IAS Transfer: రద్దీ రోడ్లపై నేతల విగ్రహాలు పెట్టించిన ఐఏఎస్‌కు ఘన సన్మానం, బదిలీపై వెళ్లిన విజయవాడ మునిసిపల్ కమిషనర్
IAS Transfer: రద్దీ రోడ్లపై రాజకీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నా కిమ్మనకుండా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి, బదిలీపై వెళుతుండటంతో కార్పొరేషన్ సిబ్బంది విజయవాడలో ఘనంగా సన్మానం చేశారు.
IAS Transfer: విజయవాడలో వివాదాస్పద నిర్ణయాలు, అడ్డగోలు ఆదేశాలతో వైసీపీ నాయకులతో అంటకాగిన ఐఏఎస్ అధికారికి ఘన సన్మానం జరిగింది. ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు బదిలీ అయిన మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నగరానికి వచ్చిన కొత్తలో కఠినంగా వ్యవహరిస్తారని ప్రచారం జరిగింది.
విజయవాడలో బాధ్యతలు చేపట్టడానికి ముందు పనిచేసిన ప్రదేశాల్లో కూడా ముక్కుసూటిగా పనిచేస్తారని పేరు తెచ్చుకున్న ఆయన విజయవాడ మునిసిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజకీయ నాయకులకు పూర్తిగా సరెండర్ అయిపోయారు. గత ప్రభుత్వంలో మునిసిపల్ అడ్మినిష్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖను పర్యవేక్షించిన శ్రీలక్ష్మీ కనుసన్నల్లో పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి.
విజయవాడ మునిసిపల్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి టౌన్ ప్లానింగ్ విభాగాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నా కమిషనర్ కట్టడి చేయలేకపోయారు. కార్పొరేషన్‌కు రావాల్సిన డెవలప్‌మెంట్ ఛార్జీలు పక్కదారి పట్టినా చూసి చూడనట్టు వ్యవహరించారు.
విజయవాడలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. స్వరాజ్యమైదాన్‌లో రూ.180 కోట్ల అంచనాతో ప్రారంభించిన అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పర్యవేక్షణను కార్పొరేషన్ చేపట్టింది. తెలంగాణలో రూ.200కోట్ల ఖర్చుతో అన్ని హంగులతో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం, ఆడిటోరియం, పార్క్‌లు అభివృద్ధి చేస్తే విజయవాడలో మాత్రం ఆ వ్యయం రూ.400కోట్లను దాటేసింది. దీనిలో కమిషనర్ ప్రమేయం కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే అమ్రిత్ నిధులతో విజయవాడ నుంచి ఎయిర్ పోర్ట్ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు రోడ్ల సుందరీకరణ పనులు చేపట్టారు. ఇందులో కూడా వందల కోట్లు దుర్వినియోగం జరిగింది. విజయవాడ నగరంలో ప్రవహించే కృష్ణా నది ముంపు లేకుండా దాదాపు రూ.400కోట్లతో నిర్మించిన రిటైనింగ్ వాల్ లోపల రివర్ ఫ్రంట్ పార్క్ అభివృద్ధి చేశారు. దీని కోసం కోట్లాది రుపాయలు ఖర్చు చేశారు. రివర్ ఫ్రంట్ పార్కు ప్రారంభించి సరిగ్గా మూడు నెలలు కూడా పూర్తి కాలేదు. ఇప్పటికే పార్క్‌లో సగం నిర్మాణాలు ధ్వంసమైపోయాయి. నాసిరకం నిర్మాణాలు చేయడంతో టైల్స్ విరిగిపోవడం, చెట్లు ఎండిపోయాయి.
సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించి విజయవాడ నగరంలో ప్రధాన రోడ్లపై గ్రానైట్ రాళ్లను పరచడంలో కమిషనర్ కీలకంగా వ్యవహరించారు. బాగున్న ఫుట్‌పాత్‌లను పగులగొట్టి వాటిపై గ్రానైట్ రాళ్లను వేయించారు. ఇందుకోసం కోట్లాది రుపాయలు ఖర్చు చేశారు. అదే సమయంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, మురుగు కాల్వల పూడిక తీత, డ్రెయిన్ల నిర్వహణ వంటి వాటిని గాలికి వదిలేశారు.
గతంలో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థను మొత్తం ధ్వంసం చేశారు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేస్తే 24గంటల్లో వీధిలైైట్లు మొదలుకుని, డ్రెయిన్ల వరకు ఎలాంటి సమస్యలైనా విజయవాడలో పరిష్కారం అయ్యేవి. స్వప్నిల్ దినకర్ హయంలో వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. సచివాలయాలను గాలికొదిలేశారు. వాలంటీర్లు, శానిటేషన్ కార్యదర్శులపై ఏ మాత్రం పర్యవేక్షించలేదు.
నగరంలోని అన్ని ప్రాంతాల్లో యథేచ్చగా అక్రమంగా కూడళ్లలో విగ్రహాలను ఏర్పాటు చేసినా కిమ్మనలేదు. రోడ్ల మధ్యలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగించేలా రాజకీయ నాయకులు, కుల నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయడానికి కమిషనర్ పూర్తిగా సహకరించారు. ఆయన నిర్వాకంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. విజయవాడ నగర మేయర్ భర్త చెప్పినదానికి తలాడించడం తప్ప ఏమి చేయలేదనే అపవాదును మూటగట్టుకున్నారు.
అధికార పార్టీ నాయకుల ఆదేశాలను పాటించడం, వారు చెప్పింది చేయడానికి కమిషనర్‌గా ఉన్నంత కాలం ప్రాధాన్యమిచ్చారు. విజయవాడలో చోటు చేసుకున్న వ్యవహారాలతో సంబంధం లేకుండా ఆయనకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ లభించడంపై విమర్శలు వచ్చాయి. సివిల్ సర్వీస్‌లో భాగంగా తొలుత ఐపీఎస్ కు ఎంపికైనా మళ్లీ పట్టుబట్టి ఐఏఎస్ అయిన స్వప్నిల్ దినకర్ విజయవాడలో ఏ మాత్రం ప్రభావం, సమర్ధత చూపకుండానే వెళ్ళిపోయారు. శ్రీకాకుళం కలెక్టర్‌గా బదిలీ అయినందుకు కార్పొరేషన్ ఉద్యోగులు ఆయనకు ఘన సన్మానం చేశారు.