AP ACB Trap: విదేశీ విద్యా దీవెనకు సెక్షన్ ఆఫీసర్ లంచం, పట్టుకున్న ఏసీబీ-acb nabs section officer for accepting bribe for release of overseas education grant ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Acb Trap: విదేశీ విద్యా దీవెనకు సెక్షన్ ఆఫీసర్ లంచం, పట్టుకున్న ఏసీబీ

AP ACB Trap: విదేశీ విద్యా దీవెనకు సెక్షన్ ఆఫీసర్ లంచం, పట్టుకున్న ఏసీబీ

Sarath chandra.B HT Telugu
Nov 24, 2023 12:49 PM IST

AP ACB Trap: ఏసీబీ వలలో ఏపీ సెక్రటేరియట్ ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగి చిక్కారు. విదేశీ విద్యాదీవెన నిధుల విడుదలకు లంచం తీసుకుంటూ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఏసీబీకి చిక్కారు.

ఏసీబీకి చిక్కిన సెక్రటేరియట్ సెక్షన్ ఆఫీసర్ నాగభూషణ్ రెడ్డి
ఏసీబీకి చిక్కిన సెక్రటేరియట్ సెక్షన్ ఆఫీసర్ నాగభూషణ్ రెడ్డి

AP ACB Trap: విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల చేయడానికి విద్యార్ధి లంచం తీసుకుంటూ సచివాలయ ఉద్యోగి ఒకరు ఏసీబీకి చిక్కారు. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ఆర్ధిక శాఖ సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఒంటెద్దు నాగభూషణ్ రెడ్డి శుక్రవారం ఉదయం ఏసీబీకి చిక్కారు.

yearly horoscope entry point

గుంటూరులోని కొరిటెపాడు రోడ్డులోని గౌతమి నగర్‌లోని నివాసంలో ఉంటున్న సెక్షన్ ఆఫీసర్ నిత్యం ఆర్టీసీ బస్సులు సచివాలయానికి వచ్చేవారు. ఈ క్రమంలో శుక్రవారం ఫిర్యాదిని ఎక్కించుకుని బైక్‌పై సచివాలయానికి వచ్చారు. అక్కడ అతని నుంచి రూ.40 వేల రుపాయల లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. కర్నూలుకు చెందిన మహమ్మద్ నదీమ్ హుస్సేన్‌ నుంచి నిందితుడు నాగభూషణ్ రెడ్డి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

కర్నూలుకు చెందిన మహమ్మద్ నదీమ్ హుస్సేన్ కుమారుడు అజ్మతుల్లా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విదేశీ విద్యాదీవెన పథకంలో భాగంగా విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఈ పథకంలో విద్యార్ధులు మొదట ఫీజులు చెల్లించిన తర్వాత వాటిని రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. ఈ క్రమంలో విద్యార్ధికి రావాల్సిన ఫీజులను విడుదల చేయడానికి ఆర్థిక శాఖలో సంక్షేమ విభాగం సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న నాగభూషణ్ రెడ్డి లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.

శుక్రవారం ఉదయం సెక్షన్ ఆఫీసర్‌ బాధితుడిని తన బైక్‌పై ఎక్కించుకుని సెక్రటేరియట్ వెలుపల మాట్లాడుతూ డబ్బులు తీసుకున్నాడు. నగదు తీసుకున్న వెంటనే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు దాడి చేసి జేబులో దాచిన నగదు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడి నివాసంలో సోదాలు జరుపుతున్నారు. రోజు గుంటూరు నుంచి ఆర్టీసి బస్సులో సచివాలయానికి వచ్చే నిందితుడు నేడు లంచం కోసం బైక్‌ వస్తానని సహోద్యోగులకు చెప్పిన కాసేపటికే ఏసీబీ ట్రాప్‌లో ఇరుక్కున్నాడని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు.

Whats_app_banner