Rains in Telangana and Andhra: తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి
12 September 2022, 8:15 IST
- బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఒడిశా వైపుగా పయనిస్తోంది. సోమవారం చత్తీస్‌గడ్ వైపుకు వెళ్లి బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. అహ్మదాబాద్ నుంచి చత్తీస్‌గడ్, ఒడిశాల మీదుగా బంగాళాఖాతం వరకు గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడటంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
వాయుగుండం ప్రభావంతో ఏపీ తెలంగాణలో వర్షాలు
Rains in Telangana తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత పదేళ్లలో సెప్టెంబర్ ఎన్నడు కురవని స్థాయిలో కుంభవృష్టి కురుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. 24 గంటల వ్యవధిలో భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లిలో 35.1సెం.మీల వర్షపాత నమోదైంది. రాజన్న జిల్లా అవునూర్‌లో 20.8, మర్తనపేటలో 20.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. మెదక్, రంగారెడ్డి, నిజమాబాద్, కరీంనగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
మెదక్ జిల్లా అల్లదుర్గంలో 18.4సెం.మీ, నిజామాబాద్ నవీపేటలో 17.6 సెం.మీ, కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 12.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. తెలంగాన వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. గత పదేళ్లలో సెప్టెంబర్‌లో 24గంటల వ్యవధిలో 35.1 సెం.మీ వర్షం కురవడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ చెబుతోంది. 2019 సెప్టెంబర్ 18న నల్గొండలో 21.8 సెం.మీల వర్షపాతం కురిసింది. వాయుగుండం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అప్పటికప్పుడు కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమై కుంభవృష్టి కురుస్తున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
కుంభవృష్టితో తెలంగాణ జిల్లాలు అతలాకుతలం....
Rains in Telangana తెలంగాణలో వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో కొత్త రికార్డులు ఏర్పడ్డాయి. 1908 నుంచి ఇప్పటి వరకు 24 గంటల వ్యవధిలో అత్యధిక వర్షం ఖమ్మం జిల్లా కోహెడలో నమోదైంది. 1996 జూన్ 17న 67.5 సెంటిమీటర్ల వర్షపాతం, 1983 అక్టోబర్ 6న నిజామాబాద్‌లో 35.5సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆళ్ళపల్లిలో ఆదివారం 35.1 సెం.మీల వర్షపాతం నమోదైంది.
కొట్టుకుపోయిన కారు… ఇద్దరు మృతి
భారీ వర్షాలకు వాగులో కారు మునిగి ఇద్దరు మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పాజుల్ నగర్ శివారులో వాగు ప్రవాహానికి ఆదివారం తెల్లవారుజామున కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో చిక్కుకుపోయిన మహిళతో పాటు రెండేళ్ల చిన్నారి మృతి చెందారు. జగిత్యాల జిల్లా చల్‌గల్ గ్రామానికి చెందిన గంగు, మనుమడు కిట్టు చనిపోయారు. ఉధృతంగా ప్రవహిస్తోన్న వాగును దాటించేందుకు డ్రైవర్ ప్రయత్నించడంతో కారు వాగులో కొట్టుకుపోయింది.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ, 9 లక్షల క్యూసెక్కులను దాటుతున్న పరిస్థితుల నేపథ్యంలో., కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయాలని, అధికారులను సన్నద్ధంగాఉంచాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. తక్షణమే సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని, సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Rains in Andhra వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వాయుగుండం ప్రభావంతో రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.