AP TS Weather Update: ఆంధ్రప్రదేశ్ నిప్పుల కొలిమిలా తయారైంది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరడంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు.
గురువారం ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1°డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో 47°డిగ్రీలు, నంద్యాల జిల్లా బనగానపల్లెలో 46.7°డిగ్రీలు, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబాపురంలో 46.6°డిగ్రీలు, చిత్తూరు జిల్లా తవణంపల్లె, వైయస్సార్ జిల్లా జమ్మలమడుగులో 46.4°డిగ్రీలు నమోదయ్యాయి.
అనంతపురం జిల్లా తెరన్నపల్లి, కర్నూలు జిల్లా గూడూరు, పల్నాడు జిల్లా విజయపురిలో 45.3°డిగ్రీలు, తిరుపతి జిల్లా చియ్యవరంలో 44.8°డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా చిలకల్లులో 44.6°డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీ వ్యాప్తంగా 14 జిల్లాల్లో 43°లకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు. అలాగే 33 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 188 మండలాల్లో వడగాల్పులు వీచాయి.
శుక్రవారం ఏపీలో 28 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 156 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. శనివారం 21 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 261 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శ్రీకాకుళం 4, విజయనగరం 10, పార్వతీపురంమన్యం 14 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది.
శ్రీకాకుళంలో 10, విజయనగరం 12, పార్వతీపురంమన్యం 1, అల్లూరిసీతారామరాజు 10, అనకాపల్లి 11, కాకినాడ 7, తూర్పుగోదావరి 4, ఏలూరు 3, కృష్ణా 2, ఎన్టీఆర్ 11, గుంటూరు 9, పల్నాడు 26, బాపట్ల 3, ప్రకాశం 23, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు 13, నంద్యాల 1, అనంతపురం 1, అన్నమయ్య 2, తిరుపతి 7 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
తెలంగాణలో గురువారం భానుడు చెలరేగిపోయాడు. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లో ఎండలు మండిపోయాయి. నల్గొండ జిల్లాలో 46.6డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం ఎనిమిది నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపట్నంలో రాష్ట్రంలో అత్యధికంగా 46.6డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, నాగర్‌కర్నూల్, కరీంనగర్ జిల్లాలో 46డిగ్రీలకు పైబడిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్, గద్వాల, సిరిసిల్ల, యాదాద్రి, ఆసిఫాబాద్, ములుగు, నారాయణ పేట, మహబూబ్‌నగర్, భూపాలపల్లి, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో గురువారం 45.1 డిగ్రీల నుంచి 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎండ వేడితో పాటు వడగాలుల తీవ్రత కూడా పెరిగింది. సాధారణం కంటే 4.5డిగ్రీల నుంచి 6.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదైతే వడగాలులను నమోదు చేస్తారు. 45డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు ఉంటే వడగాలులు ఉన్నట్టు పరిగణిస్తారు. గురువారం తెలంగాణలో 19జిల్లాల్లో 80వడగాలులు నమోదయ్యాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేటలో 17 మండలాల్లో, నల్గొండలో 14మండలాల్లో తీవ్ర వడగాలులు నమోదయ్యాయి.
తెలంగాణలో మే 6తర్వాత ఎండలు కాస్త తగ్గుముఖం పట్టొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. వారాంతం వరకు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. వాతావరణ మార్పులతోనే ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వివరించారు. మే6వ తేదీ తర్వాత కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు.
మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో మామిడి కాయల కోతల్లో ఉన్న రైతు సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. మృతుడిని కుమ్మరిశాఖయ్యగా గుర్తించారు. కుమురం భీం జిల్లా బెజ్జూరు మండలం గబ్బాయికి చెందిన పోర్తెటి శ్రీనివాస్ వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్‌లో హమాలీగా పనిచేస్తున్న గజ్జెల సంజీవ్,హన్మకొండకు జిల్లా రాయపర్తిలో వ్యవసాయ కూలీ అల్లె గోవర్ధన్‌లు వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు.
ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. ఎండదెబ్బ తగలకుండా టోపీ,గొడుగు,టవల్,కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.
సంబంధిత కథనం