్రాండ్లు ఉంచుతాడా? అని అచ్చెన్న ప్రశ్నించారు.

అయ్యన్నపాత్రుడు..సుధాకర్ యాదవ్.. ఆదికేశవులు నాయుడు అని కొందరు టీడీపీనేతల పేర్లు చెప్పిన ముఖ్యమంత్రి, మద్యం తయారీ కంపెనీలన్నీ టీడీపీవారివే అంటున్నాడని అచ్చెన్న అన్నారు. అయితే వారికి అసలు ఇప్పుడు మద్యం కంపెనీలు లేనేలేవని తెలిపారు. సీఎం జగన్ ఎప్పుడో తన వాళ్లకు అప్పగించాడన్నారు. ముఖ్యమంత్రి సభలో చెప్పినవన్నీ అబద్ధాలేనని వ్యాఖ్యానించారు.

కొన్ని రోజులుగా.. ఏపీలో మద్యం బ్రాండ్లపై టీడీపీ వైసీపి నడుమ ఇలానే వివాదం నడుస్తోంది. మీరు తెచ్చారంటే.. మీరు తెచ్చారంటూ.. రెండు పార్టీలూ విమర్శలు గుప్పించుకుంటున్నాయి.

సంబంధిత కథనం