AP Loans : మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.50 వేల రాయితీతో రుణాలు.. పూర్తి వివరాలు ఇవే
AP Loans : మహిళల ఆర్థిక ప్రగతికి కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేయబోతోంది. రాయితీపై రుణాలు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. స్వయం ఉపాధి చేసుకునే మహిళలకు దన్నుగా నిలిచేందుకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోంది. వచ్చే నెల నుంచి లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు.
ఏపీ లోని డ్వాక్రా సంఘాల్లో ఉన్న ఎస్సీ మహిళల స్వయం ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది. ఉపాధి యూనిట్ ఏర్పాటుకు, ఇప్పటికే ఉన్న యూనిట్ల విస్తరణకు రూ.50వేల రాయితీతో రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు రుణాలు అందించడానికి ముందడుగు వేస్తోంది. తీసుకున్న రుణంలో రాయితీ పోను.. మిగతా మొత్తంపై వడ్డీ ఉండదని అధికారులు చెబుతున్నారు.
రాయితీ రుణాలకు మూడేళ్లలో రూ.500 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో రాయితీ రూ.180 కోట్లు ఉండనున్నాయి. మిగతా రూ.320 కోట్లు వడ్డీలేని రుణంగా అందించనున్నారు. ఇప్పటికే తొలి విడతగా రూ.8 కోట్ల రాయితీని ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి నవంబర్ నెల నుంచి లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నట్టు అధికారులు వివరించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు సెర్ప్ ద్వారా మహిళలకు బ్యాంకు లింకేజి రుణాలు, సున్నావడ్డీ రుణాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు రాయితీ విధానం లేదు. తొలిసారిగా డ్వాక్రా పరిధిలో రాయితీ రుణాలు ఇస్తున్నారు. దీనికి ఎస్సీ కార్పొరేషన్‌కు కేంద్రం ఇచ్చే నిధుల్ని సెర్ప్ పరిధిలోని ఉన్నతి పథకానికి అనుసంధానిస్తున్నట్టు అధికారులు వివరిస్తున్నారు.
రాయితీ రుణాల కోసం అధికారులు బ్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. దీనికి బ్యాంకర్లు ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. ఇటు ప్రభుత్వం రాయితీ విడుదల చేసినా.. దానికి తగినట్టు బ్యాంకర్లతో రుణాలు ఇప్పించడం ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. దీంతో కేంద్ర ప్రభుత్వ నిధుల్ని సెర్ప్‌కు అనుసంధానించి.. అక్కడి నుంచి రుణాలు మంజూరు చేయించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
మహిళలకు ఉన్నతి పథకం కింద ఈ ఏడాదికి రూ.150 కోట్ల రుణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం నిధుల విడుదలతో సంబంధం లేకుండా ఇప్పటికే సెర్ప్ పరిధిలో నిధులు ఉన్నాయి. ఈ పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారులు క్రమం తప్పకుండా రుణ వాయిదాలు చెల్లిస్తున్నారు. దీంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందే రాయితీని వీరికి వర్తింపచేస్తే.. ఆదాయాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే.. ఈ రాయితీ మొత్తాన్ని మొదట విడుదల చేయకుండా.. రుణ వాయిదాల్లో చివరలో మినహాయించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాపారం, తయారీ రంగం, చిన్నతరహా కుటీర పరిశ్రమలు, సేవారంగాల్లో ఉన్నవారికి రాయితీ రుణాలు అందించనున్నారు. తీసుకున్న రుణంలో రాయితీ పోను మిగతా మొత్తాన్ని లబ్ధిదారులు 24 నుంచి 60 నెలల్లో వాయిదా పద్ధతిలో చెల్లించాలి. ఇలా చేస్తే.. మహిళలపై రుణభారం ఉండబోదని భావిస్తున్నారు.