AP Teachers Transfers 2025 : ఏప్రిల్ 10 నుంచి టీచర్ల బదిలీలు.. 5 ముఖ్యమైన అంశాలు
AP Teachers Transfers 2025 : ఏపీలో టీచర్ల బదిలీకి సంబంధించి మళ్లీ కదలిక మొదలైంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉపాధ్యాయ బదిలీలపై మంత్రి లోకేష్ ఇప్పటికే ఫోకస్ పెట్టారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 2024 అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి కొద్ది రోజుల ముందు.. దాదాపు 1800 మంది ఉపాధ్యాయులను కోరుకున్న స్థానాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఉపాధ్యాయుల బదిలీల కోసం భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం మారగానే.. ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. దీంతో బదిలీలపై ఉపాధ్యాయులు ఆశలు వదులుకున్నారు. తాజాగా.. మళ్లీ ట్రాన్స్‌ఫర్ ఇష్యూ తెరపైకి వచ్చింది. బదిలీలకు సంబంధించి 5 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
1.డిసెంబరు 5న టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. డిసెంబరులోనే ఉపాధ్యాయ సంఘాల నాయకులతో టీచర్ల బదిలీల చట్టం ముసాయిదాపై విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడుతారు.
2.గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీఓ-117 రద్దు, బదిలీల చట్టంపై ప్రతిపాదనలను ఈనెల 30న ప్రభుత్వానికి డైరెక్టరేట్ నుంచి పంపిస్తారు.
3.పదోన్నతులకు సంబంధించి మొదటి విడతగా డిసెంబరు 20 వరకు ఉపాధ్యాయుల ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేస్తారు. రెండో విడత జనవరి 20, మూడో విడత ఫిబ్రవరి 10 వరకు అవకాశం కల్పిస్తారు. ఈ టీచర్ ప్రొఫైల్స్ ఆధారంగానే సీనియారిటీ జాబితా సిద్ధమవుతుంది.
4.బదిలీల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాన్స్‌ఫర్స్ స్టార్ట్ చేస్తారు. ప్రధానోపాధ్యాయులకు ఏప్రిల్ 10 నుంచి 15 వరకు, స్కూల్ అసిస్టెంట్లకు ఏప్రిల్ 21 నుంచి 25 వరకు, ఎస్జీటీలకు మే ఒకటి నుంచి 10 వరకు బదిలీలు ఉంటాయి.
5.పదోన్నతులకు సంబంధించి సీనియారిటీ జాబితాలను.. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు ప్రదర్శిస్తారు. ఈ పదోన్నతులు, బదిలీలు పూర్తికాగానే డీఎస్సీలో ఎంపికైన వారికి మే 11 నుంచి 30 వరకు పోస్టింగ్‌లు ఇస్తారు.
గతంలో..
గతంలో ఉపాధ్యాయుల సాధారణ బదిలీలను చేపట్టకుండా.. ప్రత్యేకంగా కొందరు ఉపాధ్యాయులను మాత్రమే వారు కోరుకున్న స్థానాలకు బదిలీ చేశారు. ఈ బదిలీల వెనుక లక్షలాది రుపాయలు చేతులు మారాయని, ఈ వ్యవహారంలో మంత్రి బొత్స సత్యానారాయణతో పాటు సీఎంవోలోని అధికారులు కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు వచ్చాయి.
ఉపాధ్యాయుల బదిలీలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా.. గత ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. తాజాగా.. ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో గత మార్చిలో ఇచ్చిన ఉపాధ్యాయ బదిలీ ఉత్తర్వుల్ని.. ఉపసంహరించుకుంటున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.