Maoist Letter on Medaram Jatara : మేడారం జాతరపై మావోయిస్టుల లేఖ, సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని మండిపాటు
06 February 2024, 17:16 IST
- Maoist Letter on Medaram Jatara : తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేదని ఆరోపిస్తూ మవోయిస్టులు లేఖ రాశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని మావోయిస్టులు అసహనం వ్యక్తం చేశారు.
మేడారం జాతరపై మావోయిస్టుల లేఖ
Maoist Letter on Medaram Jatara : మరో రెండు వారాల్లో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం మహాజాతర ప్రారంభం కానుండగా.. మంగళవారం మావోయిస్టులు విడుదల చేసిన లేఖ కలకలం రేపింది. ఓ వైపు అధికార యంత్రాంగం అంతా ఏటూరునాగారం అడవుల్లో నిరంతరం జాతర పనులను పర్యవేక్షిస్తున్న సమయంలోనే మావోయిస్టుల లేఖ విడుదల కావడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మావోయిస్టు పార్టీ జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరున లేఖ విడుదల కాగా.. అందులో ప్రధానంగా మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
ఆదాయం వస్తున్నా నిర్లక్ష్యం
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఆదివాసీతో పాటు అన్ని వర్గాల ప్రజలు వచ్చి ఆరాధ్య దైవంగా కొలుస్తారని మావోయిస్టు పార్టీ జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ లేఖలో పేర్కొన్నారు. ఆదివాసి ప్రజలపై కాకతీయ రాజులు అధిక పన్నులు విధించి వాటిని చెల్లించాలని ఒత్తిడి చేశారని, ఆ పన్నులు చెల్లించలేమని సమ్మక్క–సారలమ్మలు ఆ రాజుకు వ్యతిరేకంగా పోరాడుతూ అసువులుబాసారన్నారు. అప్పటి నుంచి ఆదివాసీ ప్రజలంతా సమ్మక్క–సారలమ్మలను ఆరాధ్య దైవంగా పూజిస్తున్నారన్నారు. వారి పోరాటాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆదివాసీ ఆచార సంప్రదాయాలతో సమ్మక్క–సారలమ్మను స్మరించుకుంటున్నారని పేర్కొన్నారు. ఆదివాసీల్లో ఉన్న ఈ సెంటిమెంటును ఆసరాగా చేసుకొని ప్రభుత్వం వ్యవస్థనంతా తన చేతుల్లోకి తీసుకుని ఆదివాసుల పాత్రను నామమాత్రం చేసిందని ఆరోపించారు. మేడారం జాతరకు నాలుగు రాష్ట్రాల నుంచి కోటికిపైగా భక్తులు వస్తుంటారని, వారి ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయన్నారు. అయినా ఆ నిధులను ఆదివాసీ ప్రాంతంలోనే ఖర్చు చేసి అభివృద్ధి చేయకుండా ప్రభుత్వం నిధులను దారి మళ్లిస్తోందన్నారు. స్థానిక ఆదివాసీలను నిర్లక్ష్యం చేస్తుండటంతో వారు మరింత పేదలుగా మిగిలిపోతున్నారన్నారు.
ఎక్కడి పనులు అక్కడే..
మేడారం జాతరకు వచ్చే భక్తులకు ప్రభుత్వం ముందు దృష్టితో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, కాని ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని మావోయిస్టు నేత వెంకటేశ్ అసహనం వ్యక్తం చేశారు. సమయం దగ్గర పడుతున్న క్రమంలో ప్రభుత్వం జాతర పనులను కాంట్రాక్టర్లకు ఇచ్చిందని, వాళ్ల నిర్లక్ష్య వైఖరితో పనులను నత్తనడకన నడిపిస్తూ నాసిరకం పనులను చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ తెగిపోయాయని, వాటిని ఇప్పటివరకు నిర్మించలేదన్నారు. ఇప్పుడు ఆదరాబాదరాగా నిర్లక్ష్యంగా రోడ్లు పోయడంతో గుంతలు అలాగే మిగిలిపోయి రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతరకు వస్తున్న ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించకపోవడం, పారిశుద్ధ్య పనులు, మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో పాటు ఏపని పూర్తి కాకపోవడం వల్ల జాతరకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ వారికి సౌకర్యాలు కల్పించకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారన్నారు. కాబట్టి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి పనులను వేగవంతం చేయాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మావోయిస్టుల ప్రధాన డిమాండ్లు
- మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాలతోనే నిర్వహించాలి.
- హిందూ సంప్రదాయాలైన లడ్డూ, పులిహోర లాంటివి కాకుండా బెల్లం ప్రసాదంగా ఇవ్వాలి.
- జాతర పూర్తైన వెంటనే ఆ ప్రాంతంలో ప్రభుత్వం బాధ్యత వహించి సమగ్రంగా నిధులు కేటాయించడంతో పాటు ఇక్కడి ప్రజలకు జబ్బులు రాకుండా శుభ్రం చేయాలి. జబ్బుపడిన వారికి తగిన చికిత్సను అందించాలి.
- జాతర పనుల కోసం విడిచిపెట్టిన పంట పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలి. పంట పొలాల్లో మద్యం సీసాలతో పాటు పోగుపడిన వ్యర్థ పదార్థాలన్నింటినీ తీసి వేసే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)