Warangal Kidnap : వరంగల్ లో వడ్డీ వ్యాపారి దారుణం, అప్పు తీసుకున్న వ్యక్తి కిడ్నాప్-రూ.28 లక్షలకు బలవంతపు సంతకాలు
01 May 2024, 16:38 IST
- Warangal Kidnap : వరంగల్ లో వడ్డీ వ్యాపారి దారుణానికి పాల్పడ్డారు. రూ.40 వేల వడ్డీ కోసం అప్పు తీసుకున్న వ్యక్తిని కిడ్నాప్ చేయించి రూ.28 లక్షలు బాకీ ఉన్నట్లు ప్రామిసరీ నోట్లు రాయించుకున్నాడు. ఈ ఘటన వరంగల్ సీపీ వరకూ వెళ్తే గానీ పోలీసులు స్పందించకపోవడం విశేషం.
అప్పు తీసుకున్న వ్యక్తి కిడ్నాప్
Warangal Kidnap : వరంగల్ జిల్లాలో వడ్డీ వ్యాపారులు(Moneylenders) రెచ్చిపోయారు. రూ.40 వేల వడ్డీ కోసం అప్పు తీసుకున్న వ్యక్తిని కిడ్నాప్(Warangal Kidnap) చేశారు. అనంతరం రూ.28 లక్షలు బాకీ ఉన్నట్లుగా తప్పుడు ప్రామిసరీ నోట్లు(Promissory Notes) రాయించుకుని వేధింపులకు గురి చేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. చివరకు విషయం వరంగల్ కమిషనర్ వద్దకు వెళ్లడంతో పోలీసులు కేసు నమోదు చేసి, ఐదుగురిని రిమాండ్‌కు తరలించారు. బాధితులు, పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన చెనుమల్ల సమ్మయ్య వడ్డీ వ్యాపారం(Money Lending) చేస్తుండేవాడు. ఆయన ఇంటి ఎదుట ఉండే వలిపిరెడ్డి సుగుణ–మధుసూదన్ దంపతులు కూడా ఆయన వద్ద 2009 నుంచి వ్యాపార అవసరాల నిమిత్తం అప్పు తీసుకుంటూ చెల్లిస్తూ వచ్చారు. ఈ క్రమంలో 2016లో రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చి ప్రామిసరీ నోట్ రాసుకున్నారు. అప్పు ఇచ్చే సమయంలో మధుసూదన్ కు చెందిన ఇంటి పేపర్లతో పాటు తులం బంగారాన్ని కూడా సమ్మయ్య కుదువ పెట్టుకున్నాడు. ఆ తరువాత కొంత కాలానికి మధుసూదన్ దంపతులు అసలు రూ.2 లక్షలు చెల్లించారు. ఆ మొత్తానికి రూ.40 వేల వడ్డీ కాగా దానిని చెల్లించేందుకు సమయం అడిగారు. ఆ సమయంలో సమ్మయ్య ఖాళీ పేపర్ మీద సంతకం చేయించుకున్నాడు. కొంత కాలం తరువాత వడ్డీ డబ్బులు(Interest Amount) చెల్లించి ఇంటి పేపర్లు తిరిగి తెచ్చుకునేందుకు మధుసూదన్ సమ్మయ్య వద్దకు వెళ్లగా.. తనకు ఇవ్వాల్సింది రూ.10 లక్షలని, ఆ డబ్బులు ఇస్తేనే ఇంటి పేపర్లు ఇస్తానని తెగేసి చెప్పాడు.
పైసలు ఇవ్వడం లేదని కిడ్నాప్
తనకు ఇవ్వాల్సిన రూ.10 లక్షలు ఇవ్వాల్సిందిగా సమ్మయ్య పలుమార్లు మధుసూదన్ ని అడగగా.. తాను ఇవ్వాల్సింది కేవలం రూ.40 వేలేనని, అంతకుమించి పైసా ఇచ్చేది లేదని మధుసూదన్ చెప్పాడు. దీంతో కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో చెనుమల్ల సమ్మయ్య పరకాలలో రిపోర్టర్ గా పనిచేస్తున్న కానుగంటి కరుణాకర్ ని సంప్రదించాడు. మధుసూదన్ వద్ద నుంచి డబ్బులు ఇప్పిస్తే రూ.50 వేలు ఇవ్వాలని ఒప్పందంతో కరుణాకర్ అతని పరిచయస్తులైన పరకాలకు చెందిన మేకల దిలీప్, బొచ్చు రమేష్, దండ్రే వెంకటేష్ లతో కలిసి ఏప్రిల్ 22న మధుసూదన్ ను కిడ్నాప్ (Kidnap)చేశారు. ఆయన పనిచేసే మేదరి షాపు వద్దకు వెళ్లి బలవంతంగా కారులో ఎక్కించుకొని చౌటుపర్తి గుట్టల వద్దకు తీసుకెళ్లారు. అందరూ కలిసి బెదిరించి బలవంతంగా రూ.28 లక్షల రూపాయలకు ప్రామిసరీ నోట్(Promissory Notes) రాయించుకుని సంతకాలు తీసుకున్నారు. తర్వాత అతని రెండు గంటలపాటు కారులో తిప్పి తిప్పి అతడి షాప్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు.
లైట్ తీసుకున్న పోలీసులు
మధుసూదన్ కిడ్నాప్(Kidnap) విషయం తెలిసిన వెంటనే భయాందోళనకు గురైన ఆయన భార్య సుగుణ డయల్ 100కు కాల్ చేసింది. తన భర్తను కిడ్నాప్ చేశారని, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వేడుకుంది. కానీ పోలీసులు(Police) సరిగా స్పందించలేదు. ఆ తరువాత ఏప్రిల్ 23న పరకాల ఏసీపీని కలిస్తే కిడ్నాప్ విషయం పక్కన పెట్టి, సమ్మయ్య తీసుకున్న రూ.10 లక్షలు ఎప్పుడిస్తారని తమను ప్రశ్నించినట్లు బాధితులు వాపోయారు. ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయి వరంగల్ సీపీ(Warangal CP) అంబర్ కిశోర్ ఝాను కలిశారు బాధితులు. విషయం సీపీ ఆఫీస్ దాకా వెళ్లడంతో పరకాల పోలీసులు(Parkal Police) మధుసూదన్‌ను కిడ్నాప్ చేసిన వారిపై ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఏప్రిల్28న ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేసి, 30వ తేదీన కానుగంటి కరుణాకర్, మేకల దిలీప్, బొచ్చు రమేశ్, చెనుమల్ల సమ్మయ్య, చెనుమల్ల అనిల్‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.28 లక్షలకు సంబంధించిన ప్రామిసరి నోట్, ఒక ఎర్టిగా కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పరకాల కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వివరించారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)