తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tourist Places On Medaram Route: మేడారం మార్గంలో.. చూడాల్సిన విశేషాలెన్నో.. ఒకే టూర్‌లో చుట్టేయొచ్చు..!

Tourist places on Medaram route: మేడారం మార్గంలో.. చూడాల్సిన విశేషాలెన్నో.. ఒకే టూర్‌లో చుట్టేయొచ్చు..!

HT Telugu Desk HT Telugu

06 February 2024, 12:57 IST

google News
    • Tourist places on Medaram route: తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర మరో 15 రోజుల్లో ప్రారంభం కాబోతోంది. జాతరలో పాల్గొనే వారు తప్పకుండా చూడదగ్గ ప్రదేశాలు వరంగల్‌ జిల్లాలో ఎన్నో ఉన్నాయి. 
వరంగల్‌లో పర్యాటకులను ఆకర్షించే రామప్ప గుడి
వరంగల్‌లో పర్యాటకులను ఆకర్షించే రామప్ప గుడి

వరంగల్‌లో పర్యాటకులను ఆకర్షించే రామప్ప గుడి

Tourist places on Medaram route: తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర మరో 15 రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఉమ్మడి వరంగల్ లోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ మహాజాతర జరగనుండగా.. ఇప్పటినుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి మొక్కులు పెడుతున్నారు.

సెలవు దినాల్లో కుటుంబ సమేతంగా మేడారం వస్తున్న జనాల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. స్నేహితులతో కలిసి మొక్కులు అప్పజెప్తున్న గ్యాంగుల సందడి కూడా ఎక్కువగానే కనిపిస్తోంది.

సెలవు దినాల్లో ఓ రెండు రోజులు సరదాగా గడపాలనుకునేవారికి మేడారం మార్గంలో ఉన్న హిస్టారికల్, టూరిస్ట్ ప్లేసులు, ప్రముఖ దేవస్థానాలు స్వాగతం పలుకుతున్నాయి.

మేడారం వెళ్లే భక్తులు పనిలోపనిగా ఆ విశేషాలనూ కుటుంబ సభ్యులకు చూపిస్తే.. ఈసారి జాతర టూర్ మరింత మెమొరబుల్ గా మారే అవకాశం ఉంటుంది. మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మేడారం మార్గంలో చూడాల్సిన చారిత్రక, పర్యాటక ప్రదేశాలు, దర్శించుకోవాల్సిన దేవస్థానాలు, ఇతర విశేషాలు ఏమేం ఉన్నాయో తెలుసుకుందాం.

ఐనవోలు మల్లికార్జున ఆలయం

కాకతీయ కళావైభవానికి ప్రతీక వేయి స్తంభాల గుడి..

వరంగల్ మీదుగా మేడారం వెళ్లే భక్తులకు హనుమకొండ సిటీలోనే చారిత్రక ప్రదేశాలు తారసపడతాయి. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే జనాలు హనుమకొండ సిటీలోకి ఎంటర్ అయిన తరువాత ములుగు రోడ్డు వైపు వెళ్లే మార్గంలోనే వేయి స్తంభాల గుడి ఉంది.

కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. వేయి స్తంభాలతో నిర్మించిన ఇక్కడి శిల్పకళా నైపుణ్యం అందరినీ అబ్బుర పరుస్తుంటుంది. హనుమకొండ బస్టాండ్ నుంచి 2.3 కిలోమీటర్ల దూరంలోనే మెయిన్ రోడ్డుకు కుడి వైపు ఉండే ఈ ఆలయంలోకి వెళ్తే నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తుంటాడు.

ఇక్కడ ఆంజనేయస్వామి, నాగ ప్రతిమలు కూడా ఉంటాయి. ముఖ్యంగా కాకతీయ రాజులు రహస్య సైనిక కార్యకలాపాలు సాగించడానికి ఇక్కడి నుంచి ఓరుగల్లు కోటతో పాటు ఇతర ప్రదేశాలకు వెళ్లేందుకు ఉపయోగించిన రహస్య సొరంగ మార్గం కూడా ఉంటుంది.

భద్రతా కారణాల వల్ల ఈ సొరంగ ద్వార మార్గాన్ని అధికారులు మూసివేశారు. ఆలయానికి ఈశాన్యంలో కోనేరు, ఎదురుగా నల్లరాతి శిలతో చెక్కిన నందీశ్వరుడు, అద్బుత కళానైపుణ్యానికి సాక్షంగా నిలిచే కల్యాణ మండపం ఉంటాయి. కాకతీయులు నిర్మించిన కల్యాణ మండపాన్ని పునరుద్ధరించే పనులు చేపట్టగా.. అవి ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి.

మొత్తంగా ఆలయ ఆవరణలో అడుగు పెడితే కాకతీయుల కాలంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుందని అందరూ అంటుంటారు. ఈ ఆలయం వరంగల్ బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి 5.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఆలయాల్లో కళ్లు చెదిరే శిల్ప సంపద

చాళుక్యుల నిర్మాణం.. ఐలోని మల్లన్న ఆలయం

ఖమ్మం వైపు నుంచి వరంగల్ వచ్చే మార్గంలో ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం ఉంది. వరంగల్ కు ఎంటర్ అయ్యే మామునూరు నుంచి ఒక ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్తే చాళుక్యుల నిర్మాణ వైభవం ఉట్టిపడే ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం కనిపిస్తుంది.

సువిశాల రాతి ప్రాంగణంలో అష్టభుజాకృతిలో 108 స్తంభాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ గర్భాలయం చుట్టూ అంతర్గత ప్రదక్షిణా మార్గం చాళుక్యుల కళానైపుణ్యానికి అద్దం పడుతుంది. ఇటువంటి నిర్మాణం చాళుక్యుల కాలానికే చెందిన వరంగల్ భద్రకాళి దేవాలయంలో కూడా కనిపిస్తుంది. ఈ ఆలయానికి చుట్టూరా కాకతీయ కళాతోరణాలున్నాయి.

ఈ ఆలయంలో అడుగుపెడితే కాకతీయుల కాలంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ గుడి వరంగల్ నుంచి దాదాపు 16 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. నిత్యం బస్సులు, ఆటోల సౌకర్యం కూడా ఉంటుంది.

చరిత్రకు అద్దంపట్టే ఓరుగల్లు కోట

వరంగల్ నగరంలో ప్రముఖంగా చెప్పుకోదగిన చారిత్రక ప్రదేశం ఓరుగల్లు కోట. కాకతీయ రాజులు 13వ శతాబ్ధంలో తమ రాజధానిని హనుమకొండ నుంచి వరంగల్ కు మార్చిన సమయంలో ఈ కోటను నిర్మించారు. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు ఈ కోట నిర్మాణాన్ని ప్రారంభించగా ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి పూర్తి చేసినట్లు చరిత్రకారులు చెబుతుంటారు.

ఇక్కడ స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఉండగా.. కాకతీయులు ఇక్కడ పూజలు చేసేవారని ప్రతీతి. ఈ కోటలో అడుగుపెట్టగానే కాకతీయ కళా సంపద అందరినీ అబ్బురపరుస్తుంది. ఈ ప్రాంతమంతా కాకతీయుల చారిత్రక కట్టడాలు, అద్భత శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడతాయి. ఈ కోటకు మూడు ప్రాకారాలు ఉన్నాయి. ఇక్కడి మట్టి కోట, రాతికోటలు కొంతమేర శిథిలం కాగా.. ఇప్పటికీ చూపరులను ఆకట్టుకుంటాయి.

ఈ కోటలపై ఉండే బురుజుల్లో ఒకప్పుడు సైనికులు సేద తీరేవారు. శత్రు సేనలు కోటలోపలికి ఎంటర్ కాకుండా సైన్యం నిత్యం ఇక్కడి రాత్రి, మట్టి కోట నుంచి నిఘా పెట్టేవారు. వీటితో పాటు కోటలోని కాకతీయ కళాతోరణాలు, శృంగారపు బావి, ఖుష్ మహాల్, ప్రధాన ద్వారాలు, ఖిలా వరంగల్ పార్కు టూరిస్టులను అమితంగా ఆకట్టుకుంటాయి. వరంగల్ బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి వరంగల్ కోటా 2.2 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. అదే హనుమకొండ బస్టాండ్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కాళేశ్వరం ఆలయం

ఓరుగల్లు ఇంద్రకీలాద్రి.. భద్రకాళి దేవస్థానం

ఓరుగల్లు భద్రకాళి దేవస్థానాన్ని తెలంగాణ ఇంద్రకీలాద్రిగా కూడా అభివర్ణిస్తుంటారు. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ ఆలయం హనుమకొండ, వరంగల్ నగరాల మధ్యలో ఉంటుంది.

వరంగల్ బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి 4.5 కిలోమీటర్లు, హనుమకొండ బస్టాండ్ నుంచి 4.4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయ గోడలపై ఉన్న శాసనాల ప్రకారం ఆంధ్రదేశంలోని వేంగి ప్రాంతంపై సాధించిన విజయానికి గుర్తుగా చాళుక్య రాజ్యవంశానికి చెందిన పులకేసి రాజు క్రీ.శ.625లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ తరువాత కాలంలో కాకతీయులు భద్రకాళి అమ్మవారిని తమ కులదేవతగా కొలిచారు.

ఈ ఆలయానికి దక్షిణ భాగంలో ఒక గుహ ఉంటుంది. అందులో ఎందరో మహర్షులు తపస్సు చేసేవారని చరిత్రకారులు చెబుతుంటారు. భద్రకాళి గుడిని ఆనుకునే పేద్ద చెరువు కూడా ఉంటుంది. ఆలయానికి అవతలి వైపు ఉన్న చెరువు కట్టను భద్రకాళి బండ్ గా డెవలప్ చేశారు. ఇవతలి వైపున్న కట్టను కూడా టూరిస్టులను ఆకర్షించేలా అందంగా తీర్చిదిద్దారు. ఇక్కడికి వెళ్తే ఆధ్యాత్మిక సుగంధాలు వెదజల్లుతుంటాయి.

పర్యాటకులను ఆకట్టుకునే రామప్ప గుడి

వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్ప గుడి

వరంగల్ నుంచి మేడారం వెళ్లే మార్గంలో మరో చారిత్రక ఆలయం ఉంది. వరంగల్ నుంచి మేడారం 100 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. కాగా వరంగల్ నుంచి మేడారం వెళ్లే మార్గంలో జాకారం, ములుగు, జంగాలపల్లి క్రాస్ మీదుగా 60 కిలోమీటర్లు వెళ్తే పాలంపేటకు, అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే రామప్ప చేరుకోవచ్చు. (జంగాలపల్లి నుంచి రామప్ప వైపు టర్న్ కాకుండా స్ట్రెయిట్ గా వెళ్తే మేడారం వెళ్లిపోవచ్చు).

వరంగల్ నుంచి రామప్ప దాదాపు 71 కిలోమీటర్లు ఉంటుంది. మరో మార్గంలో వరంగల్ నుంచి పరకాల, గణపురం నుంచి టర్న్ అయి కూడా రామప్పకు చేరుకోవచ్చు. ఈ రూట్ కూడా దాదాపు 70 కిలోమీటర్లు ఉంటుంది. కాగా వరంగల్ హెరిటేజ్ సైట్ లో స్థానం సంపాదించుకున్న రామప్పలో కాకతీయుల కళా నైపుణ్యం ఉట్టిపడుతుంది.

నీటిలో తేలియాడే ఇటుకలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ ఆలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ గుడిని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు. ఈ శివాలయాన్ని దైవంపేరుతో కాకుండా ఆలయ ప్రధాన శిల్పి ‘రామప్ప’ పేరుతో పిలుస్తుండటం విశేషం.

లక్నవరం కేబుల్ బ్రిడ్జి

కేరళను తలపించే లక్నవరం చెరువు

మేడారంలో వెళ్లే మార్గంలో ములుగు జిల్లాలో ఉన్న లక్నవరం సరస్సు వరంగల్ సిటీ నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ములుగు గోవిందరావు పేట మండలం లోని బుస్సాపూర్ మీదుగా లక్నవరం చేరుకోవచ్చు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఈ చెరువును తవ్వించినట్లు చరిత్ర చెబుతోంది. చుట్టూ గుట్టల నడుమ ఉండే ఈ చెరువు ద్వీపాన్ని తలపిస్తుంది.

ఇక్కడ రెండు వైపులా ఏర్పాటు చేసిన వేలాడే వంతెనలు కేరళ వాతావరణాన్ని తలపిస్తాయి. చుట్టూ కొండలు, చెట్లు, వంతెన కింద నీళ్లు.. కోనసీమ, అరకు, కేరళ అనుభూతిని కలిగిస్తాయి. అంతేగాకుండా సరస్సులో బోటు షికారు, స్పీడ్ బోట్ తోపాటు సైక్లింగ్ బోటుతో పర్యాటకులు ఎంజాయ్ చేసే అవకాశం కూడా ఉంది.

ఎంతటి ప్రయాణ భారాన్నైనా ఇక్కడి వాతావరణం ఇట్టే మాయం చేస్తుంది. చుట్టూ ఉన్న కొండకోనలు, చెట్లు, నీళ్లు, హరిత రిసార్ట్స్, ఇతర సదుపాయాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి.

కాళేశ్వరం త్రివేణి సంగమం

కాళేశ్వర త్రివేణి సంగమం

వరంగల్ నుంచి భూపాలపల్లి మీదుగా కమలాపూర్ క్రాస్ నుంచి లేదా కాటారం నుంచి కూడా మేడారం వెళ్లొచ్చు. వరంగల్ వైపు నుంచి వెళ్లేవాళ్లయినా.. మేడారం దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలోనైనా భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వెళ్తే అక్కడ మూడు నదులు కలిసే త్రివేణి సంగమాన్ని చూడొచ్చు.

ఇక్కడ గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణిగా సరస్వతి నది కలవడం వల్ల ఇక్కడ త్రివేణి సంగమం ఏర్పడింది. ఇక కాళేశ్వరంలో కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం ఉంటుంది. శివుడే ముక్తీశ్వరస్వామి రూపంలో పూజలందుకుంటుంటాడు. ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన అన్నారం బ్యారేజీ కూడా ఉంది. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోనే కన్నెపల్లి పంపుహౌజ్ కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే.

రెండేళ్ల కిందట వచ్చిన వరదలకు ప్రాజెక్టు దెబ్బతినగా.. తరచూ అక్కడ నిర్మాణ లోపాలు బయటపడుతున్నాయి. ప్రాజెక్టు గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఉన్నవారు అక్కడికి వెళ్తే ఉపయోగం.

హేమాచల నృసింహ స్వామి ఆలయం

రెండో యాదాద్రి.. హేమాచల నృసింహస్వామి దేవస్థానం

తెలంగాణ రెండో యాదాద్రిగా పిలుచుకునే లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ములుగు జిల్లాలోనే ఉంది. ములుగు జిల్లా బూర్గంపాడు, ఏటూరునాగారం దారిలో మంగపేట మండలం మల్లూరు నుంచి కొండపైకి దాదాపు 4 కిలోమీటర్ల వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మల్లూరు గుట్టలపైన శ్రీహేమాచల లక్ష్మీనరసింహస్వామి వెలిశారు.

మరో విశేషమేంటంటే ఇక్కడ గుట్టపై నుంచి చింతామణి అనే జలధార కాలంతో సంబంధం లేకుండా నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. గుట్టలపైనుంచి జాలువారే ఈ నీళ్లు సర్వ రోగ నివారిణిగా ఉపయోగపడతాయని భక్తుల విశ్వాసం. ఈ దేవస్థానం ములుగు నుంచి 82 కిలోమీటర్లు, ఏటూరునాగారం నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

బోగత జలపాతం

తెలంగాణ నయాగార.. బోగత జలపాతం

తెలంగాణ నయాగారాగా పిలుచుకునే బోగత జలపాతం ములుగు జిల్లా వాజేడు మండలంలో చీకుపల్లిలో ఉంది. ఇది కాళేశ్వరం–భద్రాచలం అడవుల మధ్యలో ఉండగా.. 30 అడుగుల ఎత్తునుంచి ఇక్కడ వాటర్ ఫాల్స్ దుంకుతుంటాయి. ఇది వరంగల్ నుంచి 130 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది.

మేడారం సమయంలో వెళ్లేకంటే వర్షాకాలంలో వెళ్తే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ములుగు జిల్లాలోనే మరో వాటర్స్ ఫాల్స్ కూడా ఉంది. ఏటూరునాగారం దాటిన తరువాత వెంకటాపురం మండలంలో దాదాపు ఆరేడు కిలోమీటర్లు అడవిలో ప్రయాణిస్తే ముత్యంధార జలపాతం ఉంటుంది.

పైభాగంలో ఉన్న రాక్ స్ట్రక్షర్ వల్ల ఇక్కడ పడే నీటి బింధువులు ముత్యాల్లా మెరుస్తుంటాయి. అందుకే దీనిని ముత్యంధార, ముత్యాలధార జలపాతం అంటుంటారు. ఇక్కడికీ కూడా జూన్ నుంచి నవంబర్ మధ్యలో వెళ్తే బెటర్.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం