IMD Rain Alert: తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు
15 September 2022, 18:41 IST
- తెలంగాణ వ్యాప్తంగా మరో 4 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణలో వర్షాలు
Rains in Telangana:పశ్చిమ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 18న ఉత్తర బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఆవర్తనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి ఏర్పడుతుందని వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇక హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆకాశం మోఘావృతమై ఉంటుందని... తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి దిశల నుంచి గాలులు(వేగం 08 -12 కి.మీ) వరకు వీచే అవకాశం ఉంది పేర్కొంది.
ఏపీలోనూ వర్షాలు…
Rains in Andhrapradesh: ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతవరణ కేంద్రం తెలిపింది. యానాం, సీమ జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ వంటివి జారీ చేయలేదు.
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కు వరద కొనసాగుతోంది. 16 క్రస్ట్ గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2.40 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్ఫ్లో 2.81 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 588.70 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్ధ్యం 312.0405 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 308.1702 టీఎంసీలకు చేరుకుంది.
శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం జలాశయం నుంచి ఇన్ ఫ్లో 3.20.000 క్యూ సెక్కులు, ఔట్ ఫ్లో 3.51.332 క్యూ సెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 884.60 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుత సామర్థ్యం 214.80 టీఎంసీలు గా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.