BRS Nalgonda MP Seat 2024 : ఎంపీ టికెట్ పై ఆశలు..! బీఆర్ఎస్ నేతల లిస్ట్ పెద్దదే!
Lok Sabha Election 2024: నల్గొండ ఎంపీ టికెట్ ను దక్కించునేందుకు బీఆర్ఎస్ నేతలు గురి పెట్టారు. ఇప్పటివరకు ఓ యువనేత పేరు మాత్రమే తెరపైకి రాగా… తాజాగా చాలా మంది నాయకుల పేర్లు రేసులోకి వచ్చాయి. దీంతో టికెట్ ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
Lok Sabha Election 2024 : నల్గొండ లోక్ సభా స్థానికి బీఆర్ఎస్ లో డిమాండ్ పెరుగుతోంది. గత శాసన సభ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడిన వారు, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారు ఇపుడు నల్గొండ ఎంపీ అభ్యర్థులుగా అవకాశం కోసం అధినాయకత్వాన్ని కోరుతున్నారు. గత రెండు 2014, 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఈ సీటును దక్కించుక లేకపోయింది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన వేమిరెడ్డి నర్సింహారెడ్డి ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఈ సారి జరగనున్న ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఎంపీని గెలిపించుకోవాలన్న వ్యూహంలో బీఆర్ఎస్ ఉంది. ఈ మేరకు మాజీ ఎంపీ, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డికి టికెట్ పై హామీ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. కానీ, తామూ పోటీలో ఉంటామని, తమకే టికెట్ కేటాయించాలని మరికొందరు నాయకులు సైతం అధిష్టానికి విన్నవించారని సమాచారం. ఈ నెల 16వ తేదీన నల్గొండ లోక్ సభ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరగాల్సి ఉన్న నేపథ్యంలో తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.
గుత్తా అమిత్ కు చెక్ పెట్టేందుకేనా..?
గత శాసన సభ ఎన్నికల సమయంలోనే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి పోటీకి ఉత్సాహపడ్డారు. టికెట్ ఇస్తే మునుగోడు అసెంబ్లీ నియోజవకర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. ఈ మేరకు అధినాయకత్వం వద్ద ప్రయత్నాలు కూడా చేశారు. ఈలోగా ప్రజల్లోకి వెళ్లేందుకు గడిచిన మూడేళ్లకు పైగా గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరపున వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా సమయంలో అదే మాదిరిగా, వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల స్వావలంభన కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జిల్లాలో అందరు సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంతో ఎక్కడా అవకాశం దక్కలేదు. ముందు నుంచీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభావంలో ఉండే ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం దేవరకొండలో ఈ సారి గుత్తా అమిత్ రెడ్డి బాధ్యతలు భుజాన వేసుకుని అభ్యర్థి రవీంద్రకుమార్ విజయం కోసం పనిచేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ను కూడా తన తండ్రి సుఖేందర్ రెడ్డితో కలిసి ఎర్రవల్లి వ్యవసాయం క్షేత్రంలో కలిసి వచ్చారు. ఆ సందర్భంలోనే నల్గొండ ఎంపీ టికెట్ వ్యవహారంపై జరిగిన చర్చలో హామీ లభించిందని చెబుతున్నారు. కానీ, ఈలోగా మరకొందరు నాయకులు సైతం నల్గొండ ఎంపీ టికెట్ తమకు కావాలని అధిష్టానం వద్ద ప్రతిపాదనలు పెడుతున్నారని, ఇదంతా అమిత్ కు టికెట్ రాకుండా చెక్ పెట్టేందుకేనా అన్న చర్చ జరుగుతోంది.
పలువురి ప్రచారంలో పలువురి పేర్లు
నల్గొండ లోక్ సభా నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎంపీగా వ్యవహించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మంచి పరిచయాలే ఉన్నాయి. గతంలో టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి సుఖేందర్ రెడ్డి ఎంపీగా విజయాలు సాధించి ఉన్నారు. ఈకారణంగానే పార్టీలకతీతంగా అన్ని పార్టీల్లో ఉన్న పరిచయాలు అమిత్ కు ఉపయోపడతాయన్న అంచనా కూడా ఉంది. కానీ, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వారిలో కొందరు నల్గొండ పార్లమెంటు సీటు నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. గతంలోనే నల్గొండ ఎంపీ టికెట్ కోసం, మనుగోడు ఉప ఎన్నికల సమయంలో ఆ టికెట్ కోసం ప్రయత్నాలు చేసిన కంచర్ల క్రిష్ణారెడ్డికి ఆలోచన ఉందంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో నల్గొండ నుంచి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. మరో వైపు పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు డాక్టర్ చెరుకు సుధార్ పేరు కూడా వినిపిస్తోంది. సామాజిక సమీకరణాలను విశ్లేషించుకుంటున్న ఆ పార్టీ నాయకత్వం చెరుకు సుధాకర్ పేరును కూడా పరిశీలిస్తోందన్న సమాచారం పార్టీ వర్గాల నుంచి అందుతోంది. మొత్తంగా గుత్తా అమిత్ రెడ్డి పేరు మాత్రమే కాకుండా మరో మూడు పేర్లు తెరపైకి రావడం, త్వరలోనే నియోజకవర్గ సమీక్ష సమావేశం జరగనుండడంతో టికెట్ ఎవరికి దక్కుతుందన్న అంశంలో కొంత స్పష్టత అయితే వచ్చే వీలుందన్న అభిప్రాయాన్ని గులాబీ నాయకలు వ్యక్తం చేస్తున్నారు.
( రిపోర్టింగ్ క్రాంతీపద్మ, నల్గొండ )