Rain Alert: మరో 2 రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ
08 September 2022, 9:02 IST
- IMD Weather Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీ తెలంగాణకు వర్ష సూచన,
Rains to continue in ap and telangana: దక్షిణాది రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని... అల్పపీనడం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు మహారాష్ట్రలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హెచ్చరికలు జారీ..
Rains in Telugu States: గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మోసర్తు వర్షాలు కురుస్తుండగా...మరో రెండు మూడు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. వీటిలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయి. ఇక నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబ్ నగర్, జనగాం, సిద్ధిపేట, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్ లో భారీ వర్షం..
heavy rain in hyderabad: బుధవారం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భాగ్యనగరంలోని జూబ్లీబిల్స్, బంజారాహిల్స్, మెహిదీపట్నం, గోషామహల్, మంగళ్‌హాట్, ఆసిఫ్‌నగర్, జియాగూడ పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, ప్యాట్నీసెంటర్, బేగంపేట, అల్వాల్, చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, ఉప్పల్ తోపాటు పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఈ కారణంగా రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.