AP Assembly: ఆ వ్యాఖ్యలపై సీరియస్..! అసెంబ్లీ నుంచి 12 మంది TDP సభ్యుల సస్పెన్షన్‌-12 tdp mlas suspended from ap assembly budegt sessions 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Assembly: ఆ వ్యాఖ్యలపై సీరియస్..! అసెంబ్లీ నుంచి 12 మంది Tdp సభ్యుల సస్పెన్షన్‌

AP Assembly: ఆ వ్యాఖ్యలపై సీరియస్..! అసెంబ్లీ నుంచి 12 మంది TDP సభ్యుల సస్పెన్షన్‌

HT Telugu Desk HT Telugu
Mar 15, 2023 03:28 PM IST

12 TDP MLAs suspended From Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి 12 మంది టీడీపీ సభ్యులు సస్పెండ్‌ అయ్యారు. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ అసెంబ్లీ
ఏపీ అసెంబ్లీ

AP Assembly Budegt Sessions 2023: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. మంగళవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా...రెండో రోజూ కొనసాగుతున్నాయి. అయితే టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీరియస్ అయ్యారు. గవర్నర్ విషయంలో కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ... 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. మిగతా ఎమ్మెల్యేలను మాత్రం ఈ ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఏం జరిగిందంటే..?

మంగళవారం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే అంతకుముందు అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ నేరుగా ఛాంబర్ కు రావాలి.. కానీ గవర్నర్ ను స్పీకర్ చాంబర్ లో వెయిట్ చేయించారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఆహ్వానం పలకాల్సిన ముఖ్యమంత్రి జగన్ ఆలస్యంగా వచ్చిన కారణంగానే గవర్నర్ ను వెయిట్ చేయించారని కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి కోసం గవర్నర్ నిరీక్షించారని చెప్పారు. అసలు ముఖ్యమంత్రి పెద్దా? గవర్నర్ పెద్దా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో తోటి టీడీపీ సభ్యులు కూడా పయ్యావులకు మద్దతుగా నిలిచారు. టీడీపీ చేసిన ఆరోపణలపై మంత్రులు ఘాటుగా స్పందించారు. సీఎం స్వాగతం పలికిన వీడియోను సభలో ప్రదర్శించారు.

అయితే ఈ విషయంపై ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ... గవర్నర్‌కు సీఎం స్వాగతం పలకలేదని టీడీపీ తప్పుడు ప్రచారం చేయటాన్ని ఖండించారు. పయ్యావుల కేశవ్ ఆరోపణలపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. గవర్నర్‌ ప్రసంగాన్ని కొందరు హేళనగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత సభలో తీర్మానాన్ని మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు. పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని చదివి వినిపించారు. వాయిస్ ఓటుతో తీర్మానాన్ని ఆమోదించారు. వారిద్దరినీ ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్ నిర్ణయంపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... పోడియాన్ని చుట్టుముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. మరోసారి మంత్రి బుగ్గన తీర్మానం ప్రవేశపెట్టగా అసెంబ్లీ నుంచి 12 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశాలు ముగిసే వరకు నిమ్మల, పయ్యావులపై సస్పెన్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.

మరోవైపు కేశవ్‌ వ్యవహారంలో చర్చ సందర్భంగా రాష్ట్రంలో మీడియా పాత్రపై శాసనసభలో చర్చ జరగాలని మాజీ మంత్రి కన్నబాబు డిమాండ్ చేశారు. జరగని విషయాలను జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వంపై విషయం చిమ్ముతున్నారని, ఇంత వక్రీకరణ గతంలో ఎప్పుడు జరగలేదన్నారు. చట్టాలకు, చట్టబద్ద సంస్థల గౌరవానికి భంగం కలిగేలా టీడీపీ వ్యూహాత్మకంగా విష ప్రచారం చేస్తోందన్నారు. మంత్రి అంబటి కూడా పయ్యావుల అంశంపై తీవ్రంగా స్పందించారు.

Whats_app_banner

సంబంధిత కథనం