AP Assembly :సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత..బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్-andhra pradesh assebly session starts and governor says welfare is first priority for government
Telugu News  /  Andhra Pradesh  /  Andhra Pradesh Assebly Session Starts And Governor Says Welfare Is First Priority For Government
శాసన సభా సమావేశాలను ప్రారంభిస్తున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
శాసన సభా సమావేశాలను ప్రారంభిస్తున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

AP Assembly :సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత..బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్

14 March 2023, 11:03 ISTHT Telugu Desk
14 March 2023, 11:03 IST

AP Assembly Budget Session అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికే రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. సంక్షేమం, పేదరిక నిర్మూలన, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పరిపాలన సాగిస్తుందని గవర్నర్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభా సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగంతో శాసనసభా సమావేశాలను ప్రారంభించారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేశారు.

ఆర్ధికాభివృద్ధిలో ఆంధ‌్రప్రదేశ్‌ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నట్లు గవర్నర్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవంలో వివరించారు. ఏపీలో ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తున్నట్లు వివరించారు. నవరత్నాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

అవినీతికి తావులేవకుండా అర్హులందరికీ నేరుగా సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు గవర్నర్ వివరించారు. నాలుగేళ్లుగా ఏపీలో సుపరిపాలన అందించినట్లు చెప్పారు. దేశంలోనే తొలిసారి సంక్షేమ పథకాల అమలు కోసం వాలంటీర్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో కొత్తగా 17 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు గవర్నర్ వివరించారు. కూరుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీను, వైఎస్సార్ కడపలో ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు గవర్నర్ వివరించారు. అమ్మ ఒడి పథకం ద్వారా రాష్ట్రంలో 80లక్షల మంది పిల్లలకు ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. 44.49లక్షల మంది తల్లులకు రూ.19.61కోట్ల రుపాయలను నేరుగా బదిలీ చేసినట్లు చెప్పారు.

గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో శాసన సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుంది. శాసససభను ఎన్ని రోజులు నిర్వహించాలనేది బిఏసిలో నిర్ణయించనున్నారు. ఈ నెల 14 నుంచి 24 వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కనీసం 7,8 రోజుల సభా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రాథమికంగా భావిస్తున్నారు. బిఏసి సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు క్యాబినెట్ అమోద ముద్ర వేయనుంది.

ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్ రూ.2.60లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సంక్షేమంతో పాటు నగదు బదిలీ పథకాలు, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వరాలు కురిపించే అవకాశాలు లేకపోలేదు. ఎన్నికలకు ముందు చివరి పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు కావడంతో కీలక అంశాలపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.

సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ పురోగమిస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి వివరాలను గవర్నర్ సభకు వివరిస్తున్న క్రమంలో శాసనసభ్యులు ముఖ్యమంత్రికి అనుకూలంగా నినాదాలు చేశారు.

ఏపీలో సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని గవర్నర్ చెప్పారు. నవరత్నాలతో సంక్షేమపాలన అందిస్తున్నామని, అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందన్నారు.

రాష్ట్రంలో నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామని, వినూత్నంగా వాలంటీర్ వ్యవస్థ అమలు చేస్తున్నామని, అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే సంక్షేమపథకాలు అందిస్తున్నట్లు వివరించారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేస్తోందని గవర్నర్ తెలిపారు.

వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అనూహ్య ప్రగతి….

వ్యవసాయ, పారిశ్రామిక సేవారంగాలు అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు. మన బడి నాడు-నేడు ద్వారా తొలిదశలో రూ.3,669 కోట్లతో ఆధునీకీకరణ పనులు చేపట్టినట్లు చెప్పారు.

అమ్మ ఒడి ద్వారా 80 లక్షల మంది పిల్లలకు ఆర్థికసాయం అందిందని చెప్పారు. - 44.49 లక్షల మంది తల్లులకు రూ.19,617.60 కోట్లు ఆర్థిక సాయం అందించామన్నారు. విద్యాసంస్కరణలో కీలక అంశంగా డిజిటల్ లెర్నింగ్ ప్రవేశపెట్టినట్టు చెప్పారు. విద్యార్థులకు రూ.690 కోట్ల విలువైన 5.20 లక్షల ట్యాబ్‍ల పంపిణీ చేశామన్నారు.

జగనన్న విద్యాకానుక కింద ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఇంగ్లీష్ ల్యాబ్‍లు - 2020-21 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశ సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పాఠ్య పుస్తకాల రీడిజైన్ చేసినట్లు వివరించారు. జగనన్న గోరుముద్దతో 43.26 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతోందన్నారు. జగనన్న గోరుముద్ద ద్వారా ఇప్పటివరకు రూ.3,239 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.

ఆర్థికభారం లేకుండా ఉచితంగా ఉన్నతవిద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని గవర్నర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కనీసం రెండు జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేశామని, జగనన్న విద్యాదీవెన కింద ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తున్నామన్నారు. జగనన్న విద్యాదీవెన కింద 24.75 లక్షల మంది లబ్ధిదారులకు రూ.9,249 కోట్లు చెల్లించామన్నారు. జగనన్న విద్యాదీవెన కింద హాస్టల్, మెస్ ఛార్జీల కోసం రూ.20 వేలు చెల్లిస్తున్నామని చెప్పారు. ఈ పథకం కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ.3,366 కోట్లు పంపిణీ చేశామని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు.