Flood Donations: వరద విరాళాలకు పన్ను రాయితీ, విజయవాడలో భారీగా ప్రాణ నష్టం, 40కు చేరిన మృతుల సంఖ్య-tax concession for flood donations heavy loss of life in vijayawada death toll reaches 40 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Flood Donations: వరద విరాళాలకు పన్ను రాయితీ, విజయవాడలో భారీగా ప్రాణ నష్టం, 40కు చేరిన మృతుల సంఖ్య

Flood Donations: వరద విరాళాలకు పన్ను రాయితీ, విజయవాడలో భారీగా ప్రాణ నష్టం, 40కు చేరిన మృతుల సంఖ్య

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 06, 2024 09:48 AM IST

Flood Donations: విజయవాడ నగరాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. ప్రాణనష్టం కూడా భారీగానే ఉంది. ప్రాథమిక అంచనాల ప్రకారం 40మంది చనిపోగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు వరద సహాయక చర్యలకు విరాళాలు అందించే వారికి పన్ను రాయితీ లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.

విజయవాడలో అంతులేని నష్టం, విరాళాలకు పన్ను మినహాయింపు
విజయవాడలో అంతులేని నష్టం, విరాళాలకు పన్ను మినహాయింపు

Flood Donations: ఆగస్టు 30,31 తేదీల్లో బెజవాడను ముంచెత్తిన భారీ వర్షాలు, వరదలతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది మృతి చెందారని చెబుతున్నా ఎక్కువ ప్రాణ నష్టం విజయవాడలోనే జరిగింది. ఇంకా కొందరి అచూకీ లభించలేదని బంధువులు అల్లాడిపోతున్నారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎన్టీఆర్‌ జిల్లాలో 24 మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడులో ఒకరు మృతి చెందినట్లు పేర్కొంది. విజయవాడ బుడమేరు వరదల్లో ఇంకా వరద నీరు పూర్తిగా తగ్గలేదు. దీంతో మరిన్ని మృతదేహాలు వెలుగు చూసే అవకాశం ఉంది. వరదల కారణంగా 2 లక్షలకుపైగా రైతులు నష్టపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

వరదలతో 1,69,370 ఎకరాల్లో పంట, 18,424 ఎకరాల్లో ఉద్యాన వన పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ వరదల కారణంగా 2 లక్షల 34 వేల మంది రైతులు నష్టపోయినట్లు తెలిపింది. 60 వేల కోళ్లు, 222 పశువులు మృతి చెందినట్లు వెల్లడించింది.

వరదల వల్ల 22 విద్యుత్​ సబ్ స్టేషన్​లు దెబ్బతినగా, 3973 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని పేర్కొంది. 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయని తెలిపింది. వరదల వలన 6,44,536 మంది నష్టపోయినట్లు వివరించింది. 193 రిలీప్ క్యాంపుల్లో 42,707 మంది ఆశ్రయం పొందుతున్నారని తెలిపింది.

వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్డీఆర్​ఎఫ్​​, ఎస్డీఆర్ఎఫ్ టీంలు రంగంలో దిగాయని ఆరు హెలికాఫ్టర్లు, 228 బోట్లు పని చేస్తున్నాయని తెలిపింది. 317 గజ ఈతగాళ్లను రంగంలో దింపినట్లు పేర్కొంది. కృష్ణా నదికి 3 లక్షల 16 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోందని ప్రభుత్వం వివరించింది. బుడమేరు వరద ప్రవాహం ఇంకా కొనసాగడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది.

విరాళాల కోసం బ్యాంకు ఖాతా నెంబర్లు:

State Bank Of India:

A/C No: 38588079208

సీఎంఆర్‌ఎఫ్‌, ఎస్‌బీఐ బ్రాంచ్‌, ఏపీ సెక్రటేరియట్‌

SBI IFSC Code: SBIN0018884

Union Bank Of India:

A/C No: 110310100029039

సీఎంఆర్‌ఎఫ్‌, యూబీఐ బ్రాంచ్‌, ఏపీ సెక్రటేరియట్‌

UBI IFSC Code: UBIN0830798

వరద బాధితులకు సాయం చేసే వారికి పన్ను మినహాయింపు:

వరద బాధితులకు సాయం చేసేందుకు ప్రభుత్వానికి విరాళాలు ఇవ్వాలనుకునే వారు (CEO Smart Andhra Pradesh Foundation)కు పంపవచ్చని స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ సీఈవో కె. శివశంకర్ వెల్లడించారు. దీని ద్వారా విరాళాలు ఇస్తే (Corporate Social Responsibility) సీఎస్​ఆర్​ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయన్నారు.

చెక్కులు, డీడీలను సీఈవో, స్మార్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ ఫౌండేషన్‌ పేరుతో పంపవచ్చని వెల్లడించారు. విరాళాలు ఇచ్చే వారికి పన్ను మినహాయింపు సర్టిఫికెట్లు ఇస్తామని తెలిపారు. భారత్ బయోటెక్ సంస్థ స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్​కు కోటి విరాళం ఇవ్వటం శుభపరిణామని శివశంకర్ అభినందనలు తెలిపారు.

ఇన్సూరెన్స్ ఇప్పించేందుకు ప్రయత్నాలు…

వరదలో మునిగిన వాహనాలకు ఇన్సూరెన్స్ ఇప్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించనున్నారు. వరదల్లో భారీ ఎత్తున బైక్​లు, నాలుగు చక్రల వాహనాలు నీట మునిగాయి. వాహనాలు రిపేర్​ చేయించేందుకు ఒక్కో కుటుంబానికి వేలల్లో ఖర్చు అవుతుందని అంచనా వేసింది.

SAవరద బాధితుల భారం తగ్గించేందుకు సీఎం చొరవ తీసుకుని ఇన్సూరెన్స్ కంపెనీలతో సంప్రదింపులు జరపనున్నారు. ఇప్పటికే ఇన్సూరెన్స్ ఉన్న వాహనాలెన్ని? ఇన్సూరెన్స్ లేని వాహనాలు ఎన్ని? అనే అంశంపై ప్రభుత్వం లెక్కిస్తుంది. ఇన్సూరెన్స్ చెల్లింపుల్లో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను పక్కన పెట్టాలని ఇన్సూరెన్స్ కంపెనీలను కోరనుంది. వరద పరిస్థితి అర్థం చేసుకుని ఇన్సూరెన్స్ కంపెనీలు మానవతా ధృక్ఫధంతో ఆలోచించాలని చంద్రబాబు కోరనున్నారు.