Warangal Politics : ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ వైపు చూపులు..? క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
18 January 2024, 21:09 IST
- Warangal MP Ticket 2024 : పార్లమెంట్ ఎన్నికల వేళ వరంగల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కీలక నేతలు పార్టీ మారుతారనే చర్చ జోరందుకుంది. ఎంపీ టికెట్ దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి కీలక ప్రకటన చేశారు.
మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
Warangal MP Ticket 2024 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొన్నిచోట్లా అనూహ్య విజయాలను అందుకోగా.. ఆ పార్టీ అభ్యర్థుల చేతుల్లో ఓటమి పాలైన కొందరు బీఆర్ఎస్ నేతలు అంతర్మథనంలో పడ్డారు. ఓటమిని తట్టుకోలేక ఎలాగైనా పవర్ లో ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఉన్న పార్టీ నుంచి టికెట్ రాకపోతే కండువా మార్చైనా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ వ్యవహారం టాపిక్ గా మారింది. ఓటమే ఉండదనుకున్న ఆయన కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూడగా.. ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఆశావహులు చాలామందే ఉండటంతో అరూరి రమేశ్ కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. గతం వారం రోజులుగా ఈ ప్రచారం జోరందుకోవడంతో చివరకు అరూరి రమేశ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చారు. తాను ఎప్పుడూ కేసీఆర్ వెంటే ఉంటానని, తనను రాజకీయంగా ఎదుర్కోలేని కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి.. లోక్ సభ వైపు
అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అరూరి రమేశ్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 86,349 మెజారిటీ, 2018 ఎన్నికల్లో ఏకంగా 99,240 ఓట్ల తేడాతో విజయం సాధించిన ఆయన ఈసారి లక్ష మెజారిటీ టార్గెట్ పెట్టుకుని మరీ బరిలో నిలిచారు. కానీ జనాలు మాత్రం భిన్నమైన తీర్పు ఇవ్వగా.. అరూరి రమేశ్ 19,458 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు తన క్యాడర్ కు ఇప్పటి నుంచే సంకేతాలు ఇచ్చి సందర్భాన్ని బట్టి సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న కార్యకర్తలు, ఇతర నేతలకు చెప్పి, టికెట్ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం
వరంగల్ లోక్ సభ స్థానం ఎస్సీ రిజర్వ్ కాగా.. సిట్టింగ్ ఎంపీగా పసునూరి దయాకర్ ఉన్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు విజయం సాధించిన ఆయన మూడో సారి తనకే టికెట్ కేటాయించాలని బీఆర్ఎస్ అధిష్ఠానాన్ని కోరుతున్నారు. ఇదిలాఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన అరూరి రమేశ్ ఈసారి వరంగల్ ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని బీఆర్ఎస్ పెద్దలను కోరినట్లు తెలిసింది. వీరిద్దరితో పాటు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టికెట్ ఆశించి భంగపడ్డ స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కూడా బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల బరిలో నిలవాలనే ఆసక్తి ఉన్నట్లు సమాచారం. అంతేగాకుండా మరికొందరు ఉద్యమకారులు, సీనియర్ అధికారులు కూడా ఎంపీ టికెట్ కోసం బారులు తీరుతుండటంతో బీఆర్ఎస్ అభ్యర్థిత్వానికి కూడా కాంపిటీషన్ ఏర్పడింది. ఇప్పటికే తన ప్రయత్నాల్లో తాను ఉన్న అరూరి రమేశ్.. ఒకవేళ టికెట్ దక్కని పరిస్థితులు ఉంటే మాత్రం కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. రెండు పార్టీల పెద్దలతో టచ్ లో ఉంటూ ఎటు అనుకూలమైతే అటువైపు నుంచి పోటీలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అదంతా తప్పుడు ప్రచారమంటున్న అరూరి
కొద్దిరోజులుగా తాను పార్టీ మారుతున్నట్టు ప్రచారం జరుగుతుండటంతో ఎట్టకేలకు అరూరి రమేశ్ క్లారిటీ ఇచ్చారు. పార్టీలు మారే చరిత్ర తనదికాదని, అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఆయన చెప్పారు. గురువారం హనుమకొండ ప్రశాంత్ నగర్ లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి తాను వేరే పార్టీలో చేరబోతున్నట్టుగా జరుగుతున్న ప్రచారాలను ఖండించారు. ఈ సందర్భంగా అరూరి రమేశ్ మాట్లాడుతూ 2012 లో బీఆర్ఎస్ పార్టీలో చేరానన్నారు. తన పని తీరును గుర్తించి బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా, మూడుసార్లు వర్ధన్నపేట అసెంబ్లీ టికెట్ కేటాయించడంతో పాటు పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చాడన్నారు. రాజకీయంగా తనను ఎదురుకోలేని కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ కోసమే అనుక్షణం సైనికుడిలా పని చేస్తానని, వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అధిష్టానం ఎవరిని నిలబెట్టినా గెలిపించుకునేందుకు కృషి చేస్తానన్నారు. అరూరి ఎప్పుడూ కేసీఆర్ మనిషేనని, కార్యకర్తలు వదంతులను నమ్మి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నాగేశ్వరరావు, సునీల్, రజిత శ్రీను, పీఏసీఎస్ చైర్మన్లు వనం రెడ్డి, హరి కృష్ణ, పార్టీ హసన్ పర్తి మండల అధ్యక్షుడు రజినికుమార్ తదితరులు పాల్గొన్నారు.