Warangal ATM Robbery : ఏటీఎమ్ సెంటర్లలో లవర్స్ చోరీలు-ప్లాస్టిక్ పట్టీలు,స్క్రూడ్రైవర్, ఫెవిక్విక్ తో కస్టమర్లకు బురిడీ
23 July 2024, 21:28 IST
- Warangal ATM Robbery : ఉపాధి కోసం వరంగల్ కు వచ్చిన యూపీ వాసులు కొందరు ఏటీఎం చోరీలను ఎంచుకున్నారు. చిన్న టెక్నిక్ తో నగదు విత్ డ్రా చేసినప్పుడు ఏటీఎమ్ నుంచి డబ్బు రాకుండా చేసి... ఆ తర్వాత తెలివిగా డబ్బు కొట్టేసేవాళ్లు.
ఏటీఎమ్ సెంటర్లలో లవర్స్ చోరీలు-ముగ్గురి అరెస్ట్
Warangal ATM Robbery : ఉత్తర్ ప్రదేశ్ నుంచి బతుకుదెరువు కోసం వరంగల్ కు వచ్చిన కొందరు వ్యక్తులు దొంగతనాలను ఎంచుకున్నారు. ఏటీఎం సెంటర్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడటం మొదలుపెట్టారు. ఏటీఎం మెషీన్ లో పట్టేంత ప్లాస్టిక్ పట్టీ, చిన్నపాటి స్క్రూ డ్రైవర్, ఫెవిక్విక్ ఈ మూడింటిని ఉపయోగించి కస్టమర్ల సొమ్మును తెలివిగా కొట్టేసేవారు. ఖాతాదారులు, బ్యాంక్ అధికారుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో కేసు నమోదు చేసిన పోలీసులు.. టెక్నిక్స్ తో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా ఆటకట్టించారు. అందులో ఇద్దరు యువకులతో పాటు మరో బాలుడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ కు సంబంధించిన వివరాలను హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్ రెడ్డి వెల్లడించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఫత్తేపూర్ కు చెందిన శుభమ్, అతడి గర్ల్ ఫ్రెండ్ ప్రియాంక బతుకు దెరువు కోసం వరంగల్ నగరానికి వచ్చారు. ఇక్కడ బట్టల షాపుల్లో పని చేస్తూ జల్సాలకు అలవాటు పడ్డారు. కానీ వచ్చే జీతం ఖర్చులకు సరిపోకపోవడంతో ఈజీగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఎవరికీ చిక్కకూడదనే ఉద్దేశంతో ఏటీఎం చోరీలకు ప్లాన్ వేసుకున్నారు.
సింపుల్ టెక్నిక్ తో చోరీలు
ఏటీఎం చోరీలు చేసేందుకు నిర్ణయించుకున్న శుభమ్, అతని గర్ల్ ఫ్రెండ్ ప్రియాంక నగరంలో కొన్ని ఏటీఎం సెంటర్లను ఎంచుకునేవారు. అనంతరం అక్కడికి వెళ్లి డబ్బులు తీస్తున్నట్టు యాక్షన్ చేసేవారు. కానీ డబ్బులు తీస్తున్న పేరున.. ఏటీఎం మెషీన్ నుంచి డబ్బు బయటకు వచ్చే మార్గానికి అడ్డుగా ఎవరికీ కనిపించకుండా ఉండేలా ఒక ప్లాస్టిక్ పట్టీని అమర్చేవారు. దానికి ఫెవిక్విక్ తో అంటించి, ఆ పక్కకు వెళ్లిపోయేవారు. ఆ తరువాత ఎవరైనా ఖాతాదారులు వచ్చి డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నిస్తే.. డబ్బులు బయటకు రాకుండా.. నిందితులు అమర్చిన ప్లాస్టిక్ పట్టీ వద్దే ఆగిపోయేవి. ఎంతసేపటికీ డబ్బులు బయటకు రాకపోవడంతో ఖాతాదారులు అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. అక్కడ కస్టమర్లు ఎవరూ లేరని నిర్ధారించుకున్న తరువాత శుభం, అతని గర్ల్ ఫ్రెండ్ ప్రియాంక ఇద్దరూ ఆ ఏటీఎం సెంటర్లోకి వెళ్లేవారు. అనంతరం తమ వద్ద ఉన్న స్క్రూ డ్రైవర్ తో అడ్డుగా అతికించిన ప్లాస్టిక్ పట్టీని తొలగించి, అక్కడ ఆగిన డబ్బులు తీసుకుని వెళ్లిపోయేవారు.
మరో ఐదుగురికి ట్రైనింగ్ కూడా..
ఏటీఎం చోరీలు చేస్తూ శుభమ్, ప్రియాంక జల్సాలు చేసేవారు. ఇదిలా ఉంటే వరంగల్ నగరంలోని బట్టల షాప్ లో పని చేసే శుభమ్, ప్రియాంకకు వారి స్వరాష్ట్రానికి చెందిన శివ్ వీర్ సింగ్, అనీశ్ సింగ్, సత్యవీర్, ప్రియాంక్ సింగ్ అనే నలుగురితో పాటు మైనర్ కూడా పరిచయమయ్యాడు. ఈ క్రమంలో శుభమ్, ప్రియాంక ఇద్దరూ ఇష్టారీతిన ఖర్చు చేస్తూ ఎంజాయ్ చేయడాన్ని ఆ ఐదుగురు గమనించారు. ఆ రహస్యమేంటో తమకు కూడా చెప్పాలని కోరారు. దీంతో వారికి శుభమ్ అసలు విషయాన్ని చెప్పాడు. ఆ పని తమకు కూడా నేర్పించాలని కోరడంతో వారిని ఆంధ్రప్రదేశ్, నాగపూర్, చంద్రాపూర్ తదితర ప్రాంతాల్లో తిప్పుతూ ఏటీఎం చోరీ టెక్నిక్స్ నేర్పించాడు. ఈ క్రమంలోనే తమ టెక్నిక్స్ తో హనుమకొండ నయీంనగర్ కెనరా బ్యాంక్ ఏటీఎంలో రూ.1000, వరంగల్ ఎంజీఎం ఎస్ బీఐ ఏటీఎం సెంటర్ లో రూ.10 వేలు, హనుమకొండ లోకల్ బస్ డిపో మార్గంలో ఉన్న కెనరా బ్యాంక్ ఏటీఎం నుంచి రూ.6,500, హనుమకొండ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ ఏరియాలోని కెనరా బ్యాంక్ ఏటీఎంలో రూ.1000, హనుమకొండ పద్మాక్షి టెంపుల్ సమీపంలోని ఏటీఎం నుంచి రూ.5 వేలు చోరీ చేశారు.
బ్యాంక్ ఆఫీసర్ల ఫిర్యాదుతో కేసు
ఏటీఎం నుంచి డబ్బులు కట్ అవుతున్నా తమ చేతికి మాత్రం రాకపోవడంతో బాధితులు కొంతమంది బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ నగరంలో తరచూ ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువవుతుండటంలో వివిధ బ్యాంకుల అధికారులు చివరకు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఏటీఎం సెంటర్లలోని సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కదలికలపై నిఘా పెట్టిన హనుమకొండ పోలీసులు శివ్ వీర్ సింగ్, అనీశ్ సింగ్ తో పాటు మరో మైనర్ ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులైన శుభమ్, అతని గర్ల్ ఫ్రెండ్ ప్రియాంక, సత్యవీర్, ప్రియాంక సింగ్ పరారీలో ఉన్నారు. కాగా నిందితులను పట్టుకున్న హనుమకొండ సీఐ సతీశ్, సీసీఎస్ సీఐ అబ్బయ్య ఇతర అధికారులను హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి అభినందించారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)