Pawan Kalyan : చిరుద్యోగి లంచం తీసుకుంటే కఠిన చర్యలు, పెద్దొళ్లు వేల కోట్లు దోచేస్తే శిక్షలు ఉండవా?- పవన్ కల్యాణ్ ఫైర్
Pawan Kalyan On Liquor Policy : వైసీపీ ప్రభుత్వం హయాంలో రూ.18 వేల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్ సూత్రదారులు, పాత్రదారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Pawan Kalyan On Liquor Policy : ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. అసెంబ్లీలో మద్యంపై శ్వేతపత్రం విడుదల అనంతరం జరిగిన చర్చలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో మద్యం పేరుతో భారీగా దోపిడీ జరిగిందన్నారు. శ్వేతపత్రంలో రూ.15 వేల కోట్లు అన్నారు కానీ రూ.18 వేల కోట్లకు పైనే అక్రమాలు జరిగాయన్నారు. కేంద్ర బడ్జెట్ లో రూ.15 వేల కోట్లు కేంద్రం కేటాయిస్తే ఎంతో ఆనందపడ్డామని, అలాంటి మద్యం అక్రమాల్లో నష్టం వచ్చిన రూ.18 వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు వచ్చి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేదన్నారు. లిక్కర్ స్కామ్ సూత్రదారులు, పాత్రదారులను కఠినంగా శిక్షించాలన్నారు. రోడ్డుపై ఒక కానిస్టేబుల్ లంచం తీసుకుంటే చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం... వేల కోట్లు అక్రమాలకు పాల్పడిన వారి వదిలిపెట్టకూడదన్నారు. ఇలాంటి వారిని వదిలిస్తే, తప్పు గురించి మాట్లాడే నైతిక హక్కు మనకు ఎక్కడుంటుందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మద్యం కుంభకోణం కారకులను కచ్చితంగా శిక్షించాలన్నారు. రాజకీయనేతలు తప్పు చేస్తే శిక్షలు ఉండవా అనే ఆలోచన సామాన్యునికి కలగకుండా చూడాలన్నారు. మద్యం విధానంపై సమగ్ర విచారణ జరగాలని పవన్ కల్యాణ్ అన్నారు.
పెద్దొళ్లకు శిక్షలు ఉండవా?
రూ. 20 వేల లంచం తీసుకున్న ఓ చిన్న ఉద్యోగిని శిక్షించగలుగుతున్నామన్న పవన్ కల్యాణ్... భారీ మొత్తంలో దోపిడీలు చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలిపెట్టకూడదన్నారు. పెద్దొళ్లు తప్పు చేస్తే శిక్షలు ఉండవా? అనే భావన సామాన్యులకు కలగకూడదన్నారు. మద్యం కుంభకోణంలో సమగ్ర దర్యాప్తు జరగాలని అభిప్రాయపడ్డారు. అక్రమాలకు పాల్పడిన వారందరికీ చట్టం ముందు నిలబెట్టాలన్నారు. అలాగే మద్యంపై వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. మద్యం ఆదాయంలో కొంత ఈ వ్యసనాన్ని తగ్గించేలా డీఎడిక్షన్ సెంటర్లకు కేటాయించాలన్నారు. కనీసం 10 శాతం ఆదాయం డీఎడిక్షన్ సెంటర్లకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రూ.98 వేల కోట్ల నగదు లావాదేవీలు
వైసీపీ హయాంలో మద్యం విధానంపై కేంద్రానికి అనేక లేఖలు రాసినట్లు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తెలిపారు. రూ.98 వేల కోట్ల ట్రాన్సాక్షన్ నగదు రూపంలో జరిగిందని, దీనిపై విచారణ జరగాలని కోరానని తెలిపారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సేల్స్ లో 30 శాతం నగదు లావాదేవీలు జరిగిందని అంచనా ఉందన్నారు. అలాగే గత ప్రభుత్వంలో విక్రయించిన లిక్కర్ లో ఇంప్యూరిటీలు ఉన్నాయని, వీటి వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ప్రజారోగ్యంతో ఆడుకుంటూ, వేల కోట్ల అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అసెంబ్లీలో ప్రభుత్వా్న్ని కోరారు. ఒక్కరోజు కూడా నిల్వ లేని పచ్చి మందును డిస్టిలరీల నుంచి గత ప్రభుత్వం నేరుగా మద్యం దుకాణాల్లో విక్రయించిందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. మద్యం విక్రయాలు నగదు లావాదేవీల్లో చేశారన్నారు. లిక్కర్ విషయంలో వైసీపీ చేసిన దారుణాలు ఎవ్వరూ చేయలేదన్నారు. గతంలో ఉన్న బ్రాండ్లను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
సంబంధిత కథనం